| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | అగస్త్యాది మహర్షులు శ్రీరామునిఁ గీర్తించుట |
| ఉ. | లోకము నీ దృగంచల విలోకమునన్ రహిఁజెందె భాస్కరా లోకమునం బయోజని వెలుంగు రహిన్ సుజనావనైకలీ లాకుశల ప్రభావము సెలంగ జగం బిటు లీవు ప్రోవఁగా మా కుశలంబు వేఱ యొక మాటడుగన్ వలెనా రఘూత్తమా! | 96 |
| శా. | శీలక్ష్మాధరవజ్రి తాపసజనశ్రేణీతపస్యానిల వ్యాళస్వామి పరాంగనారతిలతావాలంబు ధర్మాంబురు ట్కాలాంభోదము రావణుం డరిగె నీ కాండాగ్ని చే మా తపం బేలా గొందెడు విఘ్న మేఁచు ఖలుఁ డిం కెవ్వాఁడు సీతాధిపా! | 97 |
| తే.గీ. | అనిమిషుల గుండెలో గాల మఖిలలోక నేత్రమున నాటి వేధించు నెరసు గాలి కాలి ముల్లు కుభృత్పాళి పాలి పిడుగు రావణుఁడు డిందె భువనముల్ రక్తిఁ జెందె | 98 |
| సీ. | ముసుఁ గేసికొని మూలమూల దాఁగిన దిశా - ధిపుల కిప్పుడు బయల్ దేఱఁ గలిగె గులుకు లొందక కొండగుహల ద్రిమ్మరు వేల్పుఁ - జెలుల కిప్పుడు చెల్వుసేయఁ గలిగె జపతపంబులు మాని జడవృత్తి దిరుగు మౌ - నులకు నిప్పుడు నిష్ఠ సలుపఁ గలిగె ననదలై గతిమాలి చనిన భేచరుల కి - ప్పుడు విమానము లెక్కి పోవఁ గలిగెఁ | |
| గీ. | బడగ లెత్తక పడుకులఁ బట్టి యడఁగి యున్న ఫణిజాతి కిప్పుడు వన్నె గలిగె దశరథకుమార తిలక! నీ ధర్మమునను దనుజవిభు ద్రుంచి భయము మాన్పినకతమున | 99 |
| సీ. | మునుల పాలిటివాఁడ వనుట కాదిని నీవు - సవరించు యజ్ఞరక్షణమె సాక్షి యతిపావనుఁడ వౌట కల యహల్యాదోష - రాశిఁ ద్రోచిన పాదరజమె సాక్షి భువనాధికుఁడవౌట కవిరతోద్ధతిశూలి - విలు దళించిన బాహు బలమె సాక్షి యఘటనప్రఘటనోద్యముఁడ వౌటకు ఱాలు - నీటిపైఁ దేలించు నేర్పె సాక్షి | |
| గీ. | యఖిల జీవేశ్వరుఁ డవైన యందులకును వనచరులచేతఁ దగు పనుల్ గొనుటె సాక్షి యిట్టి నీ కేము దీవింప నీ ప్రతాప మీ యశముఁ గల్గెనను మాటకేమి సాక్షి? | 100 |
| కం. | ఐన నిజాశ్రిత పక్షము చేనానతి యిచ్చితిరి విశిష్టుల మనుచున్ మీ నామము జపియింపం గానె కద! ప్రతిష్ఠ మాకుఁ గలిగె జగములన్ | 101 |
| సీ. | ఖలశిక్ష సాధురక్షయు నొనర్పనెకదా - గురునాజ్ఞ వని నీవు దిరుగు టెల్లఁ బగతు ఖండింప నెపంబు గల్గనెకదా - సతినొంటి యిడి వేఁట సనుటయెల్లఁ గాందిశీకులఁ బ్రోచు కరుణఁ జూపనెకదా - భానునందనునిఁ జేపట్టు టెల్ల నేకాంత భక్తుఁడౌ టెఱిఁగి యేలనెకదా - హనుమచే నుంగరం బనుపు టెల్ల | |
| గీ. | గణన సేయక దశకంఠుఁ దృణముగాఁ ద లంచియె కదా విభీషణు లంక కబ్ధి కట్టకయ మున్నె పట్టంబు గట్టుటెల్ల రవిసహస్రమహస్సాంద్ర! రామచంద్ర! | 102 |
| సీ. | కులకర్త నింతి మీ గురునంపి మాన్పు నా - యకు భంగమని గంగ యమున కనియెఁ దనతోడఁబుట్టు వింద్రుని కగ్గమాయెఁ గా - యని గౌరి పతి మొగం బట్టె చూచె మామ నీగతిఁ గలంపఁగ నాయమే యంచుఁ - బరవాసుదేవుతోఁ బద్మ వలికెఁ దిరుగ నబ్ధులతోడఁ ద్రిభువనంబు లొనర్ప - వలయునో యని వాణి వరుని నడిగెఁ | |
| గీ. | దన హయంబుల కెల్ల జీవనము లిచ్చు నప్ప్రభుఁడు నొచ్చెనో యంచు నడలె వజ్రి బాడబజ్వాల లట్లు నీ పటుశరములు వార్ధి నింకించు నప్పు డిక్ష్వాకుతిలక! | 103 |
| చం. | కరమున నీవు విల్లుగొని కాండముఁ బూనిన మూఁడులోకముల్ కరము భయంబు నొందుఁ గడఁకన్ నిను మార్కొన నెవ్వఁడోపు భీ కరముఖ నిర్గతానల శిఖాపరిదగ్ధ సుపర్వు రావణున్ దురమున బంధుయుక్తముగఁ ద్రుంపఁగ నీకె తగున్ రఘూద్వహా! | 104 |
| సీ. | అమితాస్త్రశస్త్రప్రహస్తుఁడైన ప్రహస్తుఁ - డురుమహోదరుఁ డమ్మహోదరుండు చండయుద్ధాకంపనుం డకంపనుఁడు దే - వాంతకుండైన దేవాంతకుండు కువచోనిగుంభుండు కుంభుం డుదితశత్రు - దానికుంభుండు నాఁ దగు నికుంభుఁ డహితవిరూపాక్షుఁ డగు విరూపాక్షుండు - యతియజ్ఞ కోపుఁడౌ యజ్ఞకోపుఁ | |
| గీ. | డాదిగాఁ గల దైతేయు లడఁగి రుగ్ర సంగరంబున నీ యోధసమితిఁ దొడరి కడఁక నతికాయుఁడగు నతికాయుఁ డీల్గె నీ సహోదరుచేత సీతాసమేత! | 105 |
| మ. | ప్రళయాబ్ద ప్రతిమాప్రమాణ తను శుంభత్కుంభకర్ణాద్రి నీ కులిశాత్యుగ్ర నిశాతబాణహతులం గూలెన్ దశగ్రీవదో ర్బలమైనన్ సహియింపవచ్చు సహియింపం గూడునే యింద్రజి ద్బల మవ్వీరుఁడు సచ్చె నీకు హిత మాపాదించు సౌమిత్రిచేన్ | 106 |
| మ. | సురకన్యాకబరీ పరిగ్రహణజాశుభ్రాపకీర్తిచ్ఛటా భర సంసూచకవర్ణు రావణసుతున్ భంజించు టింద్రాది భీ కర పౌలస్త్యముఖాసురప్రవరులన్ ఖండించు కార్యంబుతో సరియౌ నందునఁ గాదె నిర్భయత మించం గల్గె జేజేలకున్ | 107 |
| కం. | జేజేయని జగ మెంచఁగ జేజేలకు నభయ మొసఁగి చెలఁగితివి బళీ యాజేయ వీరదైతే యాజేయజయాప్తి నలరుమని యగ్గింపన్ | 108 |
| కం. | ఆ రాముఁడు బుధవిహగ చ యారాముఁడు వెఱఁగు సెంది యంజలియుతుఁడై వారలఁ గని గగనధునీ వారలఘు ఘుమంఘుమారవంబునఁ బలికెన్ | 109 |
| సీ. | ఘటకర్ణ కంపనాకంపనాదుల మాని - యింద్రజిత్తు ప్రతాప మెంచనేల? ధూమ్రాక్ష యూపాక్షదుర్ముఖాదుల మాని - యింద్రజిత్తు ప్రతాప మెంచనేల? యతికాయవికట ప్రహస్తాదులను మాని - యింద్రజిత్తు ప్రతాప మెంచనేల? త్రిశిరోనరాంతక త్రిదశాంతకుల మాని - యింద్రజిత్తు ప్రతాప మెంచనేల? | |
| గీ. | వారికంటెను వీఁడంత వీరుఁడైన కారణం బేమి జన్మ ప్రకార మెట్టు లెవ్వరి వరంబుచే నిర్జరేంద్రు గెలిచె నెటులు దనదండ్రికంటెఁ దా నెక్కుడయ్యె? | 110 |