| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | హేమంతర్తు ప్రవేశము - తద్వర్ణనము |
| కం. | శిశిరమరుదెంచె నంతట నిశలాయతగతి వహించె, నెత్తమ్మి తెగల్ కుశలత డించె, దినంబులు గృశియించె, వడంకు ముంచె నెల్లజనములన్. | 282 |
| కం. | అంబరమణి సాంబరుఁడ య్యుం బరువిడుఁజరమగిలికి నర్వుంశకుఁడ య్యుం బవమానసఖుఁడు మం చంబుల క్రిందటనె డాఁగుఁజవి యల్పంబే? | 283 |
| సీ. | ముద్దుగుమ్మల మొగంబులఁ జూడనే కాని - మానసింపరు చందమామఁజూడ జవరాండ్ర మందహాసముల చెంతలఁగాని - నిలువరు పండువెన్నెలల బైట సకుల కెమ్మోవి పానకము గ్రోలనె కాని - కాంక్షసేయరు పానకములు గ్రోలఁ జెలువల కుచదుర్గములకుఁబ్రాకనె కాని - తలఁపరు కృతకభూధరములెక్కఁ | |
| గీ. | జెలుల నాభిసరస్సులఁజేరఁగాని యొల్లరు సరస్సులనుజేరి యోలలాడ మానినుల కమ్మయూర్పులె గాని సురఁటి గాలి రానీయ రధిపు లక్కాలమునను. | 284 |
| సీ. | దినముఁబ్రాతస్స్నాన మొనరించు ద్విజులకు - నగు కర్మలోప భయంబుకంటె బ్రాచి పనుల్ సేయ లేచు కోడండ్ర కౌ - నత్తలవలని భయంబుకంటె గడువులో దూర మేగఁగనున్న చరులకు - నధిపుచే నొదవు భయంబుకంటెఁ గర్షణం బొనరింపఁ గడఁగు కాపుల కార - యవిఁబైరు చెడునన్ భయంబుకంటెఁ | |
| ఆ.వె. | గడిదియయ్యె సీతు ఖగమృగ పశువర ప్రముఖ జంతువులకు భావములను జాలమించె మిథున సంపర్క సౌఖ్యంబు శిశిర మహిమ వినుతి సేయవశమె? | 285 |
| కం. | కాచె నుసిరికలు తఱుచుగఁ బూచెన్ జేమంతి విరులు భూమికి బరువై తోఁచెఁ జణకాది సస్యము లేచెన్ బలుమంచు చదల హేమంతమునన్. | 286 |
| తే.గీ. | ఎల్ల జనములఁ దలచూప నీకు వెలయు నల్ల హేమంత ఋతురాజ యశము దిశల నావరించెనో యనఁగ మంచుగ్గలించె రోదసి నతంద్ర చంద్రికా రుచిరరుచుల. | 287 |
| ఆ.వె. | కొండలెల్ల మంచుఁగొండలై కనిపించె నడవులెల్లఁబూచినటుల మించె దీవులెల్లఁ దెల్లదీవులై రహిఁగాంచె మాపురేపు మించు మంచువలన. | 288 |
| శా. | ప్రాతర్వేళల మంచు చిన్కు గుమి జొంపంబైన లేఁబచ్చికల్ శ్వేతశ్రీఁదులకించు టెంతయు రహించెన్ సర్వభూతంబులున్ శీతశ్రాంతి వడంకఁదా నచలయై చెల్వొందు భూదేవికిన్ శీతర్తుప్రభుఁ డిచ్చు వజ్రముల రాశింబోవి నల్వంకలన్. | 289 |
| వ. | తత్కాలంబునన్ | 290 |
| చం. | వలపులు గ్రమ్మఁగా బొగిచి వండిన కారపుఁగాయగూరల ప్పళములు దియ్యచే రొలుపుఁబప్పు రసావళు వింపుటోగిరం బు లపుడు గాఁచి తెచ్చు ఘృతముం బలుమాంసము లర్కపుత్రము ఖ్యులు రఘురాము బంతిఁబ్రియమొప్ప భుజించి సుఖించిరెంతయున్. | 291 |