| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | శ్రీరాముడు వానర రాక్షసులకు వీడ్కొల్పుట |
| ఉ. | అయ్యెడ నొక్కనాఁ డినకులాగ్రణి భానుజుఁజూచి నెమ్మదిన్ నెయ్యముఁజేర్చి నా కొఱ కనేకవిపద్దశ లోర్చి చేయు సా హాయ్యము చేత నే విజయమందితి, సన్నుతులేల? పెక్కు నా ళ్లయ్యెను నీవు వచ్చి యనఘా! యిఁక నూరికిఁబోయిరాఁగదే! | 292 |
| సీ. | అంగదు నసురోచ్చయాంగదు నలరింపు - హనుమంతు గుణవంతు నాదరింపు జాంబవంతుఁబరాద్రి శంబవంతు భరింపు - నలు మహోజిత దవానాలుఁదలంపు నీలు సేనావనాభీలుఁబాలన సేయు - శతబలి నతబలి సవదరింపు తారుఁగీర్తి నిరస్తతారుఁ గటాక్షింపు - శరభు నాసురసింహశరభుఁబ్రోవు | |
| గీ. | గజ గవయ గంధమాదన గ్రథన కుముద పనస ధూమ్ర సుషేణాది బలిముఖేంద్రు లిందఱు మదర్థముగ మేను విచ్చినారు వీరినెల్లను రక్షింపు వీరవర్య! | 293 |
| కం. | నిష్కంటకమై తనరెడి కిష్కింధకుఁబోయి యింకఁగేవలకరుణా విష్కృతమతివై వాసవి దుష్కార్యము లెంచ కంగదునిఁ బ్రోవఁదగున్. | 294 |
| కం. | అని పౌనఃపున్యముగా నినకులపతి వాలిసుతుని నేలెడు పని య య్యినజునకుఁదెల్పి యుపగూ హన మొనరిచి యెల్ల కపుల నలరించి కృపన్. | 295 |
| తే.గీ. | ఆ విభీషణుఁజూచి మహాత్మ! నీవు పుట్టినప్పుడె వెన్నతోఁబెట్టెఁ దల్లి వినయధర్మ వివేకముల్ వేఱ యేల బోధ లైనను వినుము నా బుద్ధి యొకటి. | 296 |
| చం. | కొలిచెడివారు రాక్షసులు క్రూరము మానవమొక్కవైఖరిన్ నిలువదు కాలపద్ధతి ననేకవికారము లొందు నెందునం దలఁకక యన్నపై నెనరు ధర్మముపైఁ బ్రియముంచి లంకని శ్చలగతిఁబ్రోవు ధార్మికుఁడు శాశ్వతుఁడై వెలయున్ విభీషణా! | 297 |
| కం. | మఱవకు నీతి వినీతులు మఱవకు మామీఁది ప్రేమ మన కపివరులన్ మఱవకు నీ తలిదండ్రుల మఱవకు మని రఘుకులాబ్ధిమణి తెల్పుటయున్. | 298 |
| కం. | ఆ రఘుపతి వచనామృత ధారలఁ బరితుష్టిఁ జెంది తరుచరరక్షో వీరు విటు లనుచుఁ బొగడిరి సారెకు బహువార్ధ లొక్కసరి మ్రోయురహిన్. | 299 |
| సీ. | శతబృహస్పతులైన సవతుగా రొకబృహ - స్పతి యీ మనీషకు సాటియగునె? వేమంది యజులైన నేమాత్రమోకాక - యొక యజుండీ సూక్తి కుపమయగునె? లక్ష శేషాహి వల్లభులైన నేమొకా - కొక శేషుఁడీ బల్మి కుద్దియగునె? కోటి మన్మథులైన దీటుగారొక మన్మ - థుండు నీ చెలువుకుఁ దుల్యుఁడగునె? | |
| గీ. | తలఁప శతకోటి మేరుభూధరములైనఁ బోల్పఁదగుఁగాక యొక మేరు భూధరంబు పోల్ప నీ ధైర్యలక్ష్మికిఁ బోల్కి యగునె? రవికులాంబుధిచంద్ర! శ్రీరామచంద్ర! | 300 |
| సీ. | ఎన్ని దోషములున్న నెంచక యించుక - గుణమున్న మెచ్చి చేకొందు వనుచుఁ బాటించి పలికిన పలుకు బ్రహ్మవరంబు - గాఁ బ్రతిష్ఠకుఁ దెచ్చు ఘనుఁడవనుచు హీనుఁడైన సమాశ్రయించినఁ దమ్మునిఁ - జూచిన చందానఁ జూతువనుచుఁ గొలిచినవారిని గూర్మి నాచంద్రార్క - ముగ సౌఖ్యములొసంగి ప్రోతు వనుచుఁ | |
| ఆ.వె. | బరులు స్వజను లనక ప్రజల నందఱఁ గన్న ప్రజలలీలఁ బ్రోచు ప్రభుఁడ వనుచు నీ గుణంబులెంచు నిఖిలలోకంబులు రమ్యగుణ సముద్ర! రామభద్ర! | 301 |
| చం. | అని కొనియాడుచున్న సమయంబున మారుతసూతి స్వామికిన్ వినతు లొనర్చి పల్కె రఘువీర! భవత్పదపంకజంబులన్ ఘనతరభక్తి యెల్లపుడుఁ గల్గఁగ మీ కథ యెంత కాలము ర్వినిఁదగు నంతకాలము శరీరము నిల్వ వరంబొసంగవే! | 302 |
| ఉ. | నీ కథ లెప్పుడున్ వినుచు నీ పదచింతన మాచరించుచున్ నీ కరుణావలోకములు నీ మృదుభాషలు నీ విలాసముల్ నీ కవితప్రభావములు నెమ్మది నెంచుచునున్నఁగాక యే లా కపిమూర్తిఁజేకొని యీలాస్థలిఁజెంద వృథాయురున్నతుల్. | 303 |
| కం. | శ్రీరామ! నీ కథామృత ధారలు కర్ణాంజలులను ద్రావెడి ధన్యుల్ కోరుదురే యమరత్వము ? తాఱుదురే జన్మమరణ దారుణ రుజలన్? | 304 |
| సీ. | కౌసలేయ! త్వదీయకథ లూఁకొనని వాస - రంబు కల్మషధూసరంబు గాదె? తాటకాంతక! నిన్ను ధ్యానంబు సేయని - క్షణము నివారితక్షణము గాదె? జానకీరమణ! నీ స్మరణం బొనర్పని - ఘటిక విషాపూర్ణ ఘటిక గాదె? సాకేతనిలయ! యుష్మత్పూజ సలుపని - జాము మృత్యువు నిల్చుగీము గాదె? | |
| గీ. | శ్రీరఘూత్తమ! నిన్ను దర్శింప కురక కడచు కాలంబు గాలంబు కరణి గాదె ? రామ! యటుగాన నిన్ననారతము వినుట తలఁచు టస్మాదృశుల కుచితంబుగాదె? | 305 |
| ఉ. | నా విని సంతసించి రఘునాథుఁడు గదియ డిగ్గి గ్రక్కునం బావనిఁ జేతులం గదియఁబట్టి కవుంగిటనుంచి పల్కె న న్నీ విపు డిచ్ఛయించినవి యిచ్చితి భూమి కలంతకాలముం దావకకీర్తియున్నిలుచుఁ దండ్రి! చరింపు చిరయురున్నతిన్. | 306 |
| ఉ. | ఆపదఁ బాపి ప్రాపయియన్నకుఁ బ్రత్యుపకార మూనఁగాఁ గాపురుషుండు గోరుఁ, బ్రతికారము సేయఁదలంపఁ డార్యుఁ, డ య్యాపద రాఁదలంచినటులౌనని, ధన్యుఁడవైన నీకు లే వాపద, లేఁ బ్రతిక్రియ యొకప్పుడుఁ జేయఁదలంపఁ బావనీ! | 307 |
| మ. | నినుఁ బూజించునతండు నా హితుఁడగున్ నీలోన నేనెప్పుడున్ గనిపింతున్ వినిపింతు రచ్చరలు వేడ్కన్ దృత్కథల్ ఖ్యాతితో మనుమంచున్ హనుమంతుఁబల్కి రఘురామస్వామి స్వగ్రీవఁ బా యని వైదూర్యపుఁదాళిఁగైకొని తదీయగ్రీవ నుంచెం గృపన్. | 308 |
| కం. | ఆ హారము లోకైక మ నోహరముఁబూనుకొని హనుమ దగె నుడుసం దోహవృతా మృతాహా రాహార్యమొ యనుచుఁజూప ఱగ్గింపంగన్. | 309 |
| చం. | ఇటువలె రాముఁడాశ్రితులనెల్లఁ గ్రమంబున బుజ్జగించుచున్ బటమణిభూషణావళు లపారముగా దయచేసి వెండియున్ భట సహితంబుగా ననుప భానుకుమార విభీషణాదులే మెటువలెఁబాసిపోదు మవనీశ్వర! యంచును ముక్తకంఠులై | 310 |
| చం. | వలవలఁగన్నులం దొరఁగు బాష్పకణంబులతో రఘూత్తముం బలుమఱుఁ జూచుచున్ నిలిచి పంచితివే రఘురామచంద్ర! మా స్థలములకంచు మూఢుల విధంబున నేడ్చుచుఁ బోలు రెంతయున్ గళవళపాటుతోఁ, గరుణగల్గినరాజును బాయఁగూడునే? | 311 |
| ఉ. | భానుకులీనుఁడీ కరణి భానుజముఖ్యుల వీడుకొల్పి త న్మానితశౌర్యధైర్యములు మాటికి నెంచుచు నార్యబంధు మి త్రానుజమంత్రియుక్తి నపరాహ్గముదాఁక సభాంతరంబునం దాను వసించియుండెను జనస్తవనీయ కళాభిరాముఁడై | 312 |