ఇతిహాసములు ఉత్తరరామాయణము వాయుదేవుం డాత్మమూర్తి నుపసంహరించుట
వాయుదేవుం డాత్మమూర్తి నుపసంహరించుట
చం.పడిన కుమారునిం గని ప్రభంజనుఁ డార్తిఁ దపించి యింద్రుపై
నడరెడు కిన్కతో జగము లన్నియు నిండిన యాత్మమూర్తి న
య్యెడ నుపసంహరించి ప్రజలెల్లను చేష్టలు దక్కి మిక్కిలిన్‌
జడిమ వహింపఁ బుత్రుఁగొని శైలమహాకుహరంబు సొచ్చినన్‌
112
సీ.యాజకుల్‌ వహ్ని హవ్యములు వ్రేల్వఁగఁ జాఁచు - హస్తముల్‌ సాఁచినయట్టు లుండె
దివిజులు ప్రేరేప దివి కెగిరిన దేవ - యానంబు లెగిరిన యట్టు లుండె
మునులు నదీతోయములఁ దోఁగ ముంచిన - యంగముల్‌ ముంచినయటుల నుండె
పశుమృగనరముఖప్రాణు లుర్వినిఁ బెట్టు - నడుగులు పెట్టినయటుల నుండె
 
గీ.భానుమండల మొక్కచోఁ బాదుకొనియెఁ
గాల గతి తప్పె సత్క్రియల్‌ గడచె వేద
పాఠ ముడివోయె బాహ్య మాభ్యంతరంబు
గాడ్పు బంధించి చనిన యక్కాలమునను
113
ఉ.ఆ విపరీతముల్‌ గని భయంపడి కొందఱు తాపసోత్తముల్‌
దేవవరేణ్యుఁ డాదియగు దేవతలుం బరమేష్ఠి చెంతకుం
బోవఁ దలంచి యుబ్బు కడుపుల్‌ నడువన్‌ వడిలేని పాదముల్‌
లావఱియున్న మేనులుఁ గలంగిన చిత్తములున్‌ గనంబడన్‌
114
తే.గీ.ఒక విధంబునఁ జతురాస్యు నొద్ద కేఁగి
కడుఁబ్రయత్నంబుతో మ్రొక్కులిడి ప్రయాస
మునఁ గరంబులు ముకుళించుకొని మొగంబు
లెత్తి దగదొట్టికొన వార లిట్టు లనిరి
115
శా.వాణీనాథ! చరాచరప్రముఖ జీవశ్రేణులం దొల్లి ని
ర్మాణం బీ వొనరించి వానికి జగత్ప్రాణుం గదా సర్వధా
ప్రాణప్రాయునిగా సృజించి తతఁడీ పట్లన్‌ విరోధించి త
త్ప్రాణిక్షోభ మొనర్చె నేమిటికొ! యీ బన్నంబు వారింపవే!
116
మ.వనజాతాసన! దేహనామ సదనద్వారావరోధంబు సే
య నితాంతావ్యథ మా యసుప్రతతి శుద్ధాంతాంగనాశ్రేణితో
నెనయై వేదనఁజెందె నీ యడరు నీ వెట్లైన వారించి య
య్యనిలున్‌ స్వస్థునిఁ జేసి ప్రోవఁగదవయ్యా! లోకముల్‌ నావుడున్‌
117
చం.వనరుహసంభవుం డనియె వారలతో వినుఁ డంజనాఖ్యయౌ
వనితకు వాయుతేజమున వానరవీరుఁ డొకండు పుట్టి చ
య్యన నిను మండలంబుఁ గని యాఁకటి వెల్లువఁ బక్వమౌ ఫలం
బని కబళింపఁగా నపుడె యాడకు రాహువు వచ్చి యుగ్రతన్‌
118
సీ.తనపాలి దాయమై తపనుని గ్రహియించు - నాంజనేయునిఁ జూచి యాగ్రహించి
వెఱపింపఁబోయి తా వెఱచి శీఘ్రంబునఁ - బఱతెంచి యా దివస్పతినిఁగాంచి
భానునిఁబొదువ స్వర్భాను వేఱొక్కని - నియమింపఁ దగవగునే యటంచు
దూఱిన నీ మీఁదనా రాహు విదియేమి - యద్భుతం బని యింద్రుఁడలుక వొడమి
 
గీ.యపుడె రాహువుతో వచ్చి యర్కు చెంత
నున్న కపిబాలుఁగని నిజాయుధము వైవ
హనువు భగ్నంబుగా నతఁ డవశుఁడైనఁ
బట్టిఁగని గాడ్పు శోకంబుఁ బట్టలేక
119
తే.గీ.ఈ బలారాతి చేసిన యెగ్గుఁ దలచి
యలిగి యాతఁడు పాలించు నఖిల జనులఁ
దన సుతుని లీలఁ జేష్టలు దక్కఁజేసె
నింక నగ్గాడ్పుఁ బ్రార్థింప నేఁగ వలయు
120
తే.గీ.వాయు వధికుండు సకలదేవతలలోన
వాయు వాధార మఖిలజీవంబులకును
వాయువు బలంబు ప్రాణాది వాయులీల
వాయుచె చరించుచుండు నిక్కాయములను
121
కం.ఆయన లేకున్న శవ
ప్రాయంబై యుండు జగము పఱతెండిఁ క న
వ్వాయువుఁ బ్రార్థింపుద మని
తోయజసంభవుఁడు వారితోఁ జనుదెంచెన్‌
122
కం.చనుదెంచి మారు తాశ్రిత
ఘనశైల గుహాంతరంబుకడ నిల్చిన న
వ్వనజభవు రాకఁ గనుఁగొని
యనిలుఁడు గొడుకుఁ గొనివచ్చి యజునకు మ్రొక్కెన్‌
123
తే.గీ.మ్రొక్కిన సమీరుఁగని యేల యి క్కడింది
పని యొనర్చితి వత్స! నీ పట్టి యేడి?
వీఁడె కద! యని పవిధార వివశుఁడైన
యక్కుమారునిఁ గనుఁగొని యాదరమున
124
తే.గీ.పలుకుల వెలంది తళుకుఁజెక్కుల విచిత్ర
పత్రముల వ్రాయనేర్చిన పాణి ననిల
సుతుని నెమ్మేను నివిరిన శోషదీఱి
వాఁడు లేఁబైరు వానచేవలెఁ జెలంగె
125
వ.ఇవ్విధంబునన్‌126
తే.గీ.మూర్ఛ దెలిసిన యంజన ముద్దుపట్టి
నంకమునఁబెట్టి యజుఁడు ముద్దాడుచుండఁ
గాంచి హర్షించి తన వక్రగతి యడంచి
గాడ్పు జగముల కుత్సాహకారి యయ్యె
127
చం.అనిలున కింపొనర్చి మది నంబుజసంభవుఁడెల్ల వేల్పులం
గని సురలార! యీ కపిశిఖామణి లోకహితార్థి మీఁదటన్‌
మనకుఁ బ్రియం బొనర్చు మదమత్తనిశాటుల నుక్కడంచుఁగా
వున నితఁడుగ్ర శౌర్యవిభవుండుగ మీరు వరంబు లీఁదగున్‌
128
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju