| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రావణుడు నారదప్రేరితుఁడై శ్వేతద్వీపమునకుఁబోవుట |
| ఉ. | నావిని పంక్తికంధరుఁడు నారదు వీడ్కొని వేడ్కమీఱన ద్దీవిఁ గనుంగొనం దలఁచి తీవ్రముగం జనుచుండి వార్ధులున్ దీవులుఁ బర్వతంబులు నదీప్రతతుల్ విపినాంతరంబులున్ ద్రోవను జూచుచున్ గడచి దుగ్ధసముద్రముఁగాంచె ముందటన్. | 208 |
| తే.గీ. | కాంచి చెంగల మంత్రిపుంగవులఁగాంచి కాంచితిరె యీ యకూపారకాంచికాస మంచితక్షీరనిధి హీరమణి విరచిత కాంచిరుచిఁగాంచి చెలువు వహించె నెదుట! | 209 |
| సీ. | శకులవాలోత్‌క్షిప్త జలశీకరంబులు - మెఱఁగు ముత్యము లేరుపఱుపరాదు కలికిరాయంచ ఱెక్కలమించు తెలిచాయ - తెరట తేటయు గుఱుతెఱుఁగరాదు జలబాలికా పాలికల పొక్కిళుల వర్తు - లావర్తముల భేదమరయరాదు తఱచుగా గిఱికొన్న నురుఁగుల కుప్పల - నిసుక తిప్పల నిర్ణయింపరాదు | |
| గీ. | కనుఁగొనుఁ డుదాత్త దాతృత్వజనితకీర్తి ముంచుకొనె నన సహజమై మించు ధవళ కాంతి దిక్కులనెల్లఁ బిక్కటిల వెలయు పాలమున్నీరు కన్నుల పండువయ్యె! | 210 |
| సీ. | వలయు కోరిక వియ్యఁగల పెయ్య గలిగిము - ష్టింపచుల్ పరితుష్టిఁ జెందుటెల్ల మెడఁగెంపుఱా తాళి నిడుకొని వనమాలి - లిబ్బ గుబ్బెతఁబ్రబ్బి యుబ్బుటెల్ల వింటి తెర్వరి మేటి వెల్ల గౌరును నిక్కు - చెవుల నీలని నెక్కి చెలఁగుటెల్ల గటికి చీఁకటికి నగ్గంబైన రేవన్నె - లాడి వెన్నెలగీముఁగూడుటెల్లఁ | |
| గీ. | గూటి చవి వేలుపు లెఱింగికొనుటయెల్ల నమరవన మీవిమ్రాఁకుల నమరుటెల్ల హరుఁడు శ్రీకంఠుఁడనుపేర నలరుటెల్లఁ దలఁప నీక్షీరవారాశివలనఁగాదె ! | 211 |
| మ. | వలమానాంబు కరీంద్రహస్త చలనావర్తభ్రమత్తోయదా వళి మంథానమహీధర భ్రమణభావంబూన శంఖాబ్జశై వలకూర్మాదులు దత్తరంగముల ఠేవల్ గుల్కఁజెల్వయ్యె ని క్కలశాబ్ధిం బునరప్సరోజనన శంకాహేతువుల్ చంచలల్. | 212 |
| చం. | అనుపమబాడబానల శిఖావళి పైఁగనిపించెనో యనన్ దనరెఁబ్రవాళవల్లికలు దానవులార! కనుం డటంచు వ ర్ణన మొనరించుచున్ దనుజనాయకుఁ డవ్వనరాశి దాఁటి చెం దిన కుతుకంబుతోడఁ దెలిదీవిఁగనుంగొని చేరఁబోవఁగన్. | 213 |
| చం. | స్థలమహిమంబు పెంబీపున నిశాచరనాథ విమానరాజ మ వ్వలఁజనలేక వాయుహతవారిదమున్ వలెఁ గ్రమ్మఱంగ మం త్రులు భయమంది యిన్నెలవు దొడ్డది మేనులు కంపమందెడిన్ నిలిచెదమేము పుష్పకము నిల్చినచో నసురేంద్ర! నావుడున్. | 214 |
| చం. | నగుచు దశాస్యుఁడట్టులయినన్ నిలువుం డని పుష్పకంబు శీ ఘ్రగతిని డిగ్గి సాహసము గాఢపరాక్రమ ధైర్యసంపదల్ మగఁటిమియుం దగన్ దురభిమానముతోఁ దెలిదీవిఁజొచ్చి పో యె గరుడకేతు దర్శన సమిద్ధమనోరథ దుర్నివారుఁడై. | 215 |
| వ. | ఇత్తెఱంగున దైతేయద్విపంబు శ్వేతద్వీపంబు ప్రవేశించి తత్ప్రదేశంబున | 216 |
| సీ. | ఘనసారసితవాలుకా ప్రదేశంబులు - శశికాంతవేదికా సముదయములు మరకత ప్రవిభాసమాన సోపానముల్ - పద్మరాగోల్లసత్పర్వతములు సౌవర్ణకమల భాస్వరసరోవరములు - హరిచందనాంచితోద్యానవనులు వివిధ విద్రుమలతావృత లతాగృహములు - బహువర్ణ శుకపిక భాషణములు | |
| గీ. | బంధురానేకవిధ దివ్య పరిమళములు మహిత వజ్రోపల నిబద్ధ మార్గములును నిర్మలోదక పరిపూర్ణ నిర్ఘరిణులు గలయెడల్ సూచి దనుజుఁ డక్కజముఁజెంది. | 217 |
| మ. | ఒక శృంగారవనంబులో సఖులతో నొయ్యారముల్ మీఱ ను త్సుకతం గ్రీడ యొనర్చు భామినుల రక్షోభర్త వీక్షించి చెం తకుఁబోవన్ జెవి యోర్తు పట్టి యఱచేతంబెట్టి యెవ్వాడవే టికి నిచ్చోటికి వచ్చి తీ వనినఁగుంఠీభూతగాంభీర్యుఁడై. | 218 |
| కం. | జడిసియు జడియక విశ్రవు కొడుకున్ దశముఖుఁడ రణముగోరి యిచటికిన్ నడతెంచితి నను మార్కొని యెడు వీరుని నొకనిఁగాన నేమందుననన్. | 219 |
| చం. | కిలకిల నవ్వి యచ్చెలి సఖీమణులం గని యమ్మలార! విం తలు గనుఁగొంటిరే? యిదిగొ తానఁట! యిక్కడనున్న వారితోఁ గలహ మొనర్ప వచ్చెనఁట! కాదని పట్టిన వీఁడు చేతిలో పలికిన లేఁడు నేఁడు బహుభంగులఁబ్రేలెడు నంచుఁజూపినన్. | 220 |
| ఉ. | వారలలోన వేఱొకతె వచ్చి రయంబున దానిచేతిలో బీరము దక్కియున్న యతిభీతుని రావణుఁబట్టి పాని పం కేరుహసీమఁబెట్టుకొని, క్రేవలఁబొర్లినఁబొర్లనీక, యౌ రౌర! విచిత్రమైన పురుగబ్బె నటంచుఁజెలంగుచున్నెడన్. | 221 |
| ఆ.వె. | దాని పాణినున్నవాని వేఱొక్కతె బలిమిఁదిగిచి తలలు పదియుఁజేతు విరువదియును గల్గి యీ పురుగెంత విం తాయె ననుచుఁబట్టి యాడఁ దొడఁగె. | 222 |
| ఆ.వె. | ఒకతెచేత నతని నుండనీయక సతు లొకతెచేతివాని నొకతె యొడిచి బూచిబూచి యనుచుఁ బోనీక పిడికిళ్లఁ బట్టిపట్టి గాసిపెట్టుటయును. | 223 |
| కం. | ఆ యిందుముఖులచేఁబడి రాయిడిఁబడి నలుగువడి రావణుఁడు వడిన్ గాయము నొచ్చినఁదొలఁగు ను పాయము మఱిలేక యొకతె పాణిఁగఱచినన్. | 224 |
| ఆ.వె. | చేయిఁగఱచె నమ్మచెల్ల! యీ చెడు పురు గేడనుండి వచ్చె నీడ కంచు జడిసి కెలననున్న సకియపై వైచిన నదియు నతనిఁబట్టి యాగ్రహమున్. | 225 |
| కం. | మా చెలిని గఱవవచ్చితి వేడి చెడుపురుగ! యని మింటికెగసి రయమునన్ డాచేతనున్న రక్కసు నా చక్కటి వార్ధి విసరియది పడవైచెన్. | 226 |
| కం. | వైచినఁబవిధారానిహ తాచలముంబోలి దైత్యుఁడంబుధిఁబడినన్ జూచి సురమౌని గంతులు వైచుచుఁ దెలిదీవినున్న వనితలఁబొగడెన్. | 227 |
| శా. | శ్వేతద్వీపము కొమ్మ లీ గతిఁదనుం జీకాకు గావించినన్ దైతేయాగ్రణి భీతి విస్మయపరీతస్వాంతుఁడై యింతయుం జేతోజాతగురు ప్రభావ మనుచుం జింతించుచున్ లేచి ల జ్జాతాపంబులు ద్రోచి లంక కరిగెన్ సామంత సంఘంబుతోన్. | 228 |
| చం. | వనితలచేత గాసివడి వచ్చితి విష్ణునితోడ నెట్టు మా ర్కొనఁగలవాఁడ? నంచు మదిఁగొంకఁడు రావణుఁడెట్టులైన ని న్నని నెదిరించి నొంచెదనటంచు గణించు, వచించు వాక్కులం దన కెదురెవ్వరంచు, చది మదంబని తోఁచును విన్నవారికిన్. | 229 |
| ఉ. | కాంచనగర్భదత్త వరగర్వమునం గడు మించియున్నద రా త్రించరరాజు నట్లు తెలిదీవి వధూటులచేత గాసి సే యించినవాఁడ, వీ వెఱుఁగవే యిది? యేల యెఱంగనట్టు లా లించెద? వబ్జబాంధవకులీనతఁ జెంది సరోరుహేక్షణా! | 230 |
| చం. | సబలు నశక్తుఁజేయుదు వశక్తు బలాఢ్యునిఁజేయు, దజ్ఞునిన్ విబధునొనర్తు వవ్విబుధునిన్ జడుఁగా నొనరింతు వెట్లెఱుం గఁబడు భవత్ప్రభావ మజకంతుహరాదు లెఱుంగలేరు వే డబములు గాక యైహికజడత్వము లున్నవె నీకు ఓ రాఘవా! | 231 |
| మ. | ధరణీదైవతశాపవాక్యమున నీ ద్వారస్థులే దేవతా పరులై మూఁడు భవంబులన్ నినుఁగనన్ బ్రార్థించినన్ ఘోణివై హరివై తొల్తటి దైత్యరూపములు సంహారంబు గావించి తీ కరణిన్ రావణకుంభకర్ణు లయినన్ ఖండించి తీ రూపునన్. | 232 |
| కం. | శాపవశమ్మున నీ రిపుఁ డై పౌలస్త్యుండు కోరినటువలె నీచే నే పడఁగును ద్వాపరమున నీ పరిభవమంది మ్రంది యొనయు విముక్తిన్. | 233 |
| వ. | అని పలికి కలశజుండు వెండియు | 234 |
| తే.గీ. | రాముఁగనుఁగొని శ్రీరఘురామ! తపన ధామ! శుభనామ! కారుణ్యధామ! నృపల లామ! దశకంధరవిరామ! నీ మహత్త్వ మెఱిఁగి నుతియింపనేర్తునే యించుకైన | 235 |