| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | దశగ్రీవుఁడు దండువిడియుటను యక్షులు ధనదునితో విన్నవించుట |
| తే.గీ. | అవధరింపుము కుంభసంభవమహర్షి చంద్రుఁ డిట్లను శ్రీరామచంద్రుఁ జూచి జానకీనాథ! యిటు లద్దశాననుండు విత్తవిభువీటిపై దండువిడిసినపుడు | 2 |
| మ. | భటకోలాహలముల్ మహారథికశుంభచ్ఛంఖఘోషంబు లు ద్భటదంతావళబృంహితంబులు హయప్రత్యగ్రహేషార్భటుల్ పటహాద్యద్భుతవాద్యభేదరవముల్ బ్రహ్మాండభాండచ్ఛిదా పటిమన్ మించె, విరోధిరాడ్యువతి గర్భభ్రూణముల్ భేదిలన్ | 3 |
| వ. | అప్పు డప్పర్వతప్రదేశంబున నుక్కళంబున్న యక్షకిన్నరు లన్నరవాహనునకిది విన్నవింపకయ మించి మన మొక్కించుక శరపరంపరల ముంచిన మాటవచ్చునని కొంచి కొందఱందుఁదరలక కొంద ఱలకాపురంబున కరుగుదెంచి యుదంచితప్రాభవంబు మెండుకొన నిండుకొలువున్న కిన్నరేశ్వరునిం బొడగని. | 4 |
| కం. | వందనములు సేసి పరా కిందుకళామౌళిమిత్ర! యిదె నేఁడు చమూ బృందముతో దశవదనుఁడు నందాతీరమున విడిసినాఁడని తెలుపన్ | 5 |
| తే.గీ. | ఆ కుబేరుఁడు నవ్వి “బళా! మఱేమి దశముఖుఁడు మంచిపనిసేయఁ దలచె హితవు దలఁచినన్ మఱి ముక్కుకోఁతలను మాట నేఁడు నిజమయ్యె నిఁక నేల నెనరుదలఁప! | 6 |
| ఆ.వె. | మొగముఁబొడువలేని ముంగోప మిఁక నెప్పు డలకఁజొచ్చెనేనిఁ జులుకనగుదు మటులు చేయ నీయకాఁగి భండన మాచ రింపుఁ డనుచు వారిఁబంపుటయును | 7 |