| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | బ్రహ్మేంద్రాదులు హనుమకు వరంబు లొసంగి పవనుని సంతుష్టుం జేయుట |
| తే.గీ. | అనిన సురలెల్ల మే లని రపుడు వజ్రి తన శతారంబు తాఁకియు హనువు వెలయు కతన హనుమంతుఁడను పేరు గాంచు నితఁడు వజ్రహతి నొవ్వఁ డిఁక నని వరమొసంగె | 129 |
| సీ. | బ్రహ్మదండంబున బ్రహ్మాస్త్రమున హాని - నందని దీర్ఘాయు వజుఁ డొసంగె శూల రౌద్రాస్త్ర పాశుపతాదికములచేఁ - జెడని ప్రభావంబు శివుఁ డొసంగెఁ దన కాలపాశంబు దండంబు మృత్యు వీ - యన నొంచలేవని యముఁడు వలికె నాత్మతేజమున శతాంశ మిచ్చితి విద్య - లిచ్చెదనిఁక నని యినుఁడు వలికెఁ | |
| గీ. | బాశమునఁ గట్టువడఁడని పలికె వరుణుఁ డగ్ని దనచేత నశియింపఁ డనియె ధనదుఁ డొసఁగెఁ దన గద నొగలని యునికి యెల్ల కైదువుల నొవ్వఁ డని విశ్వకర్మ వలికె | 130 |
| కం. | తక్కిన దేవత లొక్కొక రొక్కొక్క వరమ్ము నొసఁగి రుత్సాహముతో నక్కమలగర్భుఁ డనిలుని దిక్కుఁ గని గణించె నెల్ల దివిజులు వినఁగన్ | 131 |
| పంచచామరము | సమీర! నీ కుమారుఁ డుగ్రశౌర్యధైర్యధుర్యుఁ డ ప్రమేయశక్తి రాము కార్యభారమూని రావణా ద్యమిత్ర భీకరప్రతాపుఁడై చరించు లే దసా ధ్య మీ జగంబులందు వీని కంచుఁ బల్కి పోయినన్ | 132 |
| కం. | సంతసమున నంత నభ స్వంతుం డక్కొడుకుఁ గొంచు వచ్చి ప్రచింతా క్రాంత యయి వగచు కేసరి కాంత కొసంగి యతని మహిమ గణియించి చనెన్ | 133 |
| తే.గీ. | రామ! యా పిమ్మటన కాదె యీ మహాత్ముఁ డంతి కాశ్రమములు సొచ్చి యచటి మునుల వల్క లాజినములు వ్రచ్చి వారి మాన సములు గలఁచినఁ గోపించి శాప మిడుట! | 134 |
| కం. | శాప మొసంగినఁ బశ్చా త్తాపము బ్రాపించి దోఃప్రతాప ముడిగి య త్తాపసులకు సేవకుఁడై యీ పవనజుఁ డుండి పిదప నినజునిఁ జేరెన్ | 135 |
| ఉ. | బోనున నున్న మత్తహరి పోలిక బ్రాహ్మణ శాపయుక్తి నెం తేనియు శాంతిఁజెందె నితఁ డీతని బాహుబలం బెఱింగి స న్మానము సేయు భానుజుఁడు మంత్రులలోపలనెల్ల వాయువై శ్వానరులట్ల వీరు రఘువల్లభ! పాయకయుందు రెప్పుడున్ | 136 |
| చం. | విను మిఁక నొక్క వింత రఘువీర! యినుండు వరంబు లిచ్చు వే ళననిన మాట నెమ్మదిఁ దలంచి శ్రుతుల్ పఠియింపనెంచి యీ యన యొకనాఁడు భాను కడ కద్భుతవేగముతోడఁ బోయి మ్రొ క్కినఁ గరుణార్ద్ర దృష్టిఁ దిలకించి పయోరుహబంధుఁ డిట్లనున్ | 137 |
| మ. | చదువుల్ నేర్చుకొనంగ వచ్చితివె? వత్సా! త్రోవ నెట్లభ్యసిం చెదు? నా ముందట నిల్వఁగూడదుగదా! శీఘ్రంబునన్ బోయినన్ మది యేకాగ్రతఁ జెందునే నుడువు మన్నన్ నవ్వి యవ్వీరుఁ డ య్యుదయాస్తాద్రుల నిల్పెఁ బాదయుగళం బుత్సేధదేహోగ్రుఁడై | 138 |
| కం. | మును హరి తివిక్రమాకృతిఁ గనిపించినయటుల నూర్ధ్వ కర్పర మెల్లన్ దనమయముగ నిండిన నీ హనుమత్కపిఁ జూచి వెఱచె నఖిలజగంబుల్ | 139 |