| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | దశవదనుఁడు సపరివారంబుగాఁ గైలాసంబున కేఁగుట |
| ఉ. | ఆజితనూజ! వింటివె? దశాననుఁ డిట్టులు పుష్పకంబుతో నాజి జయంబునుం బొలసి యావలఁ బోవుచుఁజూచె ముందటన్ రాజతశైలమున్ దపనరథ్య నిరోధకృదత్యుదగ్రతా రాజిత సాలమున్ దటచరత్కరి సింహతరక్షుకోలమున్ | 60 |
| తే.గీ. | చూచి యచ్చోటి వింతలు చూడవలసి బలసి యిరువంకలను దైత్యభటులు గొలువఁ జెలువ మొలికెడు నమ్మహాశిఖర మెక్కి యక్కడఁ జరింప మారీచుఁ డతని కనియె | 61 |
| మ. | కలధౌతాచలదీధితి ప్రచయమో గంగాప్రవాహాంతరో జ్జ్వలడిండీర నికాయమో శబరయోషాధన్వముక్తాస్త్రని ర్దళిత ప్రాంచిత చామరవ్రజమొ నా రంజిల్లు రెండాఱుచే తుల ఱేఁడుండిన ఱెల్లుటిల్లు గనుమా! దోషాచరగ్రామణీ! | 62 |
| సీ. | శైలజా సహచరోజ్జ్వల రుద్రకన్యకా - చరణలాక్షాపంక మొరసినదియొ యిది నగంబనుపేర నింపొందుఁగావున - విపులంబుగాఁ బల్లవించినదియొ తన గిరీశత్వ మందఱకుఁదోఁప నభంబు - మించు పెంజడలు వహించినదియొ సానుభాగచరద్భుజంగభోగమణీస - మంచిత ప్రభలాక్రమించినదియొ | |
| గీ. | లేక ధననాధు గెలిచి త్రిలోక విజయ వాంఛ నరుదెంచు దేవరవారి దోఃప్ర తాప మిటనుండినదియొ నాఁ దరుణతరణి కిరణగతి గైరికముల నిగ్గిరి వెలింగె | 63 |
| చం. | తిరముగ జైత్రయాత్ర చనుదెంచిన నిన్‌గని యీ కుభృత్తు నిర్ ఝరములఁ బాద్యమిచ్చి రవిసంజ్వలితార్కమణీ విభాపరం పరల నివాళి సేసి వనభవ్యశుకాది విహంగమోక్తి వై ఖరి నుతి సల్పెడిన్ రజతకాంతుల వెల్లఁదనంబుఁజూపుచున్ | 64 |
| సీ. | చిగురు జొంపముల రంజిల్లె నీ యెలదోఁట - చెలు వపర్ణకు వేడ్క సేయు నేమొ? విరిగల్వ విరులచే వెలసె నిక్కొల నిందుఁ - జంద్రజూటుఁడు గేళి సల్పునేమొ? సంతానకుసుమవాసనలూనె నిక్కోన - దేవకన్యకలు వర్తింతు రేమొ? పువ్వుఁబుప్పొడిదుమ్ము పొదలె నిప్పొదలలో - సిద్ధాళు లెపుడు వసించునేమో? | |
| గీ. | తనరె బహుబిల్వరుద్రాక్షతరువు లిచటఁ బ్రమథవర్యుల కివి రచ్చపట్టులేమొ? యనుచు మారీచుఁ డెఱిగింప నచట నచట నయ్యసురభర్త విహరించు నవసరమున | 65 |
| సీ. | చిమ్మచీఁకటిగ్రమ్ము క్రొమ్మావి గుమి నల్లి - బిల్లియౌ ద్రాక్షపందిళ్ల నడుమ వడిఁబాఱు విరితేనె వాఁకల దరుల వెం - బడి ఘుమ్ముమను మృగమదముతావిఁ బొలుపొందు విరవాది పొదలలోఁ గుప్పలు - వడు సురపొన్న పుప్పొడి దుమార మొలసిన లేఁదెమ్మెరల యెమ్మె గనుకమ్మ - బంగారుఁబూఁదోఁట పజ్జ నమరు | |
| గీ. | మరకతనిబద్ధ భూముల మలయు రేవె లుంగు ఱాతిన్నియల చెన్నెసంగు పొగడ మ్రాని నీడలఁదగు నొక్క కోనలోనఁ బుష్పకవిమాన మటు సాగిపోక నిలిచె | 66 |
| చం. | నిలిచినఁ బంక్తికంధరుఁడు నెవ్వెఱఁగంది యిదేల? యిచ్చటన్ నిలిచెను? శక్తుఁడే యొకఁడు నిల్పఁగ? దీనికి దుర్గమస్థలం బులు గలవోటు చూడుఁడటుఁ బొండని మంత్రులఁ బంప వార ల క్కెలఁకుల సంచరించి పరికించియు హేతువు గాన కయ్యెడన్ | 67 |
| మ. | అల మారీచుఁడు దేవ! వింటె యిది యక్షాధ్యక్షునింగాని య న్యులఁబైనూని చరింపదో? యతఁడు క్రోధోద్రేకియై నిల్పెనో? తెలియుం డం చనునంతలో వికటుఁడై దీప్తాస్యుఁడై కుబ్జుఁడై బలధుర్యుం డగు నంది యందుఁగని యప్పౌలస్త్యుతో నిట్లనున్ | 68 |