ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణాసురుండు సేయు లోకోపద్రవచర్యలు వర్ణించుట
రావణాసురుండు సేయు లోకోపద్రవచర్యలు వర్ణించుట
మ.ఇనవంశోత్తమ! వింటె! పంక్తివదనుం డీ లాగు కైలాసవా
సునిచే మన్ననఁగాంచి పొంగుచుఁ బ్రహస్తుండాదియౌ సైనికుల్‌
దనుఁ గొల్వంజని హేమకూటహిమవత్ప్రాంతంబులన్‌ గంధమా
దననీలాచల పారియాత్రముల మీదం గ్రీడ సల్పెన్‌ రహిన్‌
98
వ.మఱియును99
సీ.చరియించు నొకవేళ జంబూనదీతీర - సౌవర్ణ వాలుకా స్థలములందు
విహరించు నొకపూఁట వేల్పురాతోఁటలఁ - బొదలు గొజ్జఁగి పూవుఁబొదలయందుఁ
గ్రీడించు నొకతఱిఁ గేసరశ్వేతాంజ - నాద్యద్రిరాడధిత్యకలయందు
నలరు నొక్కెడఁగేళి నరుణోదమానస - ప్రముఖ దివ్య సరోవరములయందు
 
గీ.నన్నెలవులందు మెలఁగెడు నమరఖచర
యక్ష కిన్నర సిద్ధ విద్యాధరాప్స
రోభుజంగాదికులు మహాక్షోభ మొంది
తన్నుఁ గనుఁగొని పాఱ నద్దశముఖుండు
100
సీ.పట్టణం బనరాదు కట్టాయితంబుగా - నట్టెముట్టడి చేసి చుట్టు విడియు
బలవంతుఁ డనరాదు బలియుఁడై యెంత ద - వ్వులనున్న వడినేఁగి గెలిచివచ్చు
సురజాతి యనరాదు కరమల్గి యెటు సన్నఁ - జననీక శస్త్రాస్త్రసమితి నొంచు
ధరణీశుఁ డనరాదు తనకు నోడితి నన్న - దాక నీరసమున వీఁకఁజూపుఁ
 
గీ.బ్రాయఁపు నెలంత యనరాదు పాపమునకు
భయపడక యెట్టులైనను బట్టి కలయు
నర్హవస్తువులటఁ గల వనఁగరాదు
దుడుకుమైఁ జొచ్చికొని తెచ్చు దుష్టుఁ డతఁడు
101
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju