ఇతిహాసములు ఉత్తరరామాయణము ఇంద్రాదులు విష్ణుని యొద్దకుఁ బోవుట
ఇంద్రాదులు విష్ణుని యొద్దకుఁ బోవుట
శా.ఆ కైలాసనివాసు వీడుకొని కార్యైకాతురత్వంబునన్‌
బాకార్యాదులు వోయి బాడబశిఖిప్రజ్వాలికా సంగతిన్‌
బైకిన్‌ బొంగుచు ఫేనమాలికలతో బల్‌ మ్రోఁతయున్‌ గన్న క్షీ
రాకూపారముఁ జేరి తజ్జలధిమధ్యద్వీపదేశంబునన్‌
264
సీ.కడలిరాయఁడు మిన్నగల మిన్నగమి డాఁప - ఘటియించు బంగారు కణఁజ మనఁగ
జలధిమధ్యమునందు జనియించిన సహస్ర - పత్త్ర శోభిత హైమపద్మ మనఁగఁ
దెలిదీవి పుడమిముద్దులగుమ్మ నిజవల - గ్నమునఁ బూను సువర్ణఘంట యనఁగఁ
బాథోధిసుత వీడు పట్టు చొక్కపు గుడా - రంపుహొంబట్టు సరాతి యనఁగ
 
తే.గీ.నలువు మీఱిన వైకుంఠనగరి పసిఁడి
కోటఁ బొడగాంచి మ్రొక్కుచు గోపురంబు
దఱియఁ జొచ్చి మహోన్నత గరుడకేతు
రాజినలరారు హరి హజారంబుఁ జేరి
265
చం.తెలిమగఱాతికంబములఁ దీఱిన బంగరు కీలుబొమ్మగుం
పులకు మెఱుంగుఁ గొప్పు సొలపుల్‌ మొలపించెడు కప్పురాలలో
పలఁ గల కల్వ చప్పరపు వన్నెలఁ జెన్నగు నొక్క మేడలో
నలరుచు నేకతంబ కొలువైన హరిన్‌ విని రాదిశాధిపుల్‌
266
కం.విని సమయ మౌనొ కాదో
యని యించుక నిలిచి యచటి యవసరపుఁ జెలిం
గని స్వామికి మా యాగతి
వినిపింపం దగు నటంచు వేఁడిన నదియున్‌
267
సీ.తిలకంబు దిద్ది దిద్దితిఁ జూడుఁ డను రమా - సుదతి చెక్కుల నీడఁ జూచువాని
మొనపంటి మడుపు వేఁడిన నీళ యొసఁగ నం - దుచుఁ జుఱుక్కన మోవి నొక్కువానిఁ
దన చిన్నెలకును జక్కని మొగం బటుపెట్టు - కొనిన భూసతి వేఁడుకొనెడువాని
వారి యింతులకు మున్‌ వాదు తానె ఘటించి - నలిరేఁగి పోరాడ నవ్వువాని
 
గీ.నిచ్చఁ బరిపూర్ణకాముఁడై హెచ్చువాని
నచ్యుతునిఁ గాంచి మ్రొక్కి యింద్రాదిసురలు
దేవ! యరుదెంచినారంచుఁ దెలిపినంత
శీఘ్రమునఁ దోడి తెమ్మని సెలవొసంగె
268
కం.ఆ విశ్వంభరు ననుమతి
దౌవారికు లెఱిఁగి పనుపఁ దద్పరమతులై
దేవతలు సన్నిధికిఁ జని
సేవించిరి శుక్ర శిష్య జిష్ణున్‌ విష్ణున్‌
269
వ.ఈ చందంబున శంఖ చక్రగదాశార్‌ఙ్గ నందక ధరుండును భక్తజనా నందకరుండునునగు నద్దయాకరునకు నభివందనంబు లొనర్చి బృందారకు లిట్లని యభినందించిరి.270
ఉ.దానవవీరవైరి యవధారు సుకేశతనూభవుల్‌ మహో
గ్రానలదీప్తవిగ్రహు లుదగ్రులు మువ్వురుఁ గూడి లోకసం
తానము గాసి చేసెదరు తద్వ్యథ లోరువ లేక మిక్కిలిన్‌
దీనతఁ జెంది యిందరుగుదెంచితి మాపదఁ బాపవే కృపన్‌
271
సీ.ఖపుర భేదియు నంథకచ్ఛేది యనమించు - హరుభుజావైభవం బనఁగ నెంత?
దరముతో జడవృత్తిఁ దాల్చు నరూపుఁ డౌ - శార్‌ఙ్గకోదండుని సత్త్వమెంత?
చోరుచే నపహృత శ్రుతియై యజాఖ్య కా - స్పదమైన వేల్పు రాజస మదెంత?
పాకాపహృతియు జంభవిఘాత మొనరించి - యలరు వృద్ధశ్రవు బలిమి యెంత?
 
గీ.యితర సుమనోగణముల యహీన సమర
కర్కశత్వ మదెంతని గణుతి సేయ
రసురముఖ్యులు దామె బ్రహ్మాదిదేవ
వరుల నందఱ మించిన వారమనుచు
272
సీ.తగ ధనుర్గుణ మీవు తెగ నిండఁ దీసిన - దివిజారివరుల కాయువులు నిండు
బలురయంబున నీవు బాణముల్‌ వఱపిన - విమత సైనికుల ప్రాణములు వఱచుఁ
గడిమివై నీవు చక్రముఁ గేల నంటిన - రాక్షసగుప్త చక్రము గలంగు
నలిరేఁగి పాంచజన్యము నీవు పూరింప - నహిత జన్యములు జన్యములు మాను
 
తే.గీ.గరుడవాహన మెక్కి లోకములు పొగడ
నందకముఁ బూని కలనికి నడచితేనిఁ
గొంచ కెవ్వాఁడు నిన్నెదిరించువాఁడు
తామసము సేయనేల? రావే! ముకుంద!
273
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju