ఇతిహాసములు ఉత్తరరామాయణము రాముడు కొలువు కూటంబునఁ బేరోలగంబుండుట
రాముడు కొలువు కూటంబునఁ బేరోలగంబుండుట
సీ.మణిసహస్రముల ద్యోమణిసహస్రంబుల - డంబు మెచ్చని కిరీటంబు దాల్చి
మొగము చంద్రుని గెల్వ మొనయుకీర్తి యనంగఁ - దెలివిగాఁ గపురంపుఁ దిలకమూని
నిజగుణావళి లీల నిర్మలశ్రీ మించు - తళుకు ముత్యాల చౌకళి ధరించి
బలిమి కేళికిఁబూను బలు బిరుదములునాఁ - గరముల వజ్రాల కటకములిడి
 
గీ.పొసఁగఁగుంకుమ గందంపుఁబూఁత రత్న
హారములుగానరా ముత్తియంపు టంగి
రహిఁ దొడిగి పెద్ద పీతాంబరంబు వెలయఁ
గొలువు సింగారమయ్యె రఘు ప్రభుండు
250
వ.ఇత్తెఱుంగునం గొలువు సింగారం బై, యప్పతంగకులపుంగవుండు, నిజాంగన మెఱుంగు వాలుఁజూపులతో నివాళించి మేలికపురంబుబాగా లొసంగినం గైకొని, సీతయనుంగునెచ్చెలి దెచ్చి యుంచిన కాంచనపాదుకాయుగళంబు వెట్టుకొని, తనగండపెండెరంబురవళి ననుసరించు గిలుకందియలరవళితో వెంట వచ్చి పుడమిపట్టి యిచ్చుమడుపు లందుకొనుచుఁ ద్రిచతుః కక్ష్యాంతరంబులు గడచి, యయ్యింతి మరల ననిచి, ముదంబున నెదుర్కొని పవననందనుఁ డొసంగినకైదండఁ గొని తనయిరుగెలంకుల నకలంకముకురముఖులు పట్టుంహొంబట్టు జిగిగచ్చు టరిగలనిగనిగలతో నొరయు మణిమకుటప్రభలకు నికటంబు లగుపద్మ రాగమణిద్వారదేహళీవిటంకంబులఁ బొంకంబై మీఱు హజారంబుఁ జేరి, యంతకు మున్నె యచ్చటికి వచ్చి యున్న వసిష్ఠాదిమునిశ్రేష్ఠుల కభివందనంబు లొనరించి, తదంచితాశీర్వాద పురస్సరంబుగాఁగాంచన మయోచ్చాసనంబున నెలకొని, కాంచనగిరిశిఖరంబుపై నిండోలగం బున్న యన్నలుమొగంబులయన్న విన్నాణంబును వహించి, తలంపురామిన్న గద్దియపై నెలకొన్న వేల్పుమన్నెవాని చెన్నున నున్నతిఁ గని, తిన్న నగునడలు నున్న నగుతొడలు మిన్న నగు కౌనులు హొన్నుజిగిమేనులు బెళుకుఁ దెలిగన్నులుఁ గులుకువలిచన్నులుఁ దలిరునునుమోవులు నలరు పెనుతావులుఁ గలయొప్పులాఁడులు తమకప్పు పెన్నెఱులకు వైవఁ, జందురునగు మొగంబులు గలకొందఱు కుందరదనలు తమ తెలినగవువెన్నెలల చెలువంబున నలవడుచలువపావడలు వీవఁ, జిలుకలవలెఁ బలుక నేర్చినకొందఱుకులుకులాఁడులు తమ కులుకుగుబ్బలం బోలకున్న నీళ్లు మోయించి రనంజాలు జాళువాగిండ్లు పూని కెలంకులం గొలువుసేయఁ, గాయజుదమంబు లనం గొమ రగు కొమిరెప్రాయంపు ముద్దుగుమ్మలు కొందఱు తమతమ మేనితావులకుఁ దావలం బగు వట్టివేళ్ల సురఁటుల కమ్మనెత్తావులు తాళవృంతానిలంబుల నొలయింప, సంపెంగముక్కులం డెక్కులు గల చక్కెర బొమ్మలు కొందరు కర్పూరవీటికా పేటికాదులు గైకొని యంతంత నిలిచి తమతమ యూడిగంబులకు సమయం బరయఁ, గొఱనెలతో నెదురునుదురులు గల చదురాండ్రు గొంద ఱంబురుహకరంబులఁ దంబుఱలు వీణెలు డక్కలుఁ బిల్లనగ్రోవులుఁ గిన్నరలుఁ జెంగు లుపాంగంబులుఁ దాళంబులు మొదలగుజంత్రంబులు గొని తత్తదుచితలయస్వరతాళమేళనంబులఁ దానంబులు విస్తరించి, యనురాగంబుతోఁ గాలోచితరాగంబులు సేయుచు మనంబు లలరం బాడుచు సభారంజనం బొనరింప, నిలింపపతికొలువు వెలచెలువల చెలువంబులు మెచ్చనిమెచ్చులాఁడులు గొంద ఱరాళపతాకతామ్రా చూడసూచీముఖ కటకాముఖ త్రిముఖ సర్పశీర్షార్ధచంద్రముఖహస్త విశేషంబులు విలోకనీయంబులుగాఁ గమనీయముఖవిలాసంబులు భాసిల మధ్యమద్రుత విలంబితంబులు డంబు గులక సూళాదితాళంబులుమేళంబుల రంగగురక్తులెసంగ నభినయించుచుఁ జదురు పదము దేశీయము మొదలగులాస్యవిధంబులు గనిపింప, బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రాదిజనంబు లుచితప్రదేశంబులు వసియింపఁ, గురు కరూశ ఘూర్జర సింధు గాంధార సౌవీర కాశ్మీరచేతి తుందిర పాండ్య ద్రవిడ బర్బర చోళపాంచాల మగధ మాళవ మత్స్య మళయాళ నేపాళ టెంకణ కొంకణ యవన బంగాళ కళింగ ప్రముఖవివిధధేశాధినాథు లలిక స్థలవిన్యస్త హస్తులై భజియింపఁ - గోసల రాజకన్యకా గర్భవయః పారావార పరిపూర్ణ చంద్రోదయా! దయాదాక్షిణ్య తారుణ్యనై పుణ్యలావణ్యప్రముఖనిఖిల గుణగణాలంకారా! లంకారక్షణదక్షరక్షఃకులాధ్యక్ష శిక్షాదీక్షాధురంధరా! ధరాకుమారికామణి రమణీయమనః కమల కమలాకరవిరాజద్రాజహంసోత్తంసవిహారా! హారకేయూరకటకమకుటకంకణాంగుళీయకముద్రికాతులాకోటి కాదిభూషావిశేషాభారామా! రామా! నృపలలామా! జయ విజయీ భవ - యని వందిమాగధ బృందంబు బహువారంబులు గైవారంబులు సేయ, సౌవిదల్లక సాహోనినాదంబు లెసంగఁ, బ్రసంగోచితవచన రచనాపటు లగుకవినట గాయక పరిహాసక విదూషక ప్రముఖులు భజియింప, నింపుసొంపులతో నుబ్బుచు డెబ్బది రెండు నియోగంబులవారు దూరంబున నుండి సేవింప, నిండోలగంబున నుండి, విదేహ రాజ్యముఖ్యు లగుబంధు ప్రముఖులు నుపచరించుచు, భరతలక్ష్మణశత్రుఘ్నులు వచ్చి సేవించిన నాదరించి యుచితాసనంబుల నుండ నియమించుచుఁ, గామరూపంబులు దాల్చి నయంగదాదివానరవీరయోధులతోఁ దనవలపలికెలన నుదగ్రమణి పీఠంబుపై నున్ననుగ్రీవునప్పటప్పటికి నుచితోక్తుల నలరించుచు, మంత్రి చతుష్టయసమేతంబుగాఁదనడాపలి పార్శ్వంబుననున్న విభీషణు సప్రేమంబుగా నవలోకించుచు, నిజచరణపీఠాసన్నవర్తి యగుహనుమత్కపి చక్రవర్తి యుపమాద్యలంకారకలితానవద్యగద్యపద్యాదుల దనుఁ బ్రశంసించిన నవధరించి సంతసించుచు, విద్వత్ప్రముఖతత్తజ్జన విద్యాపరిశ్రమంబుల నెఱుంగుచు, హితపురోహితమంత్రి సామంతమిత్త్రసఖిప్రముఖుల కర్హభంగిఁబ్రత్యుత్తరంబు లిచ్చుచుఁ, బౌరజానపదాది ప్రకృతిజనంబుల విజ్ఞాపనంబు లవధరించుచు, దీనానాథ జనంబులు గోరిన ధనక కనకవస్తువాహనాదు లిప్పించుచు, నేర్పు మెఱసి పౌరాణికు లెఱింగించు సముచిత పుణ్యపురాణకథా ప్రపంచంబున వీనులకు విందు సేయుచు, నక్షత్రగణమధ్యంబునందు దేజరిల్లు రాకాచంద్రుచందంబున, గ్రహసభాంతరంబున విలసిల్లు ప్రభాకరుభావంబునఁ జెలంగె, నయ్యెడ.251
శా.ఆ రామక్షితనేత చెల్మి వినయం బౌదార్య మైశ్వర్యమున్‌
దారుణ్యంబును జెల్వు మెచ్చి నృపు లాత్మప్రాజ్య సామ్రాజ్యర
క్షారంభంబులు మాని దర్శనవిధాయత్తాత్ములై యుండి ర
ప్పౌరుల్‌ జానపదు రొండక పనుల్‌ పాటింప రెప్పట్టునన్‌.
252
కం.ధ్యానముల మాత్రమునఁ బర
మానంద మొసంగు బ్రహ్మ మాకారముతోఁ
గానంబడినను జూచిన
మానవు లానందవార్ధి మగ్నులుగారే!
253
చం.ఇనకులశేఖరుం డిటుల నెల్ల జనంబులు సంతసిల్లఁగా
దినమును బాకశాసను గతింగొలువై తన పెద్దకొల్వునం
దనరుచు నొక్కనాఁడు సవిధంబున బంగరు గద్దెనున్న య
జ్జనకనృపాలుఁజూచి యుపచారపురస్సర భంగి నిట్లనున్‌.
254
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju