| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రావణుడు బోధార్థియై సనత్కుమారునియొద్దకుఁ బోవుట |
| వ. | అని తలంచి వెండియు | 174 |
| మ. | పగవారై నగధారితోఁదొడరి తద్బాహాబలక్షీణులై తెగి హేమాక్షముఖాసురాగ్రణులు ముక్తిం జెందరే? యగ్గతిన్ బగ గోవిందునియం దొనర్చి సుగతిం బ్రాపింతునంచున్ గడం గి గురుప్రజ్ఞ సనత్కుమారుకడ కేఁగెన్ వాఁడు బోధార్థియై. | 175 |
| తే.గీ. | ఏఁగి చలిగట్టుపై నొక్కయెడ సనత్కు మారు జితమారు బ్రహ్మకుమారుఁగాంచి హర్షపులకితగాత్రుఁడై యతనికెఱఁగి హస్తములు మోడ్చి యసుర యిట్లనుచుఁ బలికె. | 176 |
| మ. | అమలజ్ఞాననిధాన! యీ జగములం దవ్యక్త నానారహ స్యములున్ మీకుఁ శరస్థలామలకముల్, సర్వజ్ఞులౌ మిమ్మువం టి మహాత్ముల్ నతులైన శిష్యుల నకౌటిల్యాత్మ వీక్షించి ని క్కముగా దాఁపక యానతిత్తురుగదా కాంక్షానుకూలార్థముల్. | 177 |
| మ. | అనఘా! యెవ్వఁ డనాది మధ్యలయుఁడై యవ్యక్తుఁడైయుండు? నె వ్వనిచే నయ్యె నధీశయుక్త మగు విశ్వంబెల్ల? నెవ్వానిఁచే ర్కొనినన్ బంధవిముక్తియౌ విబుధవర్యుల్ బుద్ధి నెవ్వాని వ ర్తన మూహింపఁగఁజాల రట్టి ఘనునిన్ దథ్యంబుగాఁ దెల్పవే! | 178 |
| కం. | నా విని సనత్కుమారుఁడు రావణునకు ననియె వినుము రక్షోవర! స ద్భావముతో నీ వడిగిన దేవుని మహిమంబు నీకుఁ దెలిపెదఁ దెలియన్. | 179 |
| మ. | అనఘుం డవ్యయుఁ డచ్యుతుం డమలుఁ డవ్యక్తుం డనిర్వాచ్యుఁ డం జనదూరుం డఖిలేశ్వరుం డచలుఁ డక్షయ్యుం డమేయుం డటం చు ననాదిశ్రుతు లుగ్గడింప నుతిఁగాంచున్ బ్రహ్మ మా బ్రహ్మమే విను నారాయణ కృష్ణ విష్ణు హరి గోవిందాఖ్యలం జెల్వగున్. | 180 |
| సీ. | అంతటఁ బరిపూర్ణుఁడై నిండియుండియు - జలధిలో శేషాహిశయ్య నుండు నఖిలలోకేశ్వరుండను ఖ్యాతిఁ జెందియు - వైకుంఠపతియను వార్తఁగాంచు ధవళనీలాదివర్ణవిముక్తి నొందియు - నానీలఘనదేహుఁడనఁగ వెలయు సకలజీవులయందు సమబుద్ధి మెలఁగియు - ఖలశిక్ష సాధురక్షయు నొనర్చు | |
| గీ. | నభవుఁడయ్యు వినోదార్థ మవతరించు మాయఁ బాసియు మాయచే మహిమఁగాంచుఁ బోషకుండయ్యు నుగ్రుఁడై పొడవడంచు నట్టి హరినెంచ శక్యమే? యసురనాథ! | 181 |
| సీ. | కన్ను విచ్చినయంతఁగలుగు బ్రహ్మాండముల్ - గన్నుమూసిన నవి గాంచు లయము మదిఁ దలంచినమాత్ర నొదవునే క్రియయైన - మదిఁదలంపకయున్న మాయయడఁగుఁ జేపట్టిన ఖలుండు శిష్టుఁడై వెలయుఁజే - పట్టుకున్న బుధుండె పామరుఁడగు వలసిన నే రూపములనైన వర్తించు - వలవకున్న నభంబువలె వెలుంగు | |
| గీ. | నాదిమధ్యాంతరహితుఁ డవ్యక్తుఁడఖిల భువన సృష్టిక్రియాహేతుభూతుఁ డతని సంస్మరించిన సకలదోషములు వాయు హరియ సేవింపఁదగు దైవ మసురనాథ! | 182 |
| సీ. | విభు దర్శనంబుచే విబుధబోధానంద - పాథోధి హృదయాభ్రపథము ముంచు హరి ప్రభావంబుచే నాశ్రితషడ్వర్గ - భద్రదంతావళప్రతతు లడఁగు మాధవప్రాప్తిచే మనన శీలాంచిత - ప్రజ్ఞావనంబులు పల్లవించుఁ జక్రి సమ్ముఖముచే జన్మమృతిక్లేశ - మారుతోద్రేకముల్ మలయుటుడుగుఁ | |
| గీ. | బాయు నాధ్యాత్మికాదితాపత్రయంబు తలఁగుఁ గలుషాంధకారముల్ మలఁగు నహిత జాతి దుర్వృత్తిమూషికసమితి గలఁగు నరయు మింతయుఁ గ్రమముతో నసురనాథ! | 183 |
| చం. | అన విని రావణుండను మహాత్మ! ముకుందునిచేత సంగరం బున హతులైన శాత్రువులు వొందెడి సద్గతి యాన తియ్యవే యన హరిచేత నొచ్చిన సురారులు శ్రీహరి లోకమంది యం దనయము విష్ణురూపధరులై విహరింతురు రాక్షసేశ్వరా! | 184 |
| వ. | అని పల్కి సనత్కుమారుండు వెండియు నిట్లనియె | 185 |
| సీ. | ప్రణవంబు జపియించు ఫలము కేశవుఁజేరి - యట్టహాసముఁజేసినంతలోన భగీరథీస్నానఫలము శ్రీధరుఁ డేయు - నస్త్రాళి మునిఁగినయంతలోన బహుకాళచింతనాఫలము నారాయణు - నలుకమై వీక్షించినంతలోనఁ బ్రాఁబల్కుల నుతించు ఫలము నందకపాణి - నదలించి తిట్టినయంతలోనఁ | |
| గీ. | దనువుఁగృశియింప శాంతితోఁదపముసేయు ఫలము బహుమత్సరంబుతోఁ బద్మనాభు నాఁగి మొయివొంగ మార్కొన్నయంతలోనఁ గలదు హరితోడి పగకంటెఁ గలదె మేలు? | 186 |
| చం. | చపలతలేని చూడ్కులను సారెకు శౌరముఖంబు చూచుచున్ విపుల రణోత్సవంబులను విష్ణునిఁ బేరులుపెట్టి పిల్చుచున్ గుపితమనస్కులై యొరసికొంచు ముకుందుని మ్రోలఁగూలుదై త్యపతుల భాగ్యమెంత సుకృతాత్ములకైనను గల్గనేర్చునే? | 187 |
| ఉ. | ఆయుధధార ముంచి, రుధిరారుణచందనకర్దమంబునం గాయము నించి, శాత విశిఖప్రసవావళిఁ బైనిగెడ్చి, దై తేయులు శౌరిచేత నతితీవ్రముగాఁ గయికొండ్రు ముక్తి స్వా ధ్యాయతపోమఖక్రియలు దాల్చిన ధన్యులకంటె ముందఱన్. | 188 |
| చం. | పలుకులు వేయునేల? మధుభంజను కిన్క తపఃఫలంబు శ త్రల కని యమ్మహామునివరుం డెఱిఁగించినఁ బంక్తి కంధరుం డలరి ముకుందుతో సమర మబ్బునె? యవ్విభుచేతఁ జచ్చి ని శ్చలపద మొందఁగాఁగలనె? శాంతినిధీ! వివరింపవే యనన్. | 189 |
| కం. | సనకావరజుం డిట్లనుఁ గనకాచలధీర! పంక్తికంధర! విను మా ఘనకాయునితో నని మా ర్కొని కాయము విడువఁగలవు కుందకు మదిలోన్. | 190 |
| తే.గీ. | అనిన ముదమంది దశకంఠుఁ డమ్మహాను భావుఁగని యెన్నినాళ్ల కప్పనియొనర్చు హరి? యన నతండు వెండియు ననియెఁ గృతయు గాంతమున మానవేంద్రుఁడై హరి జనించు. | 191 |
| వ. | అత్తెఱంగెఱింగించెద నాకర్ణింపుము. | 192 |
| సీ. | వేల్పులుగావించు విన్నపంబులు వించు - హరి నిన్ను వధియించు నాత్మమించు రవికులాబ్ధి జనించు రామనామముఁగాంచుఁ - దపసి జన్నముఁబెంచు రిపులనొంచు శిలఁజెల్వ నొనరించు శివుని చాపముఁద్రుంచు - జానకి వరియించు సంతసించు జామదగ్నిఁగలంచు జనకాజ్ఞఁబావించు - మునివృత్తి ధరియించు వనిఁజరించు | |
| గీ. | నీ సహోదరి ముక్కు ఖండింపఁబంచు సరగ ఖరదూషణాదుల సంహరించు నవనిసుత నీవు గొనిపోవ నాగ్రహించు నది నిమిత్తంబు నిను రాముఁడని వధించు. | 193 |
| సీ. | మణికిరీటమువాఁడు మకరకుండలకాంతి - దళుకొత్తు చెక్కుటద్దములవాఁడు నిడుద కన్నులవాఁడు నీలమేఘచ్ఛాయఁ - గరమొప్పు దివ్యవిగ్రహమువాఁడు కంబుకంఠమువాఁడు కౌస్తుభశ్రీవత్స - లక్ష్మీయుతోరః స్థలంబువాఁడు కనకాంబరమువాఁడు ఖడ్గాది పంచాయు - ధముల మించు చతుర్భుజములవాఁడు | |
| గీ. | చిలువదిండి హుమాయిపై మెలఁగువాఁడు లీలఁ బెను బాముపైఁబవ్వళించువాఁడు నీ మనోరథ మీజేర్చు నిక్కముగను సంశయింపకుమన్న రాక్షసవిభుండు. | 194 |
| ఆ.వె. | అతనిఁ బెక్కు గతుల నుతులొనర్చుచు భక్తి నతు లొనర్చి దేవతతుల మతుల నతులభీతు లొదవ నచ్చోటుఁ బెడఁబాసి చనియె స్వైరవృత్తి జనవరేణ్య! | 195 |
| ఉ. | రామనృపాల! వింటిగద రావణు బుద్ధి సమృద్ధి జానకిం గాముకుఁడై హరించెనని కానక పల్కుదు రామె యిందిరా శ్యామ యటంచు నీవు హరివంచు నెఱింగియె యుద్ధభూమి నీ చే మృతిఁబొందఁగా వలసి సీత నొగిం గొనిపోయె లంకకున్. | 196 |
| కం. | అని పల్కి మఱియుఁ గలశజ మునిధూర్జటి యనియెఁగమల ముకుళన సమయో గ్రనటన్నిటల తటీలో చన రటదంఘ్రిపుట కటక చటులార్భటులన్. | 197 |
| మ. | రవివంశంబున వెన్నుఁడెప్పు డవతారంబౌనొ? యమ్మేటితో బవరంబెప్పుడు గల్గునో? యెపుడు తద్బాణాహతిన్ గూలి దు ర్భవమున్ మృత్యువు లేని దివ్యపదముం బ్రాపింతునో? యంచు నెం చి విరాగస్థితి సంచరించు నసురశ్రేష్ఠుండు సీతాధిపా! | 198 |
| చం. | నెమకి సనత్కుమారుఁగని నీ మహిమంబులు విన్న దాదిగా సమరవిరోధి నీ మదికి నల్క జనింప సురాళి నీంచు లో కముల నలంచు జన్నములు గాంచిన విఘ్నము లాచరించు సం యములఁ గలంచుఁ బుణ్యసతులన్న గ్రహించుఁ జరించు నెయ్యెడన్. | 199 |
| చం. | అలయక యిట్లు ద్రిమ్మరుచు నద్దశకంధరుఁ డూర్ధ్వలోకముల్ నలకువఁబెట్టనెంచి యొకనాఁడు మణీమయ పుష్పకద్యుతుల్ నలుదిశ లావరింపఁజనగ, ననంగహరుం డనంగని ర్మలరుచి నుల్లసిల్లు సురమౌని వరుండెదురయ్యె నయ్యెడన్. | 200 |
| కం. | ఎదురైన పోరుదిండికిఁ బది మొకముల పొలసుదిండి ప్రణతుండై నా రద! యెచటినుండి యెటఁ జని యెదవెఱిఁగింపుము విశేషమేమి యటన్నన్. | 201 |
| చం. | ఎలనగ వంకురింప ముని యిట్లను రావణ! యింకనేమి విం తలు వివరింతు ? నీ విజయధాటికి భీతివి యూర్ధ్వలోకముల్ వలసలు దీయసాగె బలవంతుఁడవన్నను నీవె కాక నీ కిలనొకరుండు సాటిగలఁడే? యన బెట్టుగఁ గేరి నవ్వుచున్. | 202 |
| మ. | బలమీసల్ వడిఁగొల్పుచున్ బిగువుతోఁబౌలస్త్యుఁడేమంటి వౌ వలసల్ దీసెనె యూర్ధ్వలోకములు దేవర్షీంద్ర! యట్లైన నం దుల కేఁగం బనియేమి? శౌర్యమున నన్నుందాకి పోరాడఁగాఁ గలవాఁ డెక్కనుండు? నిక్కముగ వక్కాణింపవే నావుడున్. | 203 |
| ఉ. | ఆ ముని కొంతసేపు హృదయాబ్జమునం దలపోసి యాసుర గ్రామణిఁజూచిపల్కె సురకంటక! కయ్యము సేయఁగోరినన్ దీమస ముప్పతిల్లఁదెలి దీవికిఁ బొమ్మచటం జతుర్భుజుల్ తామరసాయతాక్షులు సితప్రభు లందు రజయ్యు లందఱున్. | 204 |
| శా. | చండాంశుప్రతిమాన తేజములతో సౌవర్ణభూభృన్నిభా ఖండాత్యున్నత దివ్యదేహములతోఁగౌమోదకీచక్ర కో దండాధ్యాయుధ పాళితోఁ దనరు శ్వేతద్వీపగుల్ త్వద్భుజా కండూచండిమఁ బాపనోపుదురు లంకానాథ! పొమ్మం చనన్. | 205 |
| కం. | ఆ రావణుండు క్రమ్మఱ నారదుఁగని యే తపం బొనర్చినవా రా వారాశియోరఁ బుట్టుదు రారూఢజ్ఞాన! తెల్పు మ నతఁడనియెన్. | 206 |
| మ. | హరిసేవాపరు లచ్చుతాంఘ్రికమలధ్యానాన్వితుల్ మాధవ స్మరణాసక్తులు విష్ణుమంత్రజపితల్ చక్రాయుధార్చారతుల్ గరుడారూఢకథాశ్రుతిప్రియులు రక్షఃశ్రేష్ఠ! యందుద్భవిం తురు నారాయణచక్ర నిర్దళితగాత్రుల్ మింతు రద్దీవిలోన్. | 207 |