ఇతిహాసములు ఉత్తరరామాయణము మాణిభద్రుఁడు పోరి వ్రేటుపడి పార్శ్వమౌళియని పేరువడయుట
మాణిభద్రుఁడు పోరి వ్రేటుపడి పార్శ్వమౌళియని పేరువడయుట
కం.అల బలము లిటుల పఱిచిన
నలబలమెసఁగన్‌ దశాస్యుఁ డసురావళితో
నలకఁగలఁపంగనదిగని
పలికె ధనేశుండు మాణిభద్రునితోడన్‌
27
కం.నొచ్చిరి మన యక్షులు, పురిఁ
జొచ్చిరి రాక్షసులు, బాలిశుని దశముఖునిం
జెచ్చెరనెదిర్చి నీవా
రిచ్చనలర విక్రమింప నిది తఱి నీకున్‌
28
తే.గీ.అనిన సామి! హసాదని యమితసమర
దోహలంబున నతఁడు చతుస్సహస్ర
యక్షవీరులు దనతోడ నరుగుదేరఁ
గల్పకాలాంతకునిలీలఁ గదలి వచ్చె
29
ఉ.వచ్చిన మాణిభద్రుబడివచ్చిన సైనిక కోటి గోటలోఁ
జొచ్చినరాక్షతోత్తములు స్రుక్క, గదల్‌గొని మోఁది, తూపులన్‌
గ్రుచ్చి, కటారులన్‌ నఱికి కుంతములంబడ గ్రుమ్మి, యార్చినన్‌
విచ్చిరి నొచ్చి రప్పురము వెల్వడి రుక్కులు దక్కి రక్కసుల్‌
30
వ.ఇవ్విధంబున31
ఉ.నాలుగువేల యక్షులును నల్గడఁ గొల్వఁగ మాణిభద్రుఁ డ
వ్వేళ దశాస్యుసైన్యముల వెన్కొని నొంపఁగఁ దద్వరూథినీ
పాలకుఁడా ప్రహస్తుఁ డురుబాహుబలంబున యక్షవాహినీ
పాలుని బిట్టెదిర్చె మును పాఱెడు సేనల కుబ్బొనర్చుచున్‌
32
కం.దళకర్తలిరువు రిటువలెఁ
దలపడి పోరాడ రెండు దళములఁగల యో
ధులు నుద్భటులగు భటులును
గలయంబడి పోరి రుత్సుకత వెలయంగన్‌
33
శా.కైలాసాద్రిగుహల్‌ ప్రతిధ్వను లొసంగన్‌ దివ్యనందాలకా
కూలక్ష్మారుహపాళి మూలములతోఁ గూలన్‌ భుజాస్ఫాలనో
ద్వేలధ్వానము లంఘ్రిఘట్టనము లెంతేమీఱఁగా బోరి ర
ప్పౌలస్త్యద్వయ సైనిక ప్రవరు లభ్యామర్దబద్ధస్పృహన్‌
34
వ.తత్సమయంబున35
చం.కరము చలంబు మీఱి దశకంఠుని మంత్రి ప్రహస్తుఁ డుగ్రుఁడై
కరముసలంబునం గెడపె గ్రక్కున వేవురు యక్షులన్‌ మహో
దరుఁడు మహోదరుండయి గదాహతి వేవురనొంచెఁ దాటకా
వరతనయుండు ద్రుంచెఁ గరవాలమునన్‌ ద్విసహస్రయక్షులన్‌
36
వ.ఇప్పరుసున నిజపార్శ్వచరులయిన చతుస్సహస్ర యక్షప్రవరులం బరిమార్చి పేర్చిన ప్రహస్తాదులం గనుంగొని, నిర్ణిద్రరౌద్రంబున మాణిభద్రుండు వానిపై నురవడించిన37
శా.ధూమ్రాక్షుం డెడ సొచ్చి శాతశరవిద్ధుం జేసి పెల్లార్చినన్‌
దామ్రాక్షుండయి యక్షుఁడా రిపు గదం దాటించినన్‌ వాతధూ
తామ్రంబున్‌ బలె వాఁడు మూర్ఛిల స్వకీయాంఘ్రిస్ఫురద్ఘట్టనన్‌
నమ్రత్వం బహిరాజు సెంద ఘటకర్ణజ్యేష్ఠుఁ డత్యుగ్రుఁడై
38
కం.ఆ మాణిభద్రుఁగదిసి శి
తామితశరవృష్టిఁ గురియ నతఁ డతికుపితుం
డై మూఁడు తూపు లసుర
గ్రామణి పేరురము నాటఁగా నేయుటయున్‌
39
ఉ.అందున నొచ్చి పంక్తిముఖుఁ డల్గి గదాహతి మాణిభద్రు మౌ
ళిం దిలకించి కొట్టినఁ జలించి యతం డల మౌళి యోరపా
టొందెఁ దదాదిగా రఘుకులోత్తమ! యాయన పార్శ్వమౌళినాఁ
జెందె నభిఖ్య నంత వెఱచేఁ బఱచెం బరసేన లార్వఁగన్‌
40
వ.ఇతైఱంగున దళవాయి దొలంగి పోయినం గనుంగొని41
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju