ఇతిహాసములు ఉత్తరరామాయణము ధనదుఁడు యుద్ధరంగమునకు వచ్చి దశగ్రీవునకు బుద్ధులు చెప్పుట
ధనదుఁడు యుద్ధరంగమునకు వచ్చి దశగ్రీవునకు బుద్ధులు చెప్పుట
సీ.పిడుగుఁ జప్పుడులతో బెడిదంపుటడిదముల్‌ - జళిపించుచును భటావళులు గొలువ
జయ జయనవనిధీశ్వర! మహేశ్వరమిత్త్ర! - యనుచుఁ జారణకోటు లభినుతింప
జవనకంఖాణరాజము లెక్కి కిన్నర - గ్రామణు లుభయ భాగములఁ గొలువ
నుద్భటాహంపూర్వికోక్తులు వెలయఁ గిం - పురుషయోధులును గ్రిక్కిఱిసి కొలువఁ
 
గీ.బద్మ శంఖాద్యనిధులు రూపంబు లూని
కొలువ, బంగారు తేరెక్కి గురుగదాది
సాధనములొప్పఁ గిన్నరేశ్వరుఁడు వచ్చి
చుఱుకుఁజూపుల దశకంఠుఁ జూచి పలికె
42
ఉ.తమ్ముఁడవంచు నీకొక హితం బెఱిఁగింపఁగ దూతఁబంచినన్‌
వమ్మొనరించి నా పలుకువానిని జంపి, ననున్‌ జయింప రే
ద్రిమ్మరిగుంపుతోడ నరుదెంచితి నిన్నననేల? నీకు డెం
దమ్మున మేలుగాఁ దలఁచు నన్నె యనందగుఁగాక దుర్మతీ!
43
ఉ.రోగికి భక్ష్యభోజ్యముల రోగము హెచ్చుగతిన్‌ పటుక్రుధా
యోగికి నీకు మాదృశహితోక్తులఁ గ్రోధముతి మించుమాటికిన్‌
నీ గుణచర్య లేటికివి? నింద యొనర్పఁగ; నీకె తెల్లమౌ
రాఁగల మృత్యువుం బొరసి రౌరవబాధలఁ బొందుచున్నెడన్‌
44
ఉ.ఆపద లావహించు దురహంకృతి నీ గతి మూర్ఖుఁ డుగ్రపుం
బాపము లాచరించి విషపాన మొనర్చి శరీర మంతయున్‌
వ్యాపకమైనఁ జింతిలు జడాత్మువలెన్‌ యమపాశబద్ధుఁడై
పాపఫలంబుఁజెందునెడఁ బాపముఁజేసితి నంచు వందురున్‌
45
ఉ.అన్నకుఁదండ్రికిన్‌ గురున కాపద యెవ్వఁడొనర్చు వానిఁగ
న్గొన్న మహోగ్రపాతకమగున్‌ దను వస్థిర మృత్యువెప్పుడున్‌
సన్నిహితస్థితిన్‌ మెలఁగు సంపద పుణ్యవశం బటంచు తో
నిన్నియు నెంచి ధర్మము వహించు జనుండు గృతార్థుఁడెయ్యెడన్‌
46
చం.కలఁగక బుద్ధి పూర్వకముగా జనుఁ డే క్రియఁ జేయుఁదత్క్రియా
ఫల మనుభూతిగా నిది శుభం బశుభం బిది యంచు రెంటినిం
దెలిసి సుకర్మముల్‌ సలుప దేవతలందఱు మెత్తు రందునం
గలిమియు బల్మి యిచ్చటనె కల్గు సుఖంబె లభించునచ్చటన్‌
47
చం.ధనమణివస్తువాహవనితాజనతాదులు బల్మి సంతరిం
చినయవి యంచు, ధర్మములు సేయక యుండిన నేమియంచు, న
య్యనిమిషు లందఱిం బగతు రంచు, మహాపదలొందనున్న ని
న్ననుజుఁడవన్నఁ గల్గు నిరయంబు-రయంబున రమ్ము పోరికిన్‌
48
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju