| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | దశగ్రీవునిచే అవమానితుఁడై నందీశ్వరుఁడు శాపంబిచ్చుట |
| చం. | నిలిచె విమానమంచు రజనీచర! నివ్వెఱఁగందనేల? యీ నెలవున దేవితో హరుఁడు నేఁడు విహారము సేయుచున్నవాఁ డల గరుడోరగామరవియచ్చరు లోడుదు రీడఁ జూడ నిం దుల కరుదెంచి నీ బలముతోఁ జెడిపోక తొలంగు నావుడున్ | 69 |
| చం. | పటపట పండ్లు గీటుకొని పంక్తిముఖాసురభర్త పుష్పకం బటు డిగి శంభుఁ డెవ్వఁ డహహా! నను నిల్పెడునంత వచ్చెనే? యిట నిను నీ శివున్ నిలువ నిచ్చిన నట్టులు గాదె యంచుఁ ద త్తటమున నుండి యగ్గిరివతంసముక్రిందికి వచ్చి చెచ్చెరన్ | 70 |
| కం. | ఉరుశూలముఁగొని రెండవ హరుని వలెను దీప్త విగ్రహము మీఱఁగ వా నరముఖ మొందిన నందినిఁ బరికించి దశాననుండు పకపక నగియెన్ | 71 |
| తే.గీ. | ఇవ్విధంబునఁ దనుఁజూచి నవ్వుచున్న యతివిమూఢుని దశకంఠు నట్టె చూచి యపరశివుఁడైన నందీశుఁ డాగ్రహము వ హించి కటతట మదరఁగా నిట్టులనియె | 72 |
| చం. | కపివదనుండనైన ననుఁ గన్గొని, నీ వవమానదృష్టితో నిపుడు హసించినాఁడ విట నీదృశవక్త్రముఖుల్ నఖాయుధుల్ గపు లిఁక నీ కులం బడఁపఁ గల్గెద రంతటఁ గండగర్వముం దపమునఁ బుట్టుబెట్టిదముఁ దామె యడంగెడు రాక్షసాధమా! | 73 |
| శా. | శాపోక్తుల్ పచరింపకున్న నెదిరించన్ రాదె యంటేని నిం దాపారంపరి మున్నుగా మృతుఁడవే నా కిట్టి పీనుంగుపై నేపుం జూపఁగ నర్హమౌనె? యిది గా కీ చేయు పాపంబుచే నాపద్వార్ధి మునింగిపోవఁగల వేలా యింక నిన్నొంచఁగన్! | 74 |
| కం. | అని యా నంది శపించిన విని యానందించి సురలు విరులు గురిసి ర వ్వినువీథి దేవదందుభు లును మొరసెన్ బెరసె సుఖము లోకము లెల్లన్ | 75 |
| ఉ. | అంత దశాననుండును మదాంధుఁడు గావున శప్తుఁడయ్యు నొ క్కింతయుఁ జింత లేక మఱి హెచ్చిన భీషణరోషవహ్ని నే త్రాంతరశోణకాంతులు బయల్పఱుపన్ గలధౌతశైలరా డంతికవర్తియై పలికె నగ్రమునన్ నిలుచున్న నందితోన్ | 76 |
| ఉ. | పెక్కులు ప్రేల నిచ్చినను బ్రేలవె? నీ పశుబుద్ధి మాటలన్ దక్కునె? చక్కఁగా నెదిరిఁ దన్ను నెఱుంగ వటుండు, పుష్పకం బిక్కడ నాఁగి మీ యధిపుఁడింక సుఖంబున నుండుఁ గానిలే, యెక్కిన వెండికొండ నిదియేఁ బెకలించి రజంబు చేసెదన్ | 77 |
| వ. | అని దురాగ్రహంబునం బలికి, యద్దశగ్రీవుండు రవిగ్రహంబు నొరయు నుదగ్రవిగ్రహంబుతో నమ్మహాగ్రావంబు శిఖరాగ్రం బనర్గళలీలంబట్టి, యిట్టట్టు గదలించి, బెట్టు గదలిన యగ్గట్టుచుట్టుఁ గనుపట్టు నెఱియ విరియం బదఘట్టనంబు గావించి, గీర్వాణగణప్రాణనిర్వాణ ప్రవీణతాధూర్వహ దుర్వార గర్వాకర దర్వీకరభీకరంబులైన వింశతికరంబులు సారించి, హుంకరించి యహంకరించి, పది మొగంబులు జేగుఱింప, వేగిరించు సాహసోత్సాహసంపదలతో నిజభుజాంగదంబు లొండొంటితో నొరయ, నిజాట్టహాసంబున గుహాకుహరంబులు మార్మొరయ, నిజవిలోకనంబుల మిడుంగుఱులు గురియ, నిజదంతసంఘర్షణంబున దిగ్గజంబులు సెవుడు వొరయ, నిజప్రతాపంబు మెఱయ, నిర్నిమిత్త మీ మహీభృత్తు హత్తి మత్తవృత్తింజూప నేల యని తద్బలంబులు దనపై నురవడించెనో యన, శరభ సింహశార్దూల మదేభ ప్రముఖవనజంతువులు క్రేళ్ళు ఱక, మహోరగంబులు సరగ నరుగఁ గూడక, చూడ గొప్ప లగుపిప్పలాది తరువులం జుట్టుకొని బుసకొట్టుచు నవియునుం, జాఁపకట్టు వడ, నొడళ్ళు నలఁగి పడగ లవిసి సమసినఁ దదగ్ర జాగ్రన్మణులు ఫణిభూషణున కద్దురవస్థ నుడువం బరువు లిడుచున్న వడుపునఁ దవ్వుల మిడిసిపడ, గడ గడ వడంకుచు నుడుగని జడుపునం దముఁ గౌఁగిలించు చెంచుమించుఁబోఁడుల కౌఁగిళ్ళ ననంగి వెనంగి, వారి యనుంగుమగ లడుగు నోపఁగూడక దబ్బునం గూలి, నెత్తంబుపట్టులఁ బొర్లిగింతలు వెట్ట నట్టివంతలు గని యెట్టివింతలు పుట్టెనని రచ్చపట్టు చెట్టుల క్రీనీడలం గ్రీడలు సాలించి, యన్నెలవున నిలువలేక, వేల్పుఁగలువకంటులు క్రొమ్ముడులు వీడఁ, గీలుగంటు లంసంబులపై జీరులాడఁ, దళుకుఁజెక్కులు సెమరింపఁ, గలుకుగుబ్బలు పులకింప, నెన్నొసళ్ళ ముంగురులు నెఱయఁ, జిగురుఁగెమ్మోవుల నిట్టూర్పులు దొరయ, నిజాధిపభుజా స్తంభంబు లూఁతంగొని, తద్రయంబునం జెంగటి విమానంబు లెక్కికొని, తమ్ముఁగ్రమ్మఱం బుట్టినవారిఁగాఁ దలంప నిలింప హృదయంబులు గలంపజాలు నారభటులతో వీరభటు లిరువంకల నిలిచి వెక్కు చందంబుల నభినందింప, నంది కేశ్వర గణేశ్వర చండికేశ్వర ప్రముఖ మహాప్రమథ గణేశ్వరులు శర శరాసన పట్టిస ప్రాసకరవాలభిందివాల తోమర ముద్గర గదాకుంత క్షురికాదిసాధనంబులు గైకొని, సర్వజ్ఞుని యనుజ్ఞవడయుటకై యతని యగ్రభాగంబున నలబలంబులు సేయుచు, నిలువుఁగొలువు సేయఁ, బార్వతీపరమేశ్వర క్రీడోచిత మణిఖచిత సౌధప్రాకారగృహకుడ్య గోవురతోరణ స్తంభాదులు బ్రద్దలువాఱి తద్దయుఁ బ్రకంపనంబు వహింప, సహింపరాని దరంబునం గరంబులు పిసికికొనుచుఁ, బదకంజమంజీర సంజాతశింజారవంబులు సెలంగ నలుగడలం దిరుగుచు, రుద్రకన్యక లనన్యశరణ్యలయి, దైన్యంబు నొంద, నరవిందబాంధవాదిగ్రహంబులు త్రోవలు దొలంగ, నింద్రాదిలోక పాలకలోకంబులు హాహాకారంబులతో బట్టబయల నిలిచి చూచుటకు బెట్టులికి యిట్టలంబగు మొగుళ్ళ తెట్టువలలో మఱుఁగుపడి యా కట్టిఁడి పొట్టక్రొవ్వున నిట్టి బెట్టిదంబు గావింప గట్టువిల్లువట్టినదిట్ట యెట్టు మట్టు వెట్టకున్నవాఁడో యని యొకళ్ళొకళ్ళతోఁ బలుకుచుఁ గనుంగొనఁ, బ్రత్యంతపర్వతంబు లున్మూలంబులై పొడ వడంగఁ, బెద్దపెద్ద గండోపలంబులు పై పైనుండి పెళపెళ మనుచప్పుళ్ళతో డుల్లి చఱుల నురలిపడం బడలు వడక, పాతాళంబులోఁతు గను పాఁతగలించి పుండరీకంబుఁ బెకలించు మదవేదండ ప్రకాండంబుడంబున ఝరీ మండలహారిపరంపరలు నలువంకలఁ దొరంగ, ఖనిస్థలీవినిర్గత నీలమణి రమణీయ మధుకరంబులు నలుగడలఁ జెదర, గనకవకుళకేతకీకురంట కాశోకమధూక కేసర ప్రముఖ భాసుర కుసుమవిసృమరపరాగవిసరంబు నలుదెసల నొరసికొన, నవ్వెండి కొండఁ బెకలించి, కందుక క్రీడం గావింపం గడంగె, నయ్యవసరంబున. | 78 |
| మ. | అసురాధీశకరావధూత కలధౌతాద్రింబదం బూనలే క, సఖుల్‌గొల్వ వనంబులో మెలఁగు నగ్గౌరీసరోజాక్షి మే ను సెమర్పన్, దనుమధ్యమున్ వడఁక నాందోళింప నేత్రప్రభల్ వెస నేతెంచి కవుంగలించుకొనియెన్ విభ్రాంతయై శంభునిన్ | 79 |
| వ. | ఇవ్విధంబున | 80 |
| ఉ. | బంగరుఁదళ్ళుఁజెక్కులను బంజులకమ్మల డాలు చిందు ద్రొ క్కంగ మెఱుంగుఁజన్నుఁగవ కంచుకపున్ముడి వీడఁగా హఠా లింగనసౌఖ్య మిచ్చిన చెలిం గవుఁ గింటనె యుంచి యల్గఁడ య్యెం గఱకంఠుఁ డద్రి నతఁ డెత్తఁగఁ గాముకు లెగ్గు లెంతురే? | 81 |
| శా. | శంభుం డద్రికుమారికాస్ఫురదురోజద్వంద్వశుంభత్పరీ రంభం బీగతిఁజెంది యెంత సుఖమౌరా! నెమ్మదిన్ వీని యా రంభం బె ట్టుడుపంగవచ్చు? నయినం గ్రౌర్యంబు దీఱన్ భుజా స్తంభోజ్జృంభ మొకింత మాన్పి పిదపన్ సౌహార్దముం జూపెదన్ | 82 |
| కం. | అని తలఁచి లేఁతనగ వా ననమునఁ దగ శంభుఁ డాసనము డిగ్గక మున్ తన వామపదాంగుష్ఠం బున నదిమె దశాస్యుహస్తములు క్రిందుపడన్ | 83 |
| తే.గీ. | ఇట్టు లదిమిన భుజశౌర్య మెడలి బడలి యడలి యొడలి మదోద్వృత్తి సడలి, శూలి కాలి పెనువ్రేలు దెమలించి కరము లెత్తు కొను సమర్థత లేక రక్షోవిభుండు | 84 |
| మ. | కులశైలంబుల పెన్ బిలంబులు బదుల్ ఘోషింప, శేషాహి మూ ర్ఛిల భూచక్రము దిర్దిరం దిరుగ, జేజేపెద్ద భీతిల్లఁ జు క్కలు రాలన్, దివి పెల్లగిల్ల సురలాకంపింప, నంభోనిధు ల్గలఁగన్ దిక్తటు లొడ్డగిల్లఁ బదినోళ్ళన్ బెట్టు వాపోవఁగన్ | 85 |
| కం. | తలఁచిరి మనుజు లకాండ ప్రళయం బిది యనుచు దిగులుపడి రమరేంద్రా దులు యక్షసిద్ధసాధ్యులు గలఁగిరి తొలఁగిరి పదంబు గ్రహరాణ్ముఖ్యుల్ | 86 |
| శా. | ఈ రీతిన్ జగముల్ దలంకఁగను వేయేం డ్లార్తుఁడై కూయఁగా నా రక్షోవిభు దైన్యపాటుఁగని దైత్యశ్రేణి కన్నీరు ము న్నీరై పాఱఁగ నే మొనర్తు మనుచున్ నిర్విణ్ణతంజెంద న మ్మారీచాదికు లాతనిం గని యసామాన్యప్రబోధంబునన్ | 87 |
| తే.గీ. | పలికి రవధారు దైతేయపట్టభద్ర! భద్రగజచర్మధారిపై భక్తి యుంచి యంచితోక్తుల నతని నుతించితేని నీ నిరోధంబు నెడఁబాపు నీ క్షణమున | 88 |
| కం. | హరుఁ డున్నత కరుణానిధి శరణన్నఁ బరిగ్రహించు జగతి నతనికిం బురుఁ డున్నదె? యజకనకాం బరు లెన్నఁగలేరు తత్ప్రభావం బనినన్ | 89 |