| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | వాలి సుగ్రీవుల జననము |
| తే.గీ. | రామభూపాల! తొల్లి నారదమహర్షి యేఁ దపం బున్న వనమున కేఁగుదేర వాలి సుగ్రీవు లే యింతివలనఁ బుట్టి రన నతఁడు దెల్పె నవ్విధం బవధరింపు | 148 |
| చం. | అమరనివాసమై మణిమయాంచితసానువులొంది యెల్లలో కముల ధరించి పర్వతశిఖామణి నాఁదగు కాంచనాద్రి మ ధ్యమశిఖరంబునందు నియమాన్వితుఁడై యొకనాఁడు భారతీ కమలముఖీమనోహరుఁడు గాఢసమాధి వహించియున్నెడన్ | 149 |
| ఉ. | తారకయోగ నిశ్చలతఁ దాల్చిన యప్పరమేష్ఠి కన్నులన్ జాఱె మరందబిందువులు సారసపత్త్ర వినిర్గతంబులై తారు ముదశ్రుబిందువు లతం డవి హస్తములన్ ధరించినన్ శూరవరుండు ఋక్షవిరజుండను నందనుఁడయ్యె నందునన్ | 150 |
| కం. | ఆ నందను సజ్జన నిచ యానందనుఁ జూచి బ్రహ్మ హైరణ్యధరో ద్యానమ్ములఁగల ఫలములఁ దేనెలఁ దను వోమికొనుచుఁ దిరుగు మటన్నన్ | 151 |
| ఉ. | ఆ విధి యాజ్ఞ మస్తకమునందు ధరించి యతండు కాంచన గ్రావవనాంతరంబుల నిరంతరముం జరియించుచున్ బ్రసూ నావళిఁ దెచ్చి తెచ్చి గురు నర్చన సేయుచు నంపఁ గ్రమ్మఱం బోవుచుఁ గందమూలఫలముల్ భుజియించుచు క్షుత్తు మాన్చుచున్ | 152 |
| మ. | ఒకనాఁ డుత్తర శృంగముం గదిసె యయ్యోరన్ శతానందపు త్రకుఁ డీక్షించెఁ బ్రఫుల్ల హల్లక సముద్యద్దీపికల్ షట్పద ప్రకరప్రాంచిత ధూప ధూమములు మీఱన్ రాజహంసచ్ఛటల్ వికచాంభోరుహ సౌధవీథిఁ దగ ఠీవిం జెందు కాసారమున్ | 153 |
| కం. | వీక్షించి యక్షు లలరఁగ నా క్షణమున ఋక్షవిరజుఁడట డిగ్గి తను ప్రక్షాళనవిధిఁ దీరిచి సాక్షా దమృతంబుఁ బోలు జలములు గ్రోలెన్ | 154 |
| తే.గీ. | క్రోలి, తన నీడ తేటయౌ కొలనినీటఁ గనఁబడినఁ జూచి, యమ్మహావనచరుండు సహజ జడబుద్ధిఁ, బ్రతివనచరుఁడు వీనిఁ బట్టెదనటంచు, సరసిలోపలికి నుఱికె | 155 |
| తే.గీ. | ఉఱికి యందెవ్వరిని గాన కుఱక నీటఁ బడితినని వజ్రఘటిత సోపానపంక్తిఁ జేరినంత సరోవరశ్రీ స్వరూప మిచ్చె నన నొక్క చక్కని యింతియయ్యె | 156 |
| సీ. | తన శోణకమలాంఘ్రితల రుచుల్ మగరాల - తెలిమెట్లఁ గెంపు మెట్టుల నొనర్పఁ దన సోయగపు వాలు నును బెళ్కుఁజూపులు - కొలనెల్లఁ గలువలై వెలయఁజేయఁ దన కుందనపు మేని తళుకులు తటధరా - రుహఘనావళిఁ గ్రొమ్మెఱుఁగులునింపఁ దన గబ్బి వలిగుబ్బ చనుదోయి చక్రదం - పతుల సజాతివిభ్రాంతి ముంపఁ | |
| గీ. | దన పెదవి సాంధ్యరాగంబు దళము గొలుపఁ దన కచభరంబు తిమిరసంతతి సృజింపఁ దన నగవు వెన్నెల ఘటింపఁ దరుచరమణి రమణియై యందు విహరించు సమయమునను | 157 |
| చం. | కమలజుఁ గొల్చి యత్తెరువుగాఁ జనుచున్న సురాధినాథుఁడున్ గమలహితుండు నచ్చెలువఁ గన్గొని దర్పకుఁడేయు పద్మకో శములఁ దలంకి దాని బిగి చన్నులు దాని వెడంద కన్నులున్ దమి వెలయింప నిర్వురును దత్తఱ మందుచుఁబోక నిల్చినన్ | 158 |
| చం. | మరులధికంబుగాఁగ శతమున్యుని తేజము నిర్గమించి య త్తరుణి శిరంబుపై నొలికెఁ దత్సమయంబునఁ బద్మినీమనో హరునకు నింద్రియస్ఖలనమై యది చయ్యనఁ బోయి తద్గళాం తరమున వ్రాలె నందువలనన్ దమకంబులు దీఱె వారికిన్ | 159 |
| ఆ.వె. | శిరము మీఁదఁబడిన జిష్ణుతేజము జాఱి వాలమున్నచోట వచ్చి నిలిచె నట్టిచోటఁ బుట్టినట్టి వాసవు పట్టి వాలి నాఁ జెలంగె వసుమతీశ! | 160 |
| కం. | ఉగ్రకరు తేజ మక్కం బుగ్రీవ గళాంతరమున మున్నొలికెఁ గదా! యా గ్రీవ నుద్భవించుట సుగ్రీవుం డనఁగ సూర్యసుతుఁడు చెలంగెన్ | 161 |
| చం. | తన మెడ హేమమాలిక ముదంబున వాలి కొసంగి పాకశా సనుఁ డరిగెన్ దివంబునకు, సప్తహయుండును గూర్మిపుత్రునిన్ గని హనుమత్సఖిత్వ మధికద్యుతియుం గని వృద్ధిఁబొందు మం చని చరమాబ్ధిఁ గ్రుంకఁ జనె నాత్మజుఁ డుద్భవ మౌట నోయనన్ | 162 |
| ఉ. | ఆ దినశేషమెల్లఁ దనయద్వయితో నచటన్ వసించి సూ ర్యోదయమైనఁ గాంత యయియుండుట మాని వనాటమూర్తియై యీ దృశ పౌరుషంబు చెడి యేటికి భామినినైతినో యటం చాదిమవానరుండు వెఱఁగందుచు నచ్చొటు వాసి యయ్యెడన్ | 163 |
| చం. | తనవలె వానరాకృతులు దాల్చిన పుత్రులు గొల్వఁబద్మగ ర్భునికడకేఁగి మ్రొక్కుటయుఁ బుత్రయుగాన్వితు నాత్మపుత్రునిన్ గని ముదమంది నీవు తెలిగంటితనంబునఁ గన్న వీరిఁ దో డ్కొని ధరకేఁగి యెల్ల కపికోటులఁ బ్రోవు మటంచుఁ బల్కినన్ | 164 |
| తే.గీ. | విని హసాదని యా ఋక్షవిరజుఁడయ్య! యల సరస్సున మునిఁగిన నతివరూప మేల ప్రాపించె? వేగిన నేల యడఁగె? నానతియ్యఁగదే యన్న నజుఁడు వలికె | 165 |
| ఉ. | అచ్చటఁ దొల్లి పార్వతి వయస్యలతో జలకేళిఁదేలఁగాఁ గుచ్చితులైన రక్కసులు గొందఱు కామినులై జలంబులోఁ జొచ్చిన నిందుఁజొచ్చు పురుషుల్ నిజ మిట్టులె యౌదురంచు లో హెచ్చిన కిన్క నట్లు శపియించి తిరోహితమయ్యె నయ్యెడన్ | 166 |
| తే.గీ. | అవ్విధము నేను వినియుండి యంతఁగొంత కాలమున కమ్మహాదేవిఁ గాంచి వేఁడ నచట మునిఁగిన మగవాని కాఁడు రూప మొక్కనాఁ డుండు మఱునాఁటి కుండదనియె | 167 |
| తే.గీ. | కావున దినంబు చనిన నీ కామినీత్వ మడఁగె నిఁకనేల తామసం బవని కేఁగి మించు రహి విశ్వకర్మ నిర్మించెఁ జెలువ మొందఁ గిష్కింధఁ బాలించుచుండు మనుచు | 168 |
| కం. | నిష్కర్ష చేసి దివ్య ప రిష్కారము లొసఁగి పనుప ఋక్షవిరజుఁడ ప్పుష్కరభవు వీడ్కొని చని కిష్కింధను భటులతో సుఖించెం బ్రభువై | 169 |
| కం. | జననియై తానె కనియెన్ జనకుండై తానె పిదప సంరక్షించెన్ దనయుల వనచరకులనిధి యనఁగా జను ఋక్షవిరజుఁ డర్కకులేంద్రా! | 170 |
| తే.గీ. | వృద్ధుఁడై పిమ్మటను ఋక్షవిరజుఁ డింద్ర సుతునిఁ దన రాజ్యమున కధిపతినిఁ జేసి భానుసూనుని యువరాజుగా నొనర్చి చనియె నవ్వలి కథ మీరు వినిన యదియ | 171 |
| తే.గీ. | అధిప! యీ పుణ్యకథ యెవ్వరైన భక్తి వినిన వ్రాసినఁ జదివినఁ విపులభోగ భాగ్యములు గల్గి బహుపుత్రపౌత్రయుక్తిఁ దనరుదురు భూమిఁ దామరతంపరగుచు | 172 |
| మ. | అని వింధ్యారి వచించి వెండియును రామాధీశుతో నిట్లనున్ విను ముర్వీశ్వర! దైత్యుఁ డట్లు కపిలున్ వీక్షించి విభ్రాంతుఁడై తనలో నా ఘనమూర్తినే తలఁచుచున్ దైత్యారిగాఁబోలు నీ యన గాకున్నఁ గలారె యన్యులును నీ యంచత్ప్రభావోన్నతుల్ | 173 |