ఇతిహాసములు ఉత్తరరామాయణము వేదవతి రావణునకుఁ దన వృత్తాంతముఁ జెప్పుట
వేదవతి రావణునకుఁ దన వృత్తాంతముఁ జెప్పుట
మ.దనుజాధీశ! కుశధ్వజుండను తపోధన్యుండు మున్నొప్పు నా
యన వేదంబు పఠించువేళ నుదయంబై నేను వాపోవఁగా
ననుఁ బ్రేమంబునఁ జూచి వేదవతి యన్నామంబుఁ గావించి పెం
చిన లేజవ్వన ముప్పతిల్లుటయు జేజేలున్‌ మునుల్‌ రాజులున్‌
109
కం.నను వలచిన ధీషణసుతుఁ
గని వేఁడిన హరికి నిత్తుఁగాని యొరుల కి
వ్వనితామణి నీనని యె
వ్వనికైన నొసంగఁ డడుగవచ్చినవేళన్‌
110
వ.ఇవ్విధంబున111
శా.ప్రత్యాఖ్యానముఁ జెంది యందఱుఁజనన్‌ బాపాత్ముఁడౌ దంభుఁడన్‌
దైత్యుండొక్కఁడు వచ్చి, మజ్జనకునిన్‌ దావేఁడి యీనన్నచో
నత్యంతక్రుధఁబూని, ఖడ్గమున నిద్రాసక్తు ఖండించ నా
హత్యన్‌ వాఁడు నశించె నత్తపసి యిల్లా లగ్నిఁజొచ్చెన్‌ వెతన్‌
112
తే.గీ.తల్లియును దండ్రియును జన్నఁ దన యభాగ్య
మునకుఁ గలఁగియుఁ గలఁగక పూర్ణనిష్ఠ
జనకుని ప్రతిజ్ఞఁ గడదేర్తు నని తలంచి
వెన్నుని గుఱించి యిటుఁ దపమున్నదాన
113
కం.కంటివి యిచ్చట వింతలు
వింటివి నా పూర్వకథ సవిస్తరముగఁ జే
కొంటివి యాతిథ్యము దడ
వుంటి విచటఁ జనుము రాక్షసోత్తమ! యనినన్‌
114
చం.తనకిది దక్కెనంచుఁ బ్రమదంబునఁ బంక్తిముఖుండు మీనకే
తుని చిగురాకు బాకుఁ మదిఁ దూఱినఁదాలిమి మాలి, చేరఁగాఁ
జని యిది యేమి వెఱ్ఱి? యెలజవ్వనముం బొలవోవ, విష్ణుడం
చునె కలకాలముం దపసి చొప్పున దాఁటెదు వృద్ధకాంతవై
115
ఉ.వెన్నున కిత్తునంచు బలువేఁదుఱు సేకొని తండ్రి యీల్గుటం
గన్నులఁజూచియున్‌ హరియె కావలెనంచుఁ దపించె దూరకే
కన్నెఱికంబు కాఱడవిఁగాచిన వెన్నెలసేసి యయ్యయో
నిన్నును ముంచె నీ జనకునిం గుదియించిన వెఱ్ఱి! యియ్యెడన్‌
116
మ.హరి తానే బలవంతుఁడైన మును మీ యయ్యన్‌ విరోధించి యొ
క్కరుఁ డుగ్రాసి వధింప నడ్డపడి దోర్గర్వంబు గాన్పించెనే?
హరి యన్నామము గప్పకున్‌ బెరయు నేలా యీ వృధాభ్రాంతి? యిం
తిరొ! యింకన్‌ ననుఁబొందు మేలగు వయస్తేజః ప్రభావాఢ్యుఁడన్‌
117
చం.అన విని కర్ణముల్‌ చిగురుటాకులఁగేరెడు కేలుదోయి న
వ్వనజదళాక్షి మూసికొని వాని ననాదరదృష్టిఁ జూచి యీ
చెనఁటి వివాదముల్‌ విడువు, శ్రీహరి నే ఖలుఁడైన నింద స
ల్పునె? తగు బ్రహ్మవంశమునఁ బుట్టియు మౌర్ఖ్యము మానవక్కటా!
118
సీ.అన్వయంబులకెల్ల నాది కారణభూతుఁ - డగు ధాతఁ గనినాతఁ డతఁడె గాఁడె
జపతపోమఖముఖాచారసారఫలంబు - లరసియిచ్చు ప్రదాత యతఁడెకాఁడె
సముఁడయ్యు దుష్టశిక్షయు శిష్టరక్షయుఁ - బ్రతియుగంబునఁజేయు నతఁడెకాఁడె
నీయందు నాయందు నిఖిలాత్మలందంత - రాత్మయై కనునాత్మ యతఁడెకాడె
 
గీ.యాగమాంతరహస్యార్థ మతఁడె కాఁడె
యన్నిజగముల కధినాధుఁ డతఁడె కాఁడె
యట్టి హరి నెంచ నేర కహంకరించి
నిర్నిమిత్తంబ నిందింప నీకుఁ దగునె?
119
మ.పలుకుల్‌ వేయును నేల? లెస్స వినుమా?! పౌలస్త్య! నా మేను నా
యెలప్రాయంబును నా మనోగతులు నా యిచ్ఛాభిమానంబు లా
జలరుడ్ధారికె ధారవోసినవి దుష్కాంక్షల్‌ విసర్జించి పె
ద్దలు వర్తించు పథంబునన్‌ మెలఁగు మద్దైవంబు దోడయ్యెడున్‌
120
తే.గీ.అని పలికి యందు నిలక భయంబు దొలఁకఁ
గలఁకఁ బిల్లికిఁ దొలఁగు రాచిలుక పగిది
నావలికిఁ బోవఁ దేఁటుల యావళికిని
నతనుని శరావళికిఁ దాళ కసుర గదిసి
121
చం.చెలి! నను మోవి పానకముచే వడదేర్పక మోము మోమునం
బులుమఱు జేర్చి ముద్దిడక, బాహులతాపరిబద్ధుఁజేసి న
న్నలమియుఁ గౌఁగలింపక రహస్యముగా బహుబంధవైఖరుల్‌
దెలుపక పోవనేల? యని తెంపున వేణికఁబట్టి యీడ్చినన్‌
122
చం.కలఁక దొలంగ వేదవతి గ్రక్కున బెత్తిలి యెత్తి వ్రేయుడున్‌
మలచపు వేణి నట్టనడుమందెగి చేతికిఁ దున్క చిక్కె నం
దుల కళుకొంది కైకసిసుతుం డిది దీని తపఃప్రభావ మం
చలవడియున్న నచ్చెలియు నవ్వలికిం జని క్రోధమూర్తియై
123
మ.ప్రళయాగ్నిజ్వలితేక్షణ ప్రభల నప్పౌలస్త్యునిం గాల్చు న
ట్టుల వీక్షించి, దురాత్మ! నిన్నపుడె దుష్టుం డంచు చింతించియున్‌
దెలివిన్‌ విశ్రవసుం దలంచుకొని యాతిథ్యంబుఁగావించి మా
ర్పలుకుల్‌ వల్కిన నింతయుం గలిగె నోర్వం గూడునే యింకిటన్‌
124
శా.ఘోరస్ఫార మదీయకోపదహనక్రూరార్చులన్‌ నీఱుగా
నీ రూపంబు దహింప కోర్చితిఁ దపోనిష్ఠార్థలోభంబుచే
నోరీ! నీ విపుడంటుకొన్న మెయి నే నొల్లన్‌ జ్వలద్వహ్నిలో
నీఱై నిన్‌ దునిమించు పూనికను జన్మింతున్‌ ధరం గ్రమ్మఱన్‌
125
తే.గీ.అని మహోగ్రతఁ బలికి క్రోధాగ్నితోడ
నచట యోగాగ్నియును మండునటులఁ జేసి
యయ్యెదుట నిల్చి శ్రీహరి నాత్మనునిచి
యేపు సెడి దైత్యుఁడును విన నిట్టులనియె
126
ఉ.ఏను నిజంబుగా హరిపయిన్‌ మది గల్గినదాననేని నా
పై నలినాక్షుఁ డాత్మనిడి పత్నిఁగఁ జేకొనుమాట తథ్యమౌ
నేని నయోనిజాత్వమున నిద్ధరఁబుట్టి దశాస్యుఁ బుత్త్రమి
త్రానుజయుక్తిఁ ద్రుంప నెపమయ్యెదఁగా కని వహ్నిఁ జొచ్చినన్‌
127
కం.వేదవతిమాట నిజమగు
వేదమువలె ననుచు మ్రోసె వినువీథి మహా
మోదమునఁ గుసుమవర్షము
లాదిత్యులు గురిసి రప్పు డవనీనాథా!
128
తే.గీ.యతిసుతయు నిట్లు కైకసీ సుతకృతావ
మాన పవమాన జాజ్వల్యమాన కోప
దహన సంయోగ యోగాన్ని దగ్ధయై వి
దగ్ధతా స్నిగ్ధ దైవయత్నంబు కతన
129
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju