ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుండు వేదవతినిఁ జూచి మోహించుట
రావణుండు వేదవతినిఁ జూచి మోహించుట
వ.ఇచ్చెలువునం దనయిచ్చకు వచ్చిన హెచ్చున నచ్చటచ్చట నచ్చపలుండు నిచ్చలు మెలంగుచు నొక్కనాఁడు హిమవత్పర్వతంబునకు నుత్తరదిగ్భాగంబున నొక్క సుందరోద్యానంబు సందర్శించి యచ్చట102
సీ.ఘనమండలము సుధాకరమండలము నింపు - నటుల మోమున జటాచ్ఛటలు నెఱియ
వలఁ జక్కవలు చిక్కు వలనొప్ప మృదువల్క - లంబునఁ గుచలికుచంబు లొరయ
బెళుకుఁజూపుల లేడి గెలిచి కైకొనియెనో - నాఁ గ్రిందఁ గృష్ణాజినంబు వెలయ
నఖపాళి బెడఁగు మాన్పకు మంచు నుడులు గై - వ్రాలె నా స్ఫటికాక్షమాలిక దగఁ
 
గీ.గౌసుమరజంబు దొరసిన కల్పలతిక
బాగున విభూతిచేత మైతీఁగ వెలుఁగ
నొంటి గిరకన్యవలెఁ దపం బున్న తపసి
కన్నె నొక్కతెఁ జూచె రాక్షసవిభుండు
103
తే.గీ.చూచి యా చెల్వ చెల్వంబు లోచనముల
కబ్బురంబును గాంక్షయు నుబ్బొనర్పఁ
బుష్పకము డిగ్గి సరభసంబుగఁ దదగ్ర
భాగమున నిల్చి పలికె నప్పంక్తిముఖుఁడు
104
సీ.నీకులం బెయ్యది? నీ నామ మేమందు? - రెవ్వరి దానవే? యిందువదన!
కలికి! లేఁబ్రాయంబుఁ గానపాల్‌ గావించి - యేల కృశించెదే! యిగురుఁబోడి!
నీ ప్రాణనాథుఁడై నినునేలు భాగ్య మె - వ్వానికిఁగల్గెనే వన్నెలాఁడి!
యే తపం బొనరించి యీ చెల్వుఁగంటివో! - యింకఁ దపంబేల? యేణనయన!
 
గీ.కాఁక జెందిన పసిఁడి సలాకవంటి
తనువు, వెండియుఁ గళఁగాంచు నని తలంచి
చూపఱుల యిచ్చ వేమఱుఁ దాప ముంచె
దేమి నీ చర్య? లెఱిగింపవే! లతాంగి!
105
ఉ.నీ బిగిగుబ్బ చన్నులకు నీ నెఱి పెన్నెఱులున్నఠీవికిన్‌
నీ బటువుం బిఱుందులకు నీ యెలప్రాయపుఁగల్మి కింతిరో
యీ బసుమంబు కప్పురమె? యీ తిరి వేణియె? పట్టుచీరలే
యీ బిఱుసైన వల్కలము? లీ తప మిష్టమనోజభోగమే?
106
సీ.అణుమధ్య! నీ మధ్య మణిమంబు వహియించు - మహికటి! నీ కటి మహిమఁగాంచు
గిరికుచ! నీ కుచగిరు లొందు గరిమంబు - నలినాక్షి! నీ ఱెప్ప లలరు లఘిమ
ఘనవేణి! నీ వేణి మను ఘనశ్రీప్రాప్తి - నతివ! నీ మెయి ప్రకామ్యతకు నెక్కు
నంగన! నీ భర్త యఖిలేశతకుఁ దగుఁ - జెలి! నీకు వశియగుఁ జెఱకువిల్తుఁ
 
గీ.డిన్ని వైభవములు గల్గి యిగురుఁబోఁడి
బేలతనమున నీతపం బేలసేయఁ
గొదవ యొదవిన దిది యంచు మృదులఫణితిఁ
జెవుల కీ యెడఁ బండువు సేయు మనిన
107
కం.ఆ నెలఁతుక యప్పలుకులు
వీనుల కెడఁజేసి వాని విశ్రవు సుతుఁగాఁ
దానెఱిఁగి హీనుఁడనక య
హీనత నాతిథ్య మొసఁగి యిట్లని పలికెన్‌
107
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju