ఇతిహాసములు ఉత్తరరామాయణము శివుఁడు విష్ణువును స్తుతించుట
శివుఁడు విష్ణువును స్తుతించుట
శా.శ్రీమంతంబు సనాతనంబు దితిభూజిద్బాణబాణాసనో
ద్దామం బాశ్రితరక్షణక్షమము సీతాలక్ష్మణోపేత మా
ర్యామోదప్రద మాంజనేయహిత ముద్యత్తారకం బౌభవ
ద్రామాకారము నామనోంబుజమునన్‌ ధ్యానింతు నశ్రాంతమున్‌
315
శా.విశ్వాసంబున నార్తి మాన్పుఁ డని యీవేల్పుల్‌ మిమున్‌ వేఁడినన్‌
విశ్వామిత్త్రవిలుంఠనంబునకు నావిర్భావమున్‌ జెంది యా
విశ్వామిత్త్రహితంబు ముందుగనె ఠీవిన్‌ జేసి చెల్వొందు మీ
శశ్వచ్చిత్ర చరిత్రముల్‌ దలఁతు నశ్రాంతంబు స్వాంతంబునన్‌
316
శా.ఆదిత్యేందుహుతాశనప్రముఖదీవ్యత్కాంతిమచ్ఛ్రేణి కు
చ్ఛేదింపంగఁ దరంబు గాక దరమున్‌ జేకూర్చునగ్గౌతమ
స్త్రీదోషాంధతమిస్రమున్‌ క్షణములో ఛేదించి వెల్గొందు మీ
పాదాంభోజనఖాంశువుల్‌ నిటలమున్‌ బ్రాపింపఁగా మ్రొక్కెదన్‌
317
శా.ధర్మారంభనిరూఢు లై జనపతుల్‌ దార్కొందు రెందేనియున్‌
శర్మంబుల్‌ ధరణీసుతాపరిణయేచ్ఛన్‌ మీరు మున్నుద్ధతిన్‌
ధర్మచ్ఛేదన మాచరించిన విచిత్రం బెంత వర్ణింతునో
ధర్మాధ్యక్ష దిగీశరక్షణమహోదార ప్రభావోదయా
318
మ.వితతప్రౌఢిమ జామదగ్న్యుమది నావేశించి దుష్టక్షమా
పతులన్‌ దక్కక పెక్కుమార్లడఁచి భూభారంబు వారించి త
ద్గతతేజంబు శరాసనంబు గొనువీఁకన్‌ గ్రమ్మఱన్‌ గొన్నమీ
యతిగాంభీర్యపరాక్రమాదిగుణమాహాత్మ్యంబు లూహించెదన్‌
319
కం.గురువులకు నాదికారణ
గురుఁడని ప్రఖ్యాతిఁ గనియు గురునాజ్ఞ వనాం
తరమునఁ గాంతాసంగతిఁ
జరియించిన మీచరిత్ర శక్యమె పొగడన్‌
320
సీ.అఖిలలోకములకు నభయప్రదాతవై - యలరియు మునులకు నభయమొసఁగి
పుణ్యజనప్రీతిఁ బొరసియు ఖరదూష - ణాదిపుణ్యజనుల హతులఁ జేసి
యమృతంబు గొనుపక్షి నాది నేలియుఁ - గాన నమృతంబు గొనుపక్షి నాదరించి
యాదిత్యజాతకార్యముఁ బూని యుండియు - నాదిత్యజాతకార్యము వహించి
 
తే.గీ.వాలి నని నొంచి వనచరావళుల మన్చి
వనధి బంధించి దానవేశ్వరు జయించి
సీతఁ బ్రాపించి పురిఁ బ్రవేశించి మించి
ధరణియేలినమిముఁ గొల్తుఁ బరమపురుష!
321
కం.అని కొనియాడినశంభునిఁ
గనుఁగొని దరహాసవదనకమలుండై య
వ్వనజదళేక్షణుఁ డిటు లను
ఘనవర్షాంభోదనాదగంభీరోక్తిన్‌
322
మ.గిరిజాధీశ్వర! నీవు నీయజుఁడు నీగీర్వాణరాజాదిది
గ్వరు లీకిన్నరయక్షఖేచరమరుద్గంధర్వముఖ్యుల్‌ వనే
చరరూపంబులు దాల్చి శత్రుహతికిన్‌ సాహాయ్యమున్‌ జెందుటన్‌
సురవిద్వేషణుఁ డీల్గెఁ దాపసమనఃక్షోభంబు దీఱెన్‌ భువిన్‌.
323
తే.గీ.శిష్టజనరక్షణము దుష్టశిక్షణంబు
నవని నొనరించుకొఱకు నే నవతరించి
మత్కథాగాంగలహరి కామహిమ జనుల
పాపజంబాల మడఁగింతు ఫాలనయన!
324
శా.శ్రీరామాయణముఖ్యమామకకథా శ్రేణుల్‌ ప్రసంగింపుచున్‌
బారీణత్వము మీఱఁగాఁ జదువుచున్‌ బాటించి యాలింపుచున్‌
సారప్రజ్ఞ రహించు మానవులకున్‌ షడ్వర్గముల్‌ దీరుఁ జే
కూరున్‌ కోరిక లాఱు ఘోరదురితాగ్నుల్‌ మీఱు నైశ్వర్యముల్‌
325
తే.గీ.అని ప్రియంబున హరునితో నానతిచ్చి,
యబ్జగర్భాదిదివిజుల నాదరించి
కొంతవడికందఱనువీడుకొని కళత్ర,
ములుముగురుగొల్వహరియంతిపురముసొచ్చె
326
ఉ.చొచ్చి మెఱుంగుకెంపునునుసోరణగండ్లఁ గడానిలోపలన్‌
బచ్చలతల్పులన్‌ స్ఫటికబంధుర కుడ్యములన్‌ శశాంకర
త్నో చ్చయవేదులన్‌ వెలయునొక్కమహోజ్జ్వలసౌధమెక్కి యం
దచ్చపుఁబువ్వుఁజప్పరపుటందములన్‌ దగుమందిరంబునన్‌.
327
తే.గీ.కుందనపుఁదళ్కు చప్పరకోళ్ళఁగుల్కు
మేలిసకినలమంచంబు మీఁద నీవి
మ్రానిపూఁబాన్పుజిగి మించుమంజు శేష
శయ్యఁ గూర్చుండె హరి రమాసహితుఁ డగుచు.
328
తే.గీ.అపుడు భూనీళ లనురాగ మతిశయిల్ల
సురఁటి యడపంబు గొని కొల్వఁ జూచి వెన్నుఁ
డింతిడెందం బెఱిఁగి నవ్వి యిరుకరములఁ
బట్టి వారల గూర్చుండ బెట్టుకొనియె
329
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju