| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | హనుమంతుడు సూర్యునొద్ద వేదశాస్త్రాదులు చదువుట |
| శా. | భానుండద్భుతమందె నంత నిజరూపం బూని యీ వానరుం డా నీరేరుహబంధు తేరి కెదురై యాకాశమార్గంబునన్ దా నెంతే వడిఁబోవుచున్ శ్రుతులు శాస్త్రంబుల్ పఠించెన్ బరి జ్ఞానగ్రాహకతావిశేషములకున్ జండాంశుఁ డుప్పొంగఁగన్ | 140 |
| తే.గీ. | కుడిచి చల్లని నీడలఁ గూరుచుండి గురువు చెప్పినఁ జదువరీ ధర వడుగులు నిరశనుండయి పఱచుచు నింగిఁ గఱకు టెండకు సహించి చదివె నీతండు ఘనుఁడు! | 141 |
| కం. | ఈ శాఖామృగశేఖరు తో శతధృతి కవి బృహస్పతులు మృదుభాషా కౌశలి శ్రుతిముఖ విద్యా వైశారద్యమున సాటివత్తురె తలఁపన్ | 142 |
| సీ. | వైరాగ్యమహిమకీ వడుగు నివాసంబు - వినయంబునకు నీతఁ డునికిపట్టు శమదమోన్నతులకీ చతురుఁ డాధారంబు - దాక్షిణ్యమునకు నీతండు చోటు సౌశీల్యమున కీ ప్రశాంతిశాలి బిడారు - పరహితక్రియ కీ ప్రసన్నుఁ డిక్క విక్రమస్ఫురణ కీ వీరవర్యుఁడు ఠావు - గాంభీర్యగరిమ కీ ఘనుఁడు ప్రాపు | |
| గీ. | బ్రహ్మ విద్యకు నిమ్మేటి పట్టుఁగొమ్మ ఘనతపోధనమునకు నీయన నిధాన మతుల ధైర్యంబునకు నీ మహాత్ముఁ డిమ్ము రామ! నీ భక్తి కీ పుణ్యరాశి నెలవు | 143 |
| సీ. | గుఱిమీఱ రోదసీకుహర మొక్కట ముంప - నుప్పొంగు బ్రళయ పయోధికంటె జగము లన్నియు నొక్కసారె భస్మము సేయ - నడరెడు కల్పక్షయాగ్నికంటె బహు పర్వతారణ్య పటలిఁ జూర్ణము సేయఁ - గడగు సంవర్తాశుగంబుకంటె బ్రహ్మాండభాండంబుఁ బట్టి బ్రద్దలు సేయఁ - దివిరెడు విలయభైరవునికంటె | |
| గీ. | నధికగాంభీర్య మతులితం బగు ప్రతాప మనవధికవేగ మద్భుతంబైన రౌద్ర మియ్యనిల పుత్రునకె కల దితని మ్రోల వాలి గీలియు నిలుతురే? వసుమతీశ! | 144 |
| కం. | ఇనసుతుకడ నితఁ డున్నాఁ డని యెఱిఁగియె వాలి కొంత యళుకుచునుండున్ దనకేమి యితఁడు గలఁడని యినసుతుఁడును వెఱవకుండు నింద్రసుతునకున్ | 145 |
| తే.గీ. | అని యగస్త్యమహాముని హనుమ మహిమ లద్భుతంబుగఁ దెల్పిన నాలకించి సభ్యు లనిలజుఁ బదివేల చందములను బ్రస్తుతింపఁగ శ్రీరామభద్రుఁ డలరి | 146 |
| ఉ. | ఆ విపులప్రభావ నిధి కంజలి సేసి, మునీంద్ర! వింటి నీ చే వివిధేతిహాసములు శ్రీహనుమత్కథ లాలకించితిన్, దైవతనాథుఁడన్ రవియుఁ దండ్రి యనన్ వినినాఁడ, వాలిసు గ్రీవుల జన్మ మెట్టు లెఱిఁగింపఁగదే యన మౌని యిట్లనున్ | 147 |