ఇతిహాసములు ఉత్తరరామాయణము శ్రీరాముడు జనకాదినృపవర్యుల సత్కరించి పంపుట
శ్రీరాముడు జనకాదినృపవర్యుల సత్కరించి పంపుట
చం.జనకుని కైవడిన్‌ బ్రజల సంతతమున్‌ దయఁజూచి ప్రోవఁగా
జనకసమాఖ్య మీ కలరె శాత్రశిక్ష యొనర్చి సీతతో
ననుపమసౌఖ్యమేఁగనిన దంతయు మీ కృపఁగాదె? మామగా
రనుటయకాని మా దశరథావనిభర్తకు మీకు భేదమే?
255
ఉ.పెక్కు దినంబులాయె మముఁ బ్రీతిఁ గనుంగొన వచ్చి యెన్ని నా
ళ్లిక్కడ మీరలున్న శుభమేయగు నైనఁ బ్రజాభిరక్షణల్‌
దక్కి వసింపరాదనికదా వివరించెదఁ బోయి రండు మా
దిక్కు కటాక్షముంచుఁడని దివ్యమణీమయభూష విచ్చినన్‌.
256
ఉ.ఆ మిథిలాధినాథమణి యల్లుఁడొసంగిన రత్నభూషణ
స్తోమము పాణినంది నృపసోమ! యివేటికి? మామయంచునన్‌
బ్రేమ బహూకరించుటయె పెక్కు ధనంబులు! సీత లక్ష్మి! నీ
వే మధువైరి! నీ మహిమ లెంచుచు నూరికిఁబోయి వచ్చెదన్‌.
257
కం.అని యుచితభంగి వీడ్కొని
జనకమహీభర్త రామచంద్రు ననుజ్ఞం
దనవెంట భరతుఁడనుపం
జనుదేరఁగ మిథిలకేఁగె సంతసమెసఁగన్‌.
258
ఉ.అత్తఱి రాఘవుండు నినయంబునఁ గేకయముఖ్యుఁడౌ యుధ
జిత్తునిఁజూచిఁ పల్కె నృపశేఖర! యీ విభవంబు యుష్మదా
యత్తము మాకు మీరె కద యార్యులు, మీరిటఁ దామసించినం
జిత్తమునందు మీ గురుఁడు చింతిలు మీరును బోయిరాఁదగున్‌.
259
తే.గీ.మిమ్ముఁ బనుపంగ వచ్చు సౌమిత్రి యనుచు
నమిత రత్నాంబరశ్రేణు లతని కొసఁగఁ
బ్రేమ నన్నియు మరల నర్పించి యర్హ
ఫణితి నుతియించి యజ్జనపాలుఁ డరిగె.
260
కం.శ్రీరామచంద్రుఁడంతట
వారాణస్యధిపుఁడగు ప్రవర్ధనననామున్‌
భూరిగుణధాము నిజసఖు
గారవమునఁజూచి ప్రియము గనఁబడఁబలికెన్‌.
261
ఉ.నీవు గుణాంబురాశివి వినీతుఁడ వెంతయుఁ బెద్దవాఁడవున్‌
బావనమూర్తి వాదరణఁబాయవు నే శిశువైన దాదిగాఁ
గావునఁ బాయఁజాలనని గద్దియ డిగ్గి కవుంగిలించి సం
భావనసేసి వీడ్కొలిపె భానుకులీనుఁడు సభ్యులెంచఁగన్‌.
262
కం.తరువాత నిఖిల ధరణీ
శ్వరులఁబ్రియంకరుల రామచంద్రుఁడు వెలిదా
మరరేకులు వెదజల్లిన
కరణిం దన చూపు లొలయఁగనుఁగొని పలికెన్‌.
263
మ.ధరణీనాయకులార! మీ భుజబలౌద్ధత్యంబునం బంక్తికం
ధరుఁడీల్గెన్‌, వినుఁడేను గారణము మాత్రం బింతె, మీలోన నొ
క్కరుఁడన్‌, నాయెడ నెయ్యముంచి నయమార్గంబొప్ప మీమీధరల్‌
పరిపాలింపఁగ నింకఁ బొండని సుధాప్రాయోక్తులం బల్కినన్‌.
264
కం.ఆ యుచితోక్తుల నవనీ
నాయకులానందమొంది నతరక్షణ సం
ధాయకు రఘునాయకు శుభ
దాయకుఁగని యనిరి ముకుళితకరాంబుజులై
265
సీ.అఖిలభూతమయుండ వగుట నీ విజయ మం - దఱ జయం బనుట తథ్యంబకాదె!
యొకటికి నననేల? సకలంబునకు హేతు - వైయుండు దదియుఁ దథ్యంబకాదె!
యంతరాత్మకుఁడవై యందఱలో నొక్క - యాకృతి నునికి తథ్యంబకాదె!
నీయందు నెయ్యముల్‌ నిలుపు నయమార్గ - మైనన్నమాట తథ్యంబకాదె!
 
గీ.విభుఁడ వయ్యును మానుష విగ్రహంబుఁ
దాల్చి వెలుఁగొందు నీయాజ్ఞఁదలల మోచి
పోయి వచ్చెద ముంచుము పూర్ణకరుణ
రాజదేవేంద్ర! దశరథ రామచంద్ర!
266
తే.గీ.అని నుతించిన వస్త్రమాల్యానులేప
వీటికాదులు తద్ధరా విభుల కొసఁగి
వినయమునఁ చిన్నతమ్ముని వెంటఁబనుప
నా రఘూత్తము వీడ్కొని వారలపుడు
267
మ.అవనీభాగము కంపమొందఁగ ననేకాక్షౌహిణుల్‌ గొల్వఁగా
జవనాశ్వద్విరదాదిఘోషముల దిక్చక్రంబు మార్మ్రోయ భూ
ధవు లెల్లంజని రాత్మభూములకు దైత్యచ్ఛేదనంబాదిగా
రవివంశాగ్రణి చేసినట్టి పలుకార్యంబుల్‌ ప్రకీర్తించుచున్‌.
268
తే.గీ.ఇటుల జనకాది బంధుల నెల్లనృపులఁ
బనుప రామాజ్ఞ నరిగిన భరతలక్ష్మ
ణాదు లాయా నృపాలకు లంపినట్టి
కానుకలతోడ వచ్చి రాఘవునిఁగాంచి.
269
సీ.పట్టపేనుంగు లారట్టాశ్వములు హొన్ను - గట్టుల మెచ్చని ఘనరథములుఁ
బట్టు చుట్టలనేక పరిమళపేటిక - లకలంకరత్న పల్యంకికలును
ధనమణిరాశులు దాసదాసీజనుల్‌ - మణికిరీటంబులు మణిసరములు
జాళువాసొమ్ములు సరిగ దువ్వలువలు - హైమామాణిక్యసింహాసనములుఁ
 
గీ.బట్టె మంచంబు లొఱపైన పఱుపు లుదిరి
బొమ్మలనుబోలు ముద్దులగుమ్మ లాది
యైన కాన్కలు గొలువున్న యధిపు దృష్టి
పథమునందిడి సద్భక్తిఁబ్రణతులైన.
270
కం.కాకుత్‌స్థుఁడలరి యర్హము
లౌకొన్ని విభూషణంబు లతులాంబరముల్‌
చేకొని సుగ్రీవాదిమ
హాకపులకు నవ్విభీషణాదుల కొసఁగెన్‌.
271
తే.గీ.ఒసఁగి రఘురాముఁడొక హారమూని భల్లు
కేంద్రుఁగని, తాత! తగును నీకిది గ్రహింపు
మనిన, నన్నేల కొమ్మనె ననుచు ముసలి
కేల? యని నవ్వి సభ హారమిచ్చె విభుఁడు.
272
కం.ఉరముల మణిహారంబులు
కరములఁ గటకాంగుళీయక ప్రముఖములున్‌
సిరముల మిసిమి కుళాయిలు
ధరియించి చెలంగి రఖిలతరుచరముఖ్యుల్‌.
273
తే.గీ.వారిలోన విశేషించి వాలిపుత్రు
నమ్మారుత్పుత్రుఁ బిలిచి నిజాంకయుగళి
నిలిపికొని తానె తొడవు లన్నియునుదొడిగి
యర్కసుతుఁజూచి పతి యిట్టు లానతిచ్చె.
274
కం.నినుఁగొలిచిన కపు లందఱు
ఘనకార్యధురీణు లగుచుఁగడిఁది పనుల్‌ చే
సినవారు, నీ కుమారుం
డనిలసుతుఁడుఁబూజ కర్హులన నతఁడనియెన్‌.
275
సీ.శాఖిశాఖలనెక్కు శాఖామృగములకు - హేమాసనములపై నెక్కఁగలిగె
వల్కలకౌపీనవంతులౌ కపులకుఁ - బట్టాంబరమ్ములు కట్టఁగలిగె
వనభూరజము గప్పికొని మెలంగు వనాటు - లకుఁ జందనాదు లలందఁగలిగె
ఫలమూలములు దిని బ్రదుకు మర్కటులకు - మేలోగిరంబులు మెక్కఁగలిగె
 
గీ.నొడలనే పోడిమియు లేకయున్న వలిము
ఖులకుఁ గటకాదికము లూనుకొనఁగఁ గలిగె
నటవి చరులకుఁబురిఁ దిరుగాడఁగలిగె
శ్రీరఘూత్తమ! నినుఁగొలిచిన కతమున.
276
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju