ఇతిహాసములు ఉత్తరరామాయణము అగస్త్యాదిమునులు రాముని వీడ్కొని స్వస్వనివాసంబులకుఁబోవుట
అగస్త్యాదిమునులు రాముని వీడ్కొని స్వస్వనివాసంబులకుఁబోవుట
నిరోష్ఠ్యసీసముజయ! దశరథ రాజ జఠర సాగరచంద్ర! - జయ! తాటకా కరంజక కరీంద్ర!
జయ! ధరాదిక జగజ్జాల రక్షాదక్ష - జయ! దయారస నిరంజన కటాక్ష!
జయ! ఘనాహల్యాఘ లయ దాంఘ్రి సరసీజ! - జయ! సహస్రాదిత్యసదృశతేజ!
జయ! చంద్రధరశరాసన ధరాధర శక్ర! - జయ! నిరీక్షా సక్త జటిలచక్ర!
 
గీ.జయ! ఖరాది నిశాట శిక్షానిధాన!
జయ! కిరాతీకృతార్చన సన్నిధాన!
జయ! నిశాత శరాహత జలనిధాన!
జయ! జనకకన్యకాధీన! జయనిధాన!
236
చం.త్రిదశుల చింత జాఱె నమరీతతి వంతలు తీఱె మౌనిస
మ్మదములు మీఱె నీవలన మార్తురఁద్రుంచి జయంబుగాంచి యే
కొదవయు లేని నిన్నుఁగనుఁగొంటిమి వేడుకయయ్యెఁ బోయి వ
చ్చెదమిఁక మమ్ముఁబంపు రఘుశేఖర! నిన్ను శుభంబులొందెడున్‌.
237
తే.గీ.అనిన నానందకందళితాంతరంగుఁ
డై రఘుస్వామి కలశజుం డాదియైన
మునులకుఁగరాంబుజంబులు మొగిచి సూక్తి
వినయము దహింప నిటులని విన్నవించె.
238
చం.అతులతసోమహత్త్వనిధులార! భవత్కరుణాకటాక్షసం
గతులకు నెల్ల సౌఖ్యములు గల్గుట వింతయె? మిమ్ముఁగన్న దు
ష్కృతములు నిల్చునే? తలఁపనేటికి నిష్కృతులైన మీఁదటన్‌?
గ్రతువులు నేనొర్చునెడ రావలయుం గృప మీర విందఱున్‌.
239
శా.వీనుల్‌ సౌఖ్యముఁ జెందె మీ వచనముల్‌ విన్నందునన్‌, మిమ్ము స
న్మానంబొప్పఁగఁజూచి లోచనము లానందించె, యుష్మత్పదా
ధీనున్‌ నన్‌ గృపఁజూడుఁడంచని సభక్తిన్‌ మ్రొక్క దీవించి య
మ్మానుల్‌ వీడ్కొని పోయిరంత రఘురామస్వామి హృష్టాత్ముఁడై
240
ఉ.వారిగుఱించి కొంతవడి వర్ణనసేయుచునుండి విప్రులం
బౌరుల నిష్టబాంధవుల భానుకుమారవిభీషనాదులం
గూరిమి తమ్ములన్‌ సఖులఁగొల్చిన భృత్యుల సాదరాంచితో
దార మృదూక్తులం బనిచి తానును లోపలికేఁగె నయ్యెడన్‌
241
చం.చరమదిశానురక్తి రవి జాఱెఁ, గుముద్వతి మీఱెఁ, బద్మినీ
స్ఫురణలు దాఱెఁ, జక్రముల భోగము దీఱె, ద్విజాళి సంధ్యకున్‌
సరసులఁ జేరె, నీడముల చక్కికిఁ బక్షులు వాఱె, వేఁటకున్‌
దురుసుగ మీరుఁడస్త్రములు నూఱెఁ, దమంబును జేరె దిక్కులన్‌
242
ఉ.అంతకుమున్నె రామవసుధాధిపుఁ డంతిపురంబునందు సా
యంతన సత్క్రియానిచయ మంతయుఁదీరిచి కేలికాగృహా
భ్యంతరసీమ భూమితనయాకృతసేవల స్వాంతమెంతయున్‌
సంతసమంద నర్హమగుచందమునన్‌ నిదురించె నయ్యెడన్‌
243
చం.పులుగు నెచ్చరించి తీగపువ్వుల నిద్దురవుచ్చి తమ్ములన్‌
గలకల నవ్వఁజేసి వలిగాడ్పుల దిక్కులనించి తారకా
విలసనవైభవం బడఁచి వేకువవేళ రహింప రాము మే
ల్కొలుపఁగ వందిమాగధముఖుల్‌ చనుదెంచి యుదంచితార్భటిన్‌
244
సీ.చోఱవై వారాశిఁ దూఱి చోరునిఁ జీరి - మీఱు చారువిహార! మేలుకొనుము
మేటి తాఁబేటి బూమెలు పూని మంథాన - శైల మెత్తిన ధీర! మేలుకొనుము
ఘోణివై సంభృత క్షోణివై రిపుయుద్ధ - కేళిఁ గూర్చిన శూర! మేలుకొనుము
భక్తు మాటలఁ బట్టి బలుకంబమునఁ బుట్టి - మెఱసిన నరసింహ! మేలుకొనుము
 
గీ.లీల వటువృత్తిఁ గను ధన్య! మేలుకొనుము
మేదినీశ ప్రవర్ధన! మేలుకొనుము
శూలికోదండ ఖండన! మేలుకొనుము
నీల నీలాంబుద శ్యామ! మేలుకొనుము
245
చం.మునుకొని దేవ! నీవు కనుమూసిన లోకము లస్తమించు నీ
కనుఁగవ విచ్చి చూచిన జగత్త్రయి మేల్కను విష్ణుమూర్తి వౌ
నినుఁగొనియాడఁగాఁదరమె? నిద్దురమాని జగంబుఁబ్రోవవే!
మనుకులనాథ! యంచుఁ బలుమాఱును వారు నుతుల్‌ ఘటింపఁగన్‌
246
కం.విని మేల్కని తనకంటెను
మును మేల్కని చెలువుఁబూని ముందట నిలుచుం
డిన సీత మొగముఁగని పతి
వెనుకను మణిదర్పణంబు వేడుకఁగనుచున్‌
247
సీ.వాడిన విరులతో వాసుధేయీ నేత్ర - కజ్జలకలితాలికంబుతోడఁ
జిటుల మైపూఁతతో సీతాదృఢోరోజ - కాశ్మీరచారువక్షంబుతోడ
జాఱు కైశికముతో జనకజాతాంబూల - రసరాగలసిత నేత్రములతోడ
బడలు నెమ్మొగముతోఁ బంక్తిరథస్నుషా - గల్ల హరిద్రాంక గళముతోడఁ
 
గీ.గేళిగృహసీమ వెడలి భగీరథార్క
కన్యకాది నదీ తోడ కలిత కనక
కలశములు సీతసఖులూని కాచియున్న
యల్ల మజ్జనశాలకు నధిపుఁడరిగి
248
చం.జలకములాడి, క్రొంజిలుఁగు చల్వలు దాలిచి, పుణ్యవేదిపై
నెలకొని సంధ్యవార్చి, జపనిష్ఠలు దీర్చి, కృతాగ్నిహోత్రుఁడై
వలయు ధరామరేంద్రుల కవారిగ దానములిచ్చి పంచి, మా
తలకు నమస్కరించి, కులదైవముఁగాంచి భజించి పిమ్మటన్‌
249
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju