| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | దశకంఠుఁడు ధనదుని మాయాయుద్ధమున గెల్చి యతని పుష్పకంబుఁగొనుట |
| కం. | అని తమ దొర దూఱెడు ధన దుని మారీచప్రహస్త ధూమ్రాక్ష శుకా ద్యనిమిషరిపు మంత్రులు మా ర్కొని నిలువఁగ లేక చనిరి కోఁచతనమునన్ | 49 |
| చం. | అని నిటు లాత్మమంత్రులు ధనాధిపుకోల్తల కోర్వలేమి న ద్దనుజవరేణ్యుఁ డుగ్ర నిశితప్రదరంబుల వాని ముంచినన్ గనలుచు డాసి, కిన్నరశిఖామణి వాని కిరీటపంక్తి ఖం గున రొదసేయ, భూరిగదఁగైకొని బెట్టుగమోఁది యార్చినన్ | 50 |
| మ. | కడుఁగోపించి దశాననుండతని వక్షఃపీఠముం జొచ్చిపో యెడు నట్లుగ్రశరంబు వ్రేయుటయు యక్షేశుండు ధీరత్వ మే ర్పడఁ గోదండగుణారవం బఖిల దిగ్భాగంబులన్ నిండ న ప్పుడు వహ్న్యస్త్రము వైవ వాఁ డడఁచె నంభోబాణవేగంబునన్ | 51 |
| మ. | శరసంధానదృఢాపకర్షణకృతుల్ జ్యాఘోషణంబుల్ పర స్పరధిక్కారము లొక్కచందమున మించన్ విశ్రవఃపుత్త్రు లి ర్వురుఁ గ్రొన్నెత్తుటఁ దోఁగుచున్ గెరలుచున్ రోషించుచున్ డాయుచున్ హరియుగ్మంబన నిద్దఱిద్ద ఱయి శౌర్యస్ఫూర్తి బోరాడఁగన్ | 52 |
| కం. | రణమున వివిధాయుధధా రణమున సరిఁబోరు యక్షరాక్షసవరులం బ్రణుతించి రమరు లసురా గ్రణియున్ మాయఁగొని న్యాయ్యరణవిముఖుండై | 53 |
| సీ. | ఒకసారి మేఘమై యుడువీథిఁ గనిపించుఁ - గనిపించి పిడుగు లుగ్రముగఁ గురియు నొకతేప సింహమై యుద్వృత్తిఁ బఱతెంచుఁ - బఱతెంచి కహకహార్భటి వహించు నొకసారి కొండయై యురులీల నెదిరించు - నెదిరించి యెగసి బిట్టదరఁజేయు నొకమాటు వార్ధియై యూర్ములతో మించు - మించి రోదసియెల్ల ముంచివైచు | |
| గీ. | నొక్కపరి వ్యాఘ్రమైవచ్చు నొక్కసారి దంష్ట్రియై తోఁచు నొకమరి దారుణాహి కరణిఁ గనిపించు నొకమాఱు గానిపింప కడఁగు మాయానిరూఢి నయ్యసురవరుఁడు | 54 |
| చం. | ఇటువలెఁ బెక్కుమాయల ధనేశ్వరునిన్ భ్రమియించి, విక్రమో ద్భటగతిమించి నిష్ఠురగదం దలమోఁదినఁ గ్రొత్తనెత్తురుల్ జొటజొటఁగాఱిఁ బూచినయశోకము గాలికిఁ గూలుచాడ్పునం దటుకున వ్రాలెఁ దేరిపయి దానవసైన్యము లుల్లసిల్లఁగన్ | 55 |
| మ. | ధనదుండీగతి మూర్ఛఁజెంది పడనంతన్ సూతుఁడత్తేరు గ్ర క్కున నందాతటినీ సమీపమునకుం గొంపోయె, యక్షుల్ భయం బున వృక్షంబులు ప్రాఁకియున్, గిరిబిలంబుల్ సొచ్చియున్, విచ్చి కా ననముల్ దూఱియుఁ గోనలం బడియు దైన్యం బొంది రెంతేనియున్ | 56 |
| తే.గీ. | మూర్ఛ మునిఁగిన ధనదుసమ్ముఖముఁజేరి శంఖపద్మాది నిధులు విశ్రాంతిమాన్చె నంత దశకంధరుఁడు నిట్టులన్న గెలిచి సొలయ కాతని నగరంబు సొచ్చి యచట | 57 |
| సీ. | శాతకుంభస్తంభ సాహస్రములు గల్గి - వైదూర్యతోరణావళులు కల్గి నవ్యమౌక్తికవితాన వితానములు గల్గి - శశికాంతవేదికా చయముగల్గి సొగసైన మగఱాల సోపానములు గల్గి - కప్పుఱా లోవల యొప్పు గల్గి కామితార్థము లిచ్చు ఘనవృక్షములు గల్గి - వికచకల్హార దీర్ఘికలుగల్గి | |
| గీ. | మానసజవంబుగల్గి కామగతి గల్గి కామరూపంబులు వహించు గరిమగల్గి ప్రబలు పరమేష్ఠిరజత పుష్పకముఁగాంచి యందుపై నెక్కి యతఁడు తారాద్రి కరిగె | 58 |
| మ. | తరళోత్తుంగతరంగఘుంఘుమరవోద్యద్దివ్యనందారవిం దరజోబృందమరందతుందిల మిళింద ధ్వానసంబంధగం ధరమాబంధుర మంథరానిలునిచేతన్ శ్రాంతి పాయన్ ధనే శ్వరుఁడుం దెప్పిరి, భీతిసేనఁగొని లజ్జం జేరె వీడయ్యెడన్ | 59 |