| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | శ్రీరాముడు సుగ్రీవాదివానరులను విభీషణాదులను బహూకరించుట |
| కం. | నీ నెయ్యము గల్గినఁ దృణ మైనను మేరువగు మేరువైనను దృణమౌ నీనెయ్యము దఱిగిన నీ వానరు లెంత? యన రామనసుధేశుఁ డనున్. | 277 |
| కం. | నీవారి నీవు సన్నుతి గావింపవుగాక! సహజ గాంభీర్యనిధుల్ నీవారిందఱు రవిసుత! భావింపఁగ వీరి పనులు పరమాద్భుతముల్. | 278 |
| సీ. | ఘనభూమిభృచ్ఛిరోగ్రము లెక్కు ఘనులకు - నీ చిన్న గద్దియ లెక్కుటెంత? బలుకాంతిఁ బరమేశు వలువలు గప్పెడి - ఘనులకీ జిలుఁగులు గట్టుటెంత? తులలేని శుభవాసనల మించు ఘనులకీ - యలతి తావుల గంధమలఁదు టెంత? యమృతాశనుల సామ్యమందిన ఘనులకు - నిక్కూడ చవిఁగొని మెక్కుటెంత? | |
| గీ. | అధిక గుణరత్నభూషితులైన వీరి కీ విభూషణతతులు వహించుటెంత? యఖిలజగముల నప్రతిహతరయమునఁ దిరుగు వీరల కీప్రోలఁ దిరుగుటెంత? | 279 |
| చం. | వననిధు లన్నియుం గలఁచివైవ వసుంధరఁబెల్లగింప సూ ర్యుని దిగమ్రింగ ఘోరలయరుద్రునినైనను మార్కొనంగ నో పిన ఘనులీ మహాకపులు భీతివహింపుదురే మహాత్ముశా సనమున కట్టి యాజ్ఞగల శౌర్యనిధిన్ నిను నెంచ శక్యమే? | 280 |
| మ. | అని మైత్రిం గొనియాడి, మంత్రి సహితుండౌ పంక్తికంఠానుజ న్ముని లాలించి వలీముఖాగ్రణులకెంతో వేడ్కఁబుట్టించి యొ క్కనిమేషంబనితోఁపఁబెక్కు దినముల్ కాకుత్‌స్థరత్నంబు మ న్ననలందేలిచె వారు నుండి రమితానందాబ్ధి నోలాడుచున్. | 281 |