| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | సంయోధకంటకుండను యక్షవరేణ్యుడు యుద్ధము చేసి పాఱిపోవుట |
| మ. | ప్రకటక్రోధమునన్ ధనాధిపతి పంపన్ వేగ సంయోధకం టకుఁడన్ యక్షవరేణ్యుఁ డొక్కఁ డపు డడ్డంబై పురద్వార ము త్సుకతం జొచ్చు నిశాటకోటిపయి శక్తుల్ దోమరంబుల్ శర ప్రకరంబుల్ గురియించి నిల్చెఁ దనశౌర్యం బందఱున్ మేలనన్ | 19 |
| శా. | ఆ రక్షోబల మాతనిం గడవ లే కాకంపముం జెందఁగా మారీచుండెదిరించి శాతశరసంపన్నత్వముం జూప న వ్వీరుండున్ గద యెత్తి వాని శిరమున్ వ్రేయన్ వెసం గూలె స త్ప్రారంభం బుడివోవ నేలఁబడు పుణ్యభ్రష్టు చందంబునన్ | 20 |
| ఉ. | కూలి, ముహూర్త మాత్రమునకుం దెలివింగని తాటకేయుఁడున్ వాలు మెఱుంగుఁదూపు లనివారణ యక్షుని మేనఁగ్రుచ్చి యా భీలతఁజూపినన్ సమరభీతి జనించి, యతండు దాళఁగాఁ జాలక వీఁగిపోయిన నిశాచరు లార్చిరి సంభ్రమంబునన్ | 21 |
| వ. | ఇవ్విధంబున సంయోధకంటకుం డాయోధనంబు విడిచి, యోధధర్మంబుఁదలకడచి పాఱిన, మీఱిన కౌతుకంబునం బదిమొగంబులఁ గుతుకంబగు మందస్మితంబుతో నలకమొకంబు దాఁటి మేటి కిరీటి పచ్చఱా జంతులం గనుపట్టుకోట వాకిటి రచ్చపట్టుకొట్టంబున నట్టనడి తెరువుంబట్టికొని నూర్మొనల పట్టెంబు బట్టు వేల్పుఁచలుపలం గట్టిన గోపురంబు డాసి, పాసిగల చిగురుఁదొగరులందెగడు పగడంపు దారబందంబు లురలంద్రోచి, మగఱాల బోరుతలుపులు వీడందన్ని, పదాఱువన్నె హొన్ను పనులు జూడం జూడ వేడుకయగు నగరిముందరి వైదూర్య తోరణస్తంభంబుకడ కస్తంభసరంభంబునం జొచ్చి వచ్చు నక్కుంభకర్ణాగ్రజుం గనుంగొని | 22 |