| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | సుమాలి ప్రముఖులు రసాతలమునుండి విశ్రవు నాశ్రమమునకు వచ్చుట |
| చం. | దశముఖుఁడీ ప్రకారమునఁ దమ్ములతోఁ జని తల్లికిం బ్రదీ ప్రశమధియైన తండ్రికిని భక్తిఁ ణ్రామము లాచరించి దై త్యశతము గొల్వఁ బాయక తదాశ్రమభూమి వసించుటంతయున్ విశదముగా నెఱింగి కడు వేడుకఁబొంగి సుమాలి యయ్యెడన్ | 213 |
| చం. | చిలువల గుంపు వెల్వడిన చెల్వున రాక్షస సైనికుల్ రసా తలమున నుండియున్ వెడలి తన్ భజియింపఁ బ్రహస్తముఖ్యపు త్రులు సహితాప్తబంధులయి తోడనరా దుహితృప్రియాత్మజా తులఁ దిలకించు నుత్సవము తోరముగా నరుదెంచుచున్నెడన్ | 214 |
| శా. | ఆ మాతామహు రాక మున్నె విని భ్రాత్రన్వీతుఁడై కైకసీ కామిన్యగ్రసుతుం డెదుర్కొని నమస్కారంబులం బూజలన్ క్షేమప్రశ్నములన్ వినీతియును భక్తిస్నేహముల్ సూప న త్యామోదంబు వహించి యతఁడును నుద్యత్ప్రౌఢవాగ్జృంభణన్ | 215 |
| సీ. | చిలువమేపరిపుల్గు బలు చట్టుపలఁబుట్టు - గాడ్పుచే నొదవిన కాళ్ల వడఁకు గొంటు బంగరుకంటి గంటువేలుపు వింటి - గుణరవంబున నంటు గుండె దిగులుఁ దొలివేల్పు చిందంపుఁదోరంపు రవళిచేఁ - గర్ణరంధ్రములందుఁ గవియు చెవుడు వేయి యంచుల వాలు మ్రోయు చుద్ధతి డాయు - నపుడు పైకొనిన భయజ్వరంబు | |
| గీ. | నేఁటితోఁబాసె రాక్షసానీకమునకు వీరహోమంబుచే నీవు వేల్పుఁబెద్ద వెఱఁగుఁబడఁజేసి లోకైక విజయహేతు వరము లొందుటఁ బౌలస్త్యవరకుమార! | 216 |
| మ. | పరిపూర్ణోజ్జ్వలకార్తికీ కుముదినీ ప్రాణేశ్వర జ్యోత్స్నవై ఖరి నీ కీర్తిరమా విలాసము పొసంగన్ సొంపుఁగాంచెన్ నిశా చర వంశాబ్ధి మదీయహృత్సరసిజోత్సాహైక సంపాదన స్ఫురణన్ మించె భవత్ప్రతాపరవి రక్షోనాథ! నిక్కంబుగన్ | 217 |
| మ. | పరమాన్నాజ్యసమిన్ముఖాహుతులచే బ్రహ్మార్పణం బంచు న ధర్వముల్ సేయుదు రందఱున్ వసుమతిన్ ధైర్యోన్నతిన్ నీ గతిన్ శిరముల్ పాణిఁ గృపాణిఁ జేర్చి యనలార్చిన్ వేల్చి నీ యద్భుతా ధ్వరకర్మం బొనరింప రెవ్వరును సత్యం బాసురగ్రామణీ! | 218 |
| తే.గీ. | మిగులఁగోపించి తన్నిన భృగుమహర్షి యడుగు వట్టిన వేల్పు రాయిడికి వెఱచి యడుగు వట్టిన దైత్యుల యాపదబ్ధి కధిప! యుష్మత్ప్రతాప మౌర్వాగ్నియయ్యె | 219 |
| కం. | బలియుఁ డవన్వయకర్తవు కలిగితి విఁకనేల డాఁపఁగా? మనకొఱకే తొలుతన్ మత్ప్రేరితుఁడై లలితస్థితి విశ్వకర్మ లంక యొనర్చెన్ | 220 |
| వ. | అట్టి పట్టణం బిటులేల విడిచిపెట్టితి రంటివేని వినిపించెద నాకర్ణింపుము | 221 |
| మ. | త్రిజగద్ద్రోహ మొనర్చుచున్ సమదవృత్తిం గూడి క్రీడించు మా భుజగర్వంబు సహింపలేక చని వేల్పుల్ దెల్పికొన్నన్ జతు ర్భుజుఁ డభ్రంకష శంఖరాజనినదంబుల్ మీఱ సంగ్రామకే ళి జయోత్పాదనశాలి మాలి మును కూల్చెన్ గెల్చె మమ్మందఱన్ | 222 |
| ఉ. | అడ్డము వచ్చి వేల్పు పురి యాఁగెడు మమ్మిటు లావరించి మా యొడ్డనముల్ దెరల్చి హరి యుద్ధతిఁ జూపినఁ గొల్ల వెట్టినన్ దొడ్డికిఁ బాఱునా పనులతో సరియై పురిఁబాసి యాండ్రునున్ బిడ్డల వెంటఁబెట్టుకొని భీతిలి చేరితి ముర్వి క్రిందటన్ | 223 |
| తే.గీ. | అది మొదలు లంక పాడైన నసురనాథ! యంత మీయన్న నడుమఁ దానాక్రమించె దానముననైన సామభేదములనైన బలిమినైన గ్రహింపు మప్పట్టణంబు | 224 |
| తే.గీ. | ఒరులపాలైన తమ సొమ్ము మరలఁగొనుట యార్తిఁ జెందిన చుట్టాల నరసికొనుట నిజకులోచిత ధర్మంబు నిలిపికొనుట బలియుఁ డగుటకు ఫలమండ్రు పంక్తివదన! | 225 |
| తే.గీ. | కరముచేఁ గంకణమ్ముఁ గంకణమువలనఁ గరముఁ గరమొప్పుకరణి లంకాపురాధి పత్యమున నీవు వెలయు దప్పట్టణంబు వెలయు నీచేత నని తాత తెలుపుటయును | 226 |
| మ. | దశకంఠుండనుఁ, దాత! నీ నుడి యథార్థంబైనఁ దానెంత బా లిశుఁడైనన్ నయమేది యగ్రజుని బల్మింద్రోచి దుర్వృత్తిఁ ద ద్వశమౌ నిల్లెటు లాక్రమించు? మఱి లేవా యిండ్లు? పెద్దల్ భవా దృశులే యిట్లన సన్మదాదులకు బుద్ధిస్థైర్యముల్ గల్గునే? | 227 |
| కం. | అని తాత బోధ చేసిన పనికిన్ సమ్మతిల కతఁడు ప్రత్యాఖ్యానం బొనరించె నంత నొకనాఁ డనువగు సమయంబుఁగని ప్రహస్తుం డనియెన్ | 228 |
| శా. | పౌలస్త్యాన్వయచంద్ర! శూరులకు సౌభ్రాత్రంబు బాంధవ్యమున్ వాలాయం బనవచ్చునే? బలిమి యెవ్వాఁ డొందు వాఁడే కదా త్రైలోక్యంబున మేటి? యా నడతయే ధర్మంబు, యక్షేశుపై నేలా యీ మొగమాట? మాతని పురంబే లంక శంకింపఁగన్? | 229 |
| ఉ. | ఏల బహూక్తు లప్పురి మహిన్ సృజియించినయట్టివారు వీ రేలినవారు వీ రతని కేడది? గా దతఁ డేలి కంటివా? యేలఁడె యింతకాల? మిఁక నేలఁగ నీకగుఁ బాలివంతునన్ బాలికి లంకె లెయ్యడల భ్రాతలుగారె? పులస్త్యనందనా! | 230 |
| ఉ. | అన్నను ద్రోచి యెంత చెడుగైన దదీయ గృహంబుఁ జేరునే యన్నది వింటి మీవలన నారయఁ గశ్యపునాండ్రు దైత్యులన్ గన్న నెలంత వేలుపులఁగన్న నెలంతయుఁ దత్సుతవ్రజం బున్న తెఱంగు వారల సహోదరమైత్రి జగం బెఱుంగదే! | 231 |
| ఉ. | ఎక్కువ లాడఁగా వెఱతు నింద్రుఁడు భ్రాత లటంచుఁ గాచెనే యొక్కెడనైన దైత్యుల? మహోద్ధతి గల్గిన నొంచుఁ దక్కినన్ దిక్కయి కావుమంచు హరిఁ దెచ్చి వధింపఁగఁ బంచుఁ జూడమే? యెక్కడి యన్న లేటి తగవేటి విచారము శూరకోటికిన్ | 232 |
| మ. | దయయున్ ధర్మము సత్యమార్జవము శాంతం బెప్పుడుం బూని స త్క్రియలున్ సౌఖ్యము లొందు వేలుపులె దైతేయచ్ఛటం ద్రుంపఁగా భయమేలా మనవంటి వారలకుఁ? దద్భంగి బ్రవర్తింప నె ట్లయినన్ మేలగు దాయ గెల్పు మసురేంద్రా! యంచు బోధించినన్ | 233 |