ఇతిహాసములు ఉత్తరరామాయణము పఠనశ్రవణాదిఫలము
పఠనశ్రవణాదిఫలము
తే.గీ.ఈమహాకావ్యమతిభక్తి నెవ్వఁడువిను
నతఁ డిహంబున సకలసౌఖ్యములఁ జెంది
తనివి గని యంతఁ బునరాగమనవిరహిత
శాశ్వతబ్రహ్మలోకవాసంబునొందు
339
సీ.ఇది త్రిలోక స్తవ్య మిది విబుధశ్రావ్య - మిది దివ్య మిది భవ్య మిది యఘవ్య
మక్షరసంభావ్య మాదికావ్యం బిది - ద్విజుఁడు పఠింప వాగ్విదుఁ డనఁదగు
క్షత్త్రియుండు పఠింప సర్వంసహాభర్త - యగు వైశ్యుఁడు పఠింప నమితపణ్య
ఫలశాలి యౌ శూద్రకులజుఁడు పఠియింప - వంశంబులో వాసి వన్నె గాంచు
 
తే.గీ.నఖిలవేదంబులు పఠింప నగుఫలంబు
నఖిలదానంబు లొనరింప నగుఫలంబు
నఖిలతీర్థంబులను గ్రుంక నగుఫలంబు
నొదవు నిక్కథ నొక్కింత చదివినంత
340
కం.ప్రత్యక్షరమున నానా
హత్యలు నశియించుఁ గరతలామలకగతిన్‌
బ్రత్యక్షం బగుమోక్షము
సత్యం బీరామచరిత చదువుజనులకున్‌
341
కం.ఎందాఁకఁ జెలఁగు వేదము,
లెందాఁకన్‌ దివిఁ జరింతు రిందుఁడు సూర్యుం
డెందాఁకఁ గులగిరులు దగు
నందాఁకన్‌ బొసఁగు నిమ్మహాకావ్య మిలన్‌
342
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju