ఇతిహాసములు ఉత్తరరామాయణము శ్రీరామచంద్రుఁడు మునుల నెదుర్కొని సత్కరించుట
శ్రీరామచంద్రుఁడు మునుల నెదుర్కొని సత్కరించుట
ఉ.బంగరుకొండనుండి దిగు బాలదివాకరు లీల రాముఁ డు
త్తుంగమణీమయాసనముఁ దోరపు వేడుక డిగ్గి యంగ ము
ప్పొంగ మహర్షులం గదియఁ బోయి నమస్కృతు లాచరించి భ
క్తిం గరముల్‌ మొగిడ్చి తొడితెచ్చి సభాంతర రత్నవేదికన్‌
90
చం.కుశమృగ చర్మ సంకలిత కోమల కాంచనరత్న పీఠులం
గుశికసుతాత్రి కణ్వ భృగు కుంభజ ముఖ్యుల నుంచి పూజనా
తిశయవిశేష గౌరవ విధేయగుణంబుల నింపొనర్చుచున్‌
దశరథనందనుం డను నదభ్రనవాభ్ర నదభ్ర మార్భటిన్‌
91
మ.కుశలంబే మునులార! శిష్యులకు మీకున్‌, శిష్యసంఘం బహ
ర్నిశమున్‌ సేవలు సేయునే తపములున్‌ నిర్విఘ్నతన్‌ సాగునే
కుశపర్ణాంబుఫలాదు లబ్బునె వనక్షోణిన్‌ మిముం జేరి దు
ర్దశ లెవ్వారును జేయకుందురు గదా తథ్యంబుగాఁ దెల్పరే
92
మ.భవదాశీర్మధువైభవంబునఁ గదా ప్రాప్తించు మాదృగ్భుజా
భవదావంబు యశః ప్రతాపసుమశుంభత్పల్లవంబుల్‌ మహా
భవదాహంబు శమించు మీ పదజల ప్రాశంబునం బద్మభూ
భవదామోదరు లైన మీ రలిగినన్‌ భాషింపఁగా శక్తులే
93
సీ.ఊరుభాగమున భూభార మిమ్ముని దాల్చె - బ్రహ్మయష్టినె యత్తపస్వి పూనె
నల త్రిమూర్తులఁ బుత్త్రకులుగ నియ్యతి గాంచె - నలిగి వారల నమ్మహర్షి తన్నె
భువనసృష్టికి మాఱు పుట్టించె నిమ్మౌని - పూని యాయనమ్రింగె భువనరాశిఁ
దన యోగమహిమ నిత్తపసి క్రోధుజయించె - నడుఁగ కుగ్రత నుగ్రు నతఁడు గెలిచె
 
గీ.యోగమహింబులను మెచ్చ రొకరి నొకరు
యోగమన్నను నవ్వుచు నుందురెపుడు
వింటి మీ చర్య లెద మెచ్చుకొంటి నిత్య
హర్షులను మిమ్ముఁ గంటి మహర్షులార!
94
వ.అని యదంభగంభీరవచోనిగుంభనం బొగడు నక్కుంభినీసుతాధీశ్వరునితోఁ గుంభసంభ వాదులిట్లనిరి.95
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju