| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | యక్షరాక్షసుల యుద్ధము |
| ఉ. | యక్షవరాజ్ఞ మౌళినిడి యక్షులు నక్షుల నిప్పులుర్ల హ ర్యక్షములో యనన్ గహకహార్భటు లభ్రము నిండఁ జేయుచున్ రాక్షస సేనఁ దాఁకి రల రాక్షసులున్ నలిరేఁగి మార్కొనం ద్య్రక్షధరాధరం బదరె నంబుజపత్త్రగతిం దదుద్ధతిన్ | 8 |
| మ. | అసిఘర్షోదిత విస్ఫులింగమయమై యస్త్రానలాభీలకీ లసముజ్జృంభితమై గదాముసల శూలప్రాస సంప్రేరణా వసరాన్యోన్యకృతాభినందన వచోవ్యాపారమై యక్షరా క్షససంగ్రామము సూచు ఖేచరులకుం గల్పించె దృక్పర్వమున్ | 9 |
| శా. | దోరుత్తుంగతరంగముల్ నిగుడఁ దద్ఘోరాసిమీనప్రభల్ మీఱన్, సైనికచంద్రు లుబ్బొసఁగ గాంభీర్యం బవార్యంబుగా భేరీభాంకృతరావ మొప్పఁ గరిభూభృత్కోటి మీఁటొందఁగాఁ బోరాడెన్ వడి యక్షరాక్షసబలాంభోరాశులొండొంటితోన్ | 10 |
| వ. | అప్పుడు | 11 |
| ఉ. | కూలెడు నేనుఁగుల్ దెరలు గుఱ్ఱములున్ వడిఁ ద్రెళ్ళుతేరులున్ వ్రాలెడి టెక్కెముల్ దునిసి వమ్మగు ఛత్రము, లాడునట్టలుం దూలెడి రూపులుం దొరఁగు తోరపు నెత్తురుటేఱు లందుపైఁ దేలెడు పీనుఁగుల్ గలిగె ధీరతఁ బోరెడు రెండు సేనలన్ | 12 |
| ఉ. | రాక్షససేన ముందటఁ దిరంబుగ నిల్చి రణం బొనర్చున య్యక్షులఁజూచి, పంక్తిముఖుఁ డక్షముఁడై నిజసైన్య రక్షణా ధ్యక్షుల మార్కొనం బనిచి తానును నిర్వదిచేతులన్ గదా సిక్షురికాది సాధన విశేష విజృంభముఁ గానుపించినన్ | 13 |
| చం. | చెదరక యక్షులున్ దనుజశేఖరు బిట్టెదిరించి భీకర ప్రదరపరంపరల్ గురిసి పైపయి నైకవిధాయుధచ్ఛటల్ గుదిగొననించి బీరమునఁ గోయని యార్చినచో మహోదరుం డుదురున నొక్క ఘోరగదయూని కృతాంతుని లీల నుగ్రుఁడై | 14 |
| కం. | వాయువు బలువడిఁగుజములఁ ద్రోయు తెఱంగున గదాహతులచే క్షితిపాల్ గా యక్షసేనఁగూల్చె బ ళీ! యని శుకసారణాదులెల్ల నుతింపన్ | 15 |
| కం. | శుకసారణధూమ్రాక్షా దికసేనాధీశు లొక్క దెస, దశకంఠుం డొక దెస, యక్షుల జమువీ టికి నతిథులఁజేసి రోహటింపక యధిపా! | 16 |
| ఆ.వె. | అపుడు పఱచు యక్షు లతిభీరులై పూరిఁ గఱచు యక్షు లొడలు మఱచు యక్షు లఱచు యక్షులై మహావాతధూతజీ మూతరీతిఁ జని రరాతు లలర | 17 |
| ఉ. | విచ్చిన నొచ్చినన్ వెఱచి వేఁడిన నోడినవారిఁ బోవనీ కచ్చెడుగుల్ దయారహితులై యలకాపురిదాఁకఁ గోటలోఁ జొచ్చినదాఁక వెంటఁబడి శూలములన్ బలితంపుటీఁటెలన్ గ్రుచ్చిరి, చొచ్చి వచ్చి రదిగోనని పౌరులు దల్లడిల్లఁగన్ | 18 |