ఇతిహాసములు ఉత్తరరామాయణము విష్ణువు ఇంద్రాదులకు నభయం బొసగుట
విష్ణువు ఇంద్రాదులకు నభయం బొసగుట
వ.అని యాపన్నులయి విన్నవించిన వేల్పుమన్నెదొరలయెడన్‌ బ్రసన్నుం డయి వెన్నుం డిట్లని యానతిచ్చె274
చం.ఎఱుఁగుదు మున్‌ సుకేశుఁడు మహేశుకృపన్‌ విభవాభిరాముఁడౌ
టెఱుఁగుదు వాని పుత్త్రకు లహీనవరంబులు బ్రహ్మ యీయఁగా
మెఱసి జగత్త్రయంబునకు మీకును బాధకు లౌట సర్వ మే
నెఱుఁగుదు వేల్పులార! వెత నింకకుఁ డింక జయింతు వారలన్‌
275
శా.పూర్వాదిత్యమహావిలాసము లయంబుం జెంద నస్మద్ధను
ర్మౌర్వీటంకృతి గర్జ హెచ్చ సుమనోమ్లానిత్వముల్‌ మాన మ
ద్దుర్వారాశుగవృష్టి మించి యిఁకఁ దద్దుష్టోద్యమగ్రీష్మ త
ప్తోర్వీతాపముఁ బాపు నేఁగుఁడన వారుత్సాహముం బొందుచున్‌
276
తే.గీ.ఇందిరానాథ వదనారవిందగళద
మందమధురవచోమకరందబిందు
బృందతుందిల సుమనోమిళిందులై పు
రందరాదులు సెందిరి మందిరముల
277
కం.అని కుంభజుఁ డెఱిఁగించిన
విని రాఘవుఁ డవల నెట్టి వృత్తి మెలఁగి ర
ద్దనుజులు హరి వారలతో
నని యెటువలెఁ జేసెఁ దెల్పుఁడని యడుగుటయున్‌
278
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju