ఇతిహాసములు ఉత్తరరామాయణము శ్రీరాముఁడు వైకుంఠధామంబునకు వేంచేయుట
శ్రీరాముఁడు వైకుంఠధామంబునకు వేంచేయుట
వ.వేంచేయునప్పు డుప్పరం బొరయుచప్పుడులతో నెడమీక సందర్శించు తలంపులఁబైపైఁ బడి క్రందుసేయు బృందారకాదులసందడి జడియక కనకమణివిచిత్రవేత్రపాణియై సూత్రవతీకళత్రుండు ముందర బరాబరు లొనర్చునెడ నుప్పతిల్లుహుంకృతుల నలంకరించు పరిసరస్థలానుచరచామరక రామరకన్యకా నవ్యరత్న సంకలితకంకణక్రేంకృతులకు శ్రుతులగు తదీయకబరీభరనిబిడీకృతకుసుమ మాలికావాసనోన్ముఖముఖ రభ్రమరపాలికా ఝంకృతులకళుకు నింద్రపురస్కృతై రావణదంతావళరాజంబుఘీంకృతుల నావరించు సౌరభేరీభూరిభాంకృతుల నప్పళించు సుపర్ణసువర్ణపర్ణ ఝాంకృతుల ననుసరించునందసునంద కుముదకుముదాక్ష పుష్పదంత చండప్రచండప్రముఖ పార్శ్వచరహుంకృతులు నిఖిలదిగ్భాగంబు లాక్రమించె నివ్విధంబున నవ్విహంగవాహనుండు భువర్లోకనివాసులయాసలు దీఱదర్శనం బొసంగుచు సువర్లోకమందిరులయభివందనంబు లంగీకరింపుచు మహర్లోకలోకుల నమోనారాయణాయేతివాక్యంబు లాకర్ణింపుచు జనర్లోకజ నంబుల పూజనంబుల నలరుచుఁ దపోలోకతపోధనులసేవాంజలుల గ్రహించుచు సత్యలోకసంచారు లోన్నమోనారాయణాయేతి మంత్రోచ్చారణ పూర్వకంబుగా సమర్పించిన యర్ఘ్యపాద్యాదులంజేకొనుచు సంతాన లోకజనులు గురియించు సంతానకుసుమవర్షంబుల హర్షంబులనొందుచు గోలోక ప్రచారులు నివేదించు కానుకలంగీకరింపుచుధ్రువాదిపరమభాగవత జేగీయమానుండును దేవర్షిబ్రహ్మర్షి సహగమ్యమానుండును నఖండశతకోటి మార్తాండమండల ద్యోతమానుండును ననేక దివ్యాభరణ మణిప్రభా శోభమానుండును నై యుదక్పథంబునన్‌ జనిచని శరచ్చంద్ర చంద్రికాస్నిగ్ధ దుగ్ధజలధి సమావేష్టనశ్వేతద్యుతిప్రద్యోతిత శ్వేతాంతరీపప్రదీపితజ్వలనజ్వాలికా సమానభాసమాన హిరణ్యధరణ్యంతరంబు దఱియన్‌ జొచ్చి తన్మధ్యంబునన్‌ బునర్జననకారణలింగశరీర నికారణవిధానంబు శరాభిధానంబును స్నాతకజనజరామరణక్షుత్పిపాసాద్యుపాధి విరామప్రభావంబును నమృత ప్రభావంబును సదాసదాశ్రయతాతిశయంబునఁ బుష్కరాహ్వయంబును యథార్థంబుగావించు సుధామధుర శిశిరలఘుతరసలలితసలిలంబు లడంబుగని సకలసత్త్వమహనీయంబయ్యున్‌ దపనీయసౌగంధికగంధ సంబంధబంధుర పుష్పంధయగరుత్ప్రచయతమఃపరిచయంబు గలిగి యభంగతరతరంగరంగత్కమలకుడుంగసంగ చక్రాంగచక్రవళక్ష పక్షవిక్షేపణో జ్జాతవాత వేగసమంతతఃపరిపాతితరజోవికాసంబునన్‌ దనరియు విరజానామంబునం బ్రకాశించునదీలలామంబుచే నావృతంబై యూర్ధ్వ ముఖానంతఫణాక్రాంతబహిర్ది శాంతరానంతనితాంత ధవళవపుర్వి భావిశేషసూచకనిష్కలుష పురుషోపలప్రకరప్రకల్పిత శిల్పకల్పనా కల్పవిశాలసాల జాలాచ్ఛతరచ్ఛవిచ్ఛటాది పాండురిత బ్రహ్మాండకరండంబును నభోమండలార్ణవశైవలాయమాన శక్రనీలశిలాశకల సంఘసంఘటితోత్తుంగ గోపురనీలరుచిరరుచి సమాయాతతమోవ్యాపృత తదగ్ర సంస్థాపితశాత కుంభకుంభాభినవదివాకరబింబనికరాలోకలోకాలోకావలోకన విస్మయరసావేశ కారణంబును సార్వకాలపల్లవితపుష్పిత ఫలితసల్లలితవివిధవిద్రుమకుంజ మంజువన భవనోపవన చారణసంతతాత్మ నారాయణనామస్మరణ క్రీడాపరాయణ కలకంఠ నీలకంఠ శుకముఖనిఖిలఖగజాతచేతనానూతన ప్రవాళదళ వ్యూహ వారివాహబింబికాఫలమోహకారివిద్రుమద్రుమల తాసితపట్టాంభరవితానపద్మరాగకపోత పాలికాభిరామంబును గోమల దూర్వాదళశ్యామలప్రకాశామలగారుత్మతరత్న యూధసముత్సేధ సౌధశిఖరాభ్రంకషగరుడ కేతనద్యోతమాన శ్వేతపటపటలద్యుతివ్యంజిత త్రిభువనాక్రమణోపక్రమవిక్రమ త్రివిక్రమోర్ధ్వప్రసారిత చరణాంగుష్ఠ నఖశిఖాముఖనిర్గళితావరణపయోధిపయోధారాప్రవాహంబును గేళికాచకోరపాళికాజ్యోత్స్నాయమాన మానిక జ్యోతిరుత్కటస్ఫటికదృషత్ప్రకటిత ప్రతికుడ్యభాగ చిత్రతనిజదశావతార కథాసూత్ర చిత్రసందర్శనానంద పరసలోకలోకమిథస్సంభాషణవిధాధికనిరవధిక వివిధవీథికాశత సహస్ర సందానిత మందారమాలికాకలితవన మాలికా ఘుమఘుమాయ మానంబును నవరత్న ఘటితకిరీటమకరకుండలాంగద కంకణాంగుళియక కౌస్తుభహార శ్రీవత్సవైజయంతీ వనమాలికాకనకకౌశేయ చతుర్భుజశంఖచక్రకౌమోదకీశారఙ్గనందకాద్యక్షీణలక్షణలక్షిత సురూప సరూప ధారావరా రోహణార్హ రోహిణాచలలసమానవిమానశతకోటికోటిసంకీర్ణ కింకిణీకిణకిణారవా పూరిత దశదిశావకాశంబును వైదూర్యవిరచిత క్రీడాచలరాడధిత్యకాచరన్నీలక చామణిముఖ చంద్రసేవాసమాగతతారకావారక భ్రమాకర ముక్తాఫలవిలసి తోపకారికానికాయ ప్రకాశమాన ప్రసూన సరధ్వజచ్ఛత్ర చామరచిత్రాంబర ముకురాద్యలంకార దరీదృశ్యమానంబును గోమేధికరత్నఖచితానేకమండ పాంగణ మహనీయమాణిక్యమయ రంగవల్లికామతల్లి కాంశువల్లికావేల్లి తంబును ఋష్యరాగమణివిభాసురప్రాసాదసమాసాదిత జాతరూప వాతాయన రంధ్రాంతికనిస్తంద్ర చంద్రకాంతకాంతవేదికాంతరకాంతాకాంత విలోచనేందీ వరదళార్చిత పథిగతాగత భాగవతపదాంబుజంబులు ఘనసారగంధసార కాశ్మీరకస్తూరికాదిపరిమళనిత్యనివాసంబును నై కర్బురాలోకదూరంబు గాకుండియుఁ గర్బురాలోకదూరం బయి బహువిధరత్నకర్బుర కాంతులం దేజరిల్లి చిత్రభానుసంభావితంబు గాకుండియుఁ జిత్రభానుసంభావితం బయి యనంతమణివిలాసాస్పదంబు గాకుండియు ననంతవిలాసాస్పదం బయి స్వస్ఫురిత ప్రకాశాన్వితంబు గాకుండియు స్వస్ఫురిత ప్రకాశాన్వితంబై చంద్రవిభవాశ్రయంబు గాకుండియుఁ జంద్రవిభవాశ్రయం బయి ప్రకృతిగోచరంబు గాకుండియుఁ బ్రకృతిగోచరం బయి కరంబు రాణించు శ్రీవైకుంఠనగరంబు చేరంబోయి త్రయస్త్రీంశత్కోటిపురద్వారపాలకులు సాలోక్యసామీప్యసారూప్యవంతులగు పరమభాగవతులు నఖిలప్రపంచమోహన శృంగారవతులగు యువతులు ననేకవిమానకాంతులు దిక్కులం బిక్కటిల్ల దివ్యగంధమాల్యాంబరాభరణ విభాసమానమూర్తులై యాడుచున్‌ బాడుచు నపరిమిత వాద్యవిశేషంబులు బోరుకలంగ నెదుర్కొని పుష్పాంజలు లిచ్చువారును నానందనర్తనంబు లొనర్చువారును నారాయణవిష్ణు కృష్ణగోవిందముకుందాది దివ్యనామంబు లుగ్గడించి సంకీర్తనంబు సలుపువారును గోటికందర్పసౌందర్య సుధారసంబు నేత్రాంబుజంబులఁ బానంబుఁ జేసి రోమాంచకంచుకితాంగు లగువారును నాలవట్టంబు లుభయచామరంబులు ముత్యాలగొడుగులు గరుడటెక్కెంబులు కనకవేత్రంబులు బంగారుసురఁటులు సౌవర్ణతాళవృంతంబులు నమృతపూర్ణహైమకలశంబులు మొదలయినవి ధరియించి వివిధ కైంకర్య పరాయణత్వంబున నగ్రభాగంబున నడుచువారును నై సందడించువైకుంఠ నివాసులతో ముప్పదిమూఁడుకోట్లదేవతలతో బ్రహ్మరుద్రాదిలోకాధికారులతోఁ బురప్రవేశంబు గావించి యెడనెడవైష్ణవీరత్నంబులు కర్పూరనీరాజనంబులు ముత్యాలసేసలుసమర్పింపఁ గోటలు గోపురంబులు గొలువుకూటంబులు రత్నమండపంబులుఁ జలువచప్పరంబులు రాజమార్గంబులుఁ గృతకాచ లంబులుఁ గనకసౌధములుఁ దోరణస్తంభంబులం జూచుచు సకలవిశేషంబుల నొప్పునప్పురంబు నట్టనడుమ నిట్టలంపుఁబులుదిండిచట్టులం గట్టిన యభ్యంతరవప్రగోపురద్వారంబునం గట్టినకుందనంపుఁ జెట్టుపలన్‌ గనుపట్టు పిట్టహుమాయితేజి డిగ్గె నయ్యవసరంబున.294
సీ.వలపటనుండి చౌవంచమోములదునే - దారి నెయ్యమునఁ గైదండ యొసఁగెఁ
గళుకువజ్రంపుఁ జెక్కడపుమేల్పావలై - ఫణిలోకవిభుఁడు శ్రీపదము లానెఁ
జారుముక్తామయచ్ఛత్రంబు ధరియించి - యెడఁ బాయక సునందుఁ డనుసరించెఁ
గడవన్నె తళుకుబంగరువీజనముఁ బూని - విసరుచు ఖగరాజు వెంబడించెఁ
 
తే.గీ.గమ్మబాగాలొసఁగె నూడిగము వహించెఁ
బుష్పదంతుఁడు సేనానిభూరివేత్ర
పాణియై యగ్రమున బరాబరులొనర్చె
హరినిజాభ్యంతరముఁ జేరునవసరమున
295
సీ.బలువేల్పురాప్రతిమలచెక్కడపుగండ - పెండెంబు డాకాల బెరిమెఁ జూపఁ
గటిబద్ధకనకాంశుకంబుపై మణులయ - డ్డిగలయొడ్డాణంబు జిగి దలిర్పఁ
దళుకుఁ గుంకుమపుఁ గందపుఁబూత నెఱపుచు - నురమునఁ గౌస్తుభం బొప్పుగులుక
నాజానులంబిబాహాచతుష్టయమునఁ - బంచాయుధస్ఫూర్తి పరిఢవిల్ల
 
తే.గీ.మకరకుండలవజ్రసంపదలతోడ
ముకురతులితకపోలముల్‌ ముచ్చటాడ
స్వర్ణకోటీరరుచిరత్నవలభు లొలయ
నవ్విభుఁడు సేరె మొదటికక్ష్యాంతరంబు
296
సీ.ఫలములఁ గాంక్ష నిల్పక నిజాంఘ్రులు గొల్చి - తపములు సేసినధన్యమతులు
నారాయణసమర్పణం బంచు వివిధయ - జ్ఞంబు లొనర్చిన శాంతినిధులు
గోవింద నృహరి ముకుంద మాధవ యంచుఁ - దనుసంస్మరించిన దాంతియుతులు
తీర్థయాత్రలు పోయి దివ్యదేశంబులఁ - దనువులు విడిచిన ధైర్యపరులు
 
తే.గీ.వేయితుళసీదలము లెంచి వేయిపేళ్ళ
దినమును స్వకీయపూజ సల్పిన కృతార్థు
లచటనుండి క్రియాశక్తి ననుసరించి
యెదురుకొని యర్చ లిచ్చిన నిచ్చ నలరి
297
మ.ధవునిన్‌ సాధ్వి భజించుపోల్కిఁ దనకున్‌ దాసత్వమున్‌ జెంద భ
క్తివిశేషంబునఁ గొల్చుసాత్త్వికులు వర్తింపంగ ఠావైన రెం
డవకక్ష్యాంతరమున్‌ రమాధిపుఁడు వేడ్కన్‌ డాసిఁ తద్భక్తపుం
గవు లిచ్ఛాహ్వయశక్తితో నొసఁగుసత్కారంబులం బ్రీతుఁడై.
298
మ.వనజాక్షుండఖిలాత్మకత్వమున సర్వవ్యాపి యై యుండ నా
యన గాకున్న దొకండు లేదనువిశిష్టాద్వైతిసంఘంబు పా
యని యమ్మూఁడవకక్ష్యఁ జేరి కమలాధ్యక్షుండు చిచ్ఛక్తితోఁ
దనకున్‌ వారు సపర్య లియ్యఁ గొని మోదం బొప్పఁగా నావలన్‌
299
మ.చని పూర్వం బవధూతచర్యల యదృచ్ఛాలాభసంతుష్టు లై
తనురక్షాదికకృత్యముల్‌ దొఱఁగి కాంతాద్రవ్యకాంక్షావివ
ర్జను లౌనిత్యవిరక్తులున్న చతురంచద్ద్వారమున్‌ జేరి య
వ్వినయాఢ్యుల్‌ విమలాభియుక్తిఁ దను సేవింపన్‌ బ్రహర్షింపుచున్‌
300
చం.ఇరువదినాల్గుతత్త్వముల నేర్పడఁ గన్గొని వాని కవ్వలన్‌
బరఁగెడి పంచవింశకుని భావన సేయుచుఁ జిద్వివేకవి
స్ఫురణల మించు సాంఖ్యులకుఁ జోటగు నైదవవాకిటన్‌ దయా
కరుఁ డతఁ డొందె హ్రీయనెడి కామినిచే వివిధోపచారముల్‌
301
మ.సరసీజాక్షునిఁగాఁ జతుర్భుజునిఁగా సౌవర్ణకౌశేయుఁగాఁ
బరమానందునిఁగాఁ బ్రసన్నముఖుఁగాఁ బ్రాదేశమాత్రాంగుఁగా
నిరతంబున్‌ దనుఁ జింత చేసిన సుధీనిర్దోషరత్నాళి కా
కర మౌ నాఱవచోటఁ దుష్టివలనన్‌ గాంచెన్‌ విభుం డర్చనల్‌
302
సీ.నానావిధానూననాడికాశోధనా - భ్యంతరాంగికశుద్ధు లాచరించి
దేశికాకలితోపదేశపద్ధతి యమ - నియమాదియోగాతిశయము లెనసి
పరఁగుప్రాణాయామ బాహుళ్యమున సుషు - మ్నాగర్భమునను బ్రాణములు సేర్చి
కుండలి మేల్కొల్పి మండుజాఠరశిఖి - జ్వాలసుధాధారఁ జల్ల చేసి
 
తే.గీ.యూర్ధ్వముఖషట్పయోజనాళోపరిప్ర,
భాసురసహస్రదళపద్మవాసిహంస
సంగతి రహించుహఠయోగిజనులు పుష్టి
గలసి సేవింప సప్తమస్థలముదాఁటి
303
కం.ఆనందకకరుఁ డార్యజ
నానందకరుండు వారిజాక్షుఁడు బ్రహ్మే
శానామరేంద్రవిష్వ
క్సేనాదులఁ గూడి యవలికిన్‌ జనువేళన్‌
304
సీ.కొల్లాటమండలోత్ఫుల్లచంద్రికలతో - విహరింప నేర్చిన విమలమతులు
రవిశశాంకాగ్రజాగ్రత్తారకజ్యోతు - లొకటిగాఁ దిలకింప నోపుధన్యు
లానందతానాహతానూనగానంబు - చవి యెఱింగిన మహాసౌఖ్యనిధులు
శాంభవీముద్రాశ్వసంరూఢులై వట్టి - బయలు ప్రాఁకఁగ జాలు బ్రహ్మవిదులు
 
గీ.జననమరణా ర్తిముఖసమిత్సమితి యనుభ
వాగ్ని వేల్చినఘనయజ్వలనఁ దనర్చు
రాజయోగాహ్వయప్రాజ్యరాజ్యకర్త
లష్టమద్వారగతు లౌట హరినిఁ గాంచి
305
కం.సనకసనందనముఖులగు
ననఘులతో నెదురుకొని ప్రియంబునఁ బూజిం
చిన నలరుచు శ్రీధరుఁ డ
జ్జనముల వీడుకొని యవలఁ జనుసమయమునన్‌
306
సీ.గిలుకుమెట్టియలమ్రోఁతల కంతికాంగుళీ - భూషణార్భటిప్రియంబులు గణింప
మంజీరసంజాతశింజారవములకు - రాయంచరవళి పరాకు దెలుపఁ
గాంచిఘంటాఘణంఘణలకుఁ గరల - సత్కంకణధ్వనులు కైదండ యొసఁగఁ
గర్ణోత్పలాళిఝంకారంబునకుఁ గచో - ద్దేశికేకిరుతంబు తెరువు సూప
 
తే.గీ.సూత్రవతియాదిగాఁగలవేత్రవతులు
నలుగడల నిండుసందడి దొలఁగఁద్రోయ
నిరుగడల ధారుణీనీళ లేఁగుదేర
నిందిరాదేవి గోవిందు నెదురుకొనియె
307
చం.ఎదురుగ వచ్చి యచ్చెలువ యింపగువాలు మెఱుంగుఁజూపులన్‌
మొదట నివాళి యిచ్చి ప్రియమున్‌ భయమున్‌ వినయంబు నెమ్మదిన్‌
గుదికొని పిమ్మటన్‌ యువతికోటులతోఁ దపనీయపాత్రికా
సదమలరత్నదీపికల శౌరికి నారతు లెత్తె వేడుకన్‌
308
ఉ.ఆరతు లెత్తువేళ జవరాలిముఖాబ్జము తేటఁ జూచు నొ
య్యారపుఁజూపుఁ జూచు బిగియారుచనుంగవఁ జూచు మేని సిం
గారముఁ జూచుఁ జెక్కుల ప్రకారముఁ జూచు ముకుందుఁ డెంతయున్‌
గౌరవమొప్ప నెన్నఁడును గాననివస్తువుఁ గన్నకైవడిన్‌
309
శా.ఆలో భూమి ధరించె వీజనము నీలాబ్జాక్షి కర్పూరతాం
బూలం బర్పణసేయు నూడిగములన్‌ బొల్పొందె శ్రీదేవియున్‌
గైలా గిచ్చె ననేకవార్షికవియోగప్రాజ్య చింతాభర
వ్యాలోలత్వముఁ బాసి కేశవుఁడు హర్షాంభోధి నోలాడఁగన్‌
310
మ.కమలాకామిని పాణిపంకజము సోఁకన్‌ మై గగుర్పార న
క్కమలాక్షుం డనిశంబు సాత్త్వికమునన్‌ గన్పట్టియున్‌ సద్విలా
సమునన్‌ సాత్త్వికమూనెఁ బక్షివరవిష్వక్సేనశేషాదికుల్‌
దమశృంగారకళావిశేషములు సందర్శించి హర్షింపఁగన్‌
311
శా.ఈలాఁ గిందిరఁ గూడి మందరధరుం డిర్వంకలన్‌ వైష్ణవీ
జాలంబుల్‌ వివిధోపచారము లొనర్పన్‌ జొచ్చె జంభద్విష
న్నీలాంభోరుహరాగవజ్రముఖమాణిక్యోరుశిల్పాంచిత
స్థూల స్తంభకవాటకోటిఁ జెలు వౌశుంభన్నిజాస్థానమున్‌.
312
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju