ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుఁడొనర్చిన శివస్తుతి రగడ
రావణుఁడొనర్చిన శివస్తుతి రగడ
రగడజయజయ శంకర సాధువశంకర, జయజయ రిపుభటచయనాశంకర
శరణు నిరంజన సజ్జనరంజన, శరణు ప్రభంజన జవగజభంజన
పాహి పురాహవ బంధురవిక్రమ, పాహి యవిద్యాపంక రవిక్రమ
యచ్చుగ నినుఁ దెలియవు తొలిచదువులు, మెచ్చిన నిత్తువు మే లగు పదవులు
నీ కెవ్వరిపై నిలువదు కోపము, లోకుల కెంచ దెలుపుదు ప్రతాపము
పరుఁడు స్వజనుఁ డను భావవిభేదముఁ, బొరయదు నీమది పూర్ణామోదం
బభవుని భవు ని న్నమితదయాపరు, నభినుతింప బ్రహ్మాదులు నోపరు
ఖలుఁడ మదాంధుఁడఁ గలుషోత్కృష్ఠుఁడఁ, జలచిత్తుఁడఁ గడు జడుఁడ నికృష్ణుడ
నే మిముఁ బొగడఁగ నెంతటివాఁడను? స్వామీ! మద మఱి శరణన్నాఁడను
నీ దానుఁడ నిఁక నేరము లెంచకు, నా దుర్వృత్తి మనంబున నుంచకు
మెఱుఁగక చేసితి నిపు డపచారము, శరణన్నను గడ సనదొ విచారము?
వలచితి నీ సేవకుల మహత్త్వముఁ, దెలిసితి నియ్యెడ దేవర సత్త్వము
నీ కను దెఱచిన నెగడును జగములు, నీ కను మూసిన నిలువవు జగములు
ఇట్టి నీకు సరి యే నని హెచ్చితిఁ, బొట్టక్రొవ్వు సనఁ, బొగడఁగ వచ్చితి
నాగుణ మెంచకు ననుఁ బాలింపుము, నీ గుణ మెంచెద నీ వాలింపుము.
92
చం.అని తనుఁ బ్రస్తుతించిన దశాననుఁజూచి పురారి నవ్వుచున్‌
దనుజవరేణ్య! నీ స్తుతికిఁ దద్దయు మెచ్చితి, ధైర్యశాలివౌ
దనుమతి యిచ్చితిన్‌ జను ప్రియంబగుచోటికి నీ భుజాబలం
బనితరసాధ్యమంచు విని యారయ నిల్పితి నింతె యియ్యెడన్‌
93
తే.గీ.మత్పదాంగుష్ఠ పరిపీడ్యమాన రజత
పర్వతము క్రిందఁ జేతులు పడినయపుడు
జగము లద్రువ విరావంబు సలిపి తందు
వలన రావణుఁడను పేర వెలయుమనిన
94
ఉ.ఆ దశకంఠుఁ డీశ్వరున కానతుఁడై శివ! నన్నుఁబ్రోవ నా
హ్లాదము గల్గెనేని నిసుమంత కొఱంతయు లేని యాయువున్‌
నీదగు చంద్రహాసమును నెమ్మినొసంగు మటన్న శంభుఁ డ
క్కైదువునిచ్చి పిమ్మట నఖండతరాయువు నిచ్చి యిట్లనున్‌
95
మ.దితిజాధీశ్వర! నీవు కోరినక్రియన్‌ దీర్ఘాయువున్‌ నీకు ని
చ్చితి నీ క్రొవ్వున నీతిఁజేకొనక దుశ్శీలుండవై మమ్మనా
దృతి నొందించితివేని మా వరము మమ్మే చేరుఁ బొమ్మన్నచో
నతఁ డా శూలికి మ్రొక్కి వీడ్కొని విమానారూఢుఁడై యుబ్బుచున్‌
96
కం.తన పరివారము గొల్వఁగఁ
జనియెన్‌ రజతాద్రి డిగ్గి స్వచ్ఛందగతిన్‌
మనుజేశ్వర! యని కుంభజుఁ
డినకులునకుఁ దెల్పి మఱియు నిట్లని పలికెన్‌
97
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju