| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | పరమపదవర్ణనము |
| వ. | అది మఱియు ననంతదివ్యరత్నసమాజతేజఃపుంజంబున కాస్పదం బయి యపరిమితవిచిత్రచిత్రాంబర సువర్ణవర్ణ పట్టాంశుకప్రతానంబులన్ గట్టిన మేలుకట్ల చెన్నునన్ గన్నులకు మిఱుమిట్లు గొల్పుచు నలుదిక్కులన్ బిక్కటిల్లు హరిచందనమందారకల్పకసంతానపారిజాతప్రసూనవాసనల కాస్పదం బయిన యత్యున్నతస్ఫటికమయమహాస్తంభకోటుల నీటుల దీటులేక యనేక బ్రహ్మాండసహస్రంబులన్ గలప్రాణు లెల్ల నొక్కపరి పఱతెంచి నిల్చిన నొక్కయంకణంబునకుంజాల దనం జాలుచాలుపుఁ గలిగి యగణేయ దృగంబుజంబులు గలనిజనాథుని వలె నలఘుతరవజ్ర జాలకరచిత జాలకరంధ్రనికాయంబుల నవలోకనీయంబై కమనీయమౌక్తికమయప్రాలంబ మాలికాపరంపరలపెంపున నింపొనర్చుచు దర్పణంబుల టెక్కునఁ దళుక్కున మెఱయుకాంతిమచ్చంద్ర కాంతకాంతకుడ్యాంతరంబుల నెంతయు వింతయై చింతామణీగణనిబద్ధవిశాలవితర్దికానికరంబులన్ గరంబు రాణించి కెంపుటిటికగములన్ గట్టినయట్టలంపుమెట్టులన్ గనుపట్టి సుషమాధిక గోమేధికతోరణప్రాంచిత పుష్యరాగవిటంకభాగభాగతతుల నతులంబై స్వయంప్రకాశకంబై నిత్యముక్తాశ్రయంబై త్రైకాలికసత్యంబై స్వతస్సిద్ధంబై ముముక్షుజనాపేక్షణీయంబై శుద్ధసత్త్వానందకరంబు గావున నానందమణి మండపం బనఁ బ్రసిద్ధంబైన సభామండపంబుం బ్రవేశించి యందు శేషాత్మకంబై చెలువొందు నశేషవిశేషరత్న చిత్రితభద్రాసనంబుపై వసియించి శ్రీదేవి నురంబున నుంచుకొని భూనీళల నిరుపార్శ్వంబుల నిడుకొని యనంతగరుడవిష్వ క్సేనాదినిత్యులలో శంఖచక్రగదాశారఙ్గ నందకాభిరాములు నీలమేఘశ్యాములు విగతమోహులు నాజానులంబిచతుర్బాహులుఁ గౌస్తుభ హారకేయూరమకరకుండలాదిదివ్యభూషణధారులుఁ గనకాంబరధారులు వైజయంతీవనమాలికావక్షులుఁ బుండరీకాక్షులుఁ గుడాకేశులు నభంగుర ప్రకాశులు నగుసారూప్యధారులు దాను జూపిన విశ్వరూపంబువలె గణియింప నలవి గాక డాపలిపార్శ్వంబున నిలిచి సేవాంజలులు దాలిచి కొలువు సేయఁ బాంచజన్యంబుఁ బోలుకంఠంబులుఁ జక్రంబుఁ బోలుకటి మండలంబులు శారఙ్గంబుఁ బోలుకనుబొమలు నందకంబుఁ బోలుకీలుజడలుఁ గౌస్తుభంబుఁ బోలు కెమ్మోవులు శ్రీవత్సరుచులన్ బోలుముంగురులు నాభిపద్మంబుఁ బోలు ముద్దుమొగంబులుఁ గనకాంబరద్యుతులన్ బోలునెమ్మేనిచాయలు నీలాభిరామంబులగుఁ నూగారులు మీనాకారంబులగు బెళుకువాలుఁ జూపులు కమఠరూపసరూపంబు లగు ప్రపదంబులున్ గల వన్నెలాఁడులు చిన్నారికెంగేలు జిగురులన్ గనకకలశంబులుఁ గాళంజికలు గుంచెలు సురఁటులు నాలవట్టంబులు నుభయచామరంబులు మణిముకురంబులుఁ బరిమళకరండంబులు జిలుఁగుపావడలుఁ గర్పూరతాంబూలపేటికలుఁ గమ్మపూబంతులు గాంచనవేత్రంబులు మున్నైనవిధరియించి పెక్కువగల నూడిగంబులొనరింప సనకసనందనాదులుబాల్యంబు వహియించి లౌల్యంబు లేనిభక్తియోగంబునఁ జెంతనుండి కన్నుల ముదశ్రుపూరంబు లొలుక నానందనాట్యం బొనరింప శతానందుండు పులస్త్యవులహప్రముఖనవ బ్రహ్మలతో వలవంక నిలిచి సేవింప నేకాదశరుద్రులు బ్రమథగణంబులు గణేశ్వరగుహచండీశ్వరాదులుఁ దన్ను బరివేష్టింప నష్టమూర్తిరో మాంచకంచుకితమూర్తియై సహజస్నేహంబున ననువర్తింప నిలింపపాలకుం డఖిలలోకపాలకులతో ముప్పదిమూఁడుకోట్ల దేవతలొక్క చక్కిన్ బిక్కటిల్లనిటలఘటితాంజలియై భజియింపఁ జిత్రరథహాహాహూహూ ప్రముఖగంధర్వులతోఁ దుంబురు నారదాదులు పరివాదినులు మొరయింపుచు నింపుగా నిజబిరుదాంకితగీతంబులు వినిపింప ననుకంపాయతకటాక్షంబు లభిలషించి నలువదినాల్గుకోట్ల మహర్షులుపనిషత్పరంపర లుగ్గడింపుచు నొక్కదిక్కుననెనకొని యభినందింప రంభోర్వశీమేనకాదిచతుష్షష్టికోట్యప్సరః పాటలాధర లాటలన్ బాటలన్ బాటవంబు నెఱపుచు ముందట నటింప నభంగురప్రభావంబున నీడుజోడులేక శతకోటిమార్తాండమండల ప్రకాశంబు లొక్కరాశియైనట్లు ప్రచండతేజోవిశేషంబున దుర్నిరీక్షుండయి కోటిపుండ్రేక్షు కోదండుల చక్కఁదనంబులొక్కటియైనట్లు సకలలోకాశ్చర్యకరసౌందర్య లీలావిలాస విభ్రమావిర్భావహేతుదివ్యమంగళ విగ్రహంబుచే నభీక్షణీయుం డయి సప్తవ్యాహారగాయత్త్రి యగుగాయత్త్రిసీమంతపదాంత ముక్తామణికాంతుల నిజపాదనఖచంద్రిక లొలయన్ జేయుచుండఁ బురుషాకారంబులు వహించి కొలిచి యున్న ఋగ్యజుషాదుల నాదరింపుచు సరూపంబులయి కొలుచు స్మృతిపురాణేతిహాసప్రముఖవిద్యల సప్రేమంబుగా నవలోకింపుచు మేను లూనినయజ్ఞాది క్రియాకలాపంబుల సత్త్వజ్ఞానవైరాగ్యంబులన్ దగురీతి గారవింపుచు సర్వనియంతృత్వ సర్వభోక్తృత్వ సర్వకర్తృత్వ సర్వపాలకత్వసర్వ జ్ఞత్వాదిసర్వశక్తియుక్తుం డయి యఖండిత ప్రభావంబున నిండుకొలువుండె నయ్యవసరంబున. | 313 |
| శా. | శుక్సంభేదక తత్సభాస్థితబుధస్తోమంబు క్రందెల్ల వి ష్వక్సేనుండు కరాబ్జసంజ్ఞలను మాన్పన్ శౌరినెమ్మోమునన్ దృక్సంఘం బిడి హస్తముల్ మొగిచి గౌరీభర్త పల్కెన్ శిరో భాక్సౌపర్వధునీఘుమంఘుమరవప్రత్యగ్రవాగ్గుంభనన్. | 314 |