| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | వేదవతియే మఱు జన్మమున సీతయయ్యె నని యగస్త్యుఁడు దెల్పుట |
| సీ. | తన పద్మవాసినీత్వముఁ జూపువహి లంకఁ - దోయజాంతరమునఁ దొల్తఁబుట్టె నిదె నీకు మిత్తినై యేగుదెంచితి నన్న - గతిఁ బంక్తిముఖునకే కానఁబడియె నతఁడు పెట్టియఁ బెట్టి యబ్ధి వేయించిన - నబ్ధికిఁ బుత్త్రియౌ టచటఁ దెల్పె బహుళోర్మివశమున బయలుదేఱి విదేహ - రత్నగర్భాగర్భరత్న మయ్యె | |
| గీ. | జనక జననాయకుఁడు యాగశాలఁ గట్టు చోట దున్నింప నాఁగేటి సరసఁ దోఁచి సీతయను పేరు వహియించి చెలువుఁగాంచి ప్రేమ శ్రీహరి వగునిన్నుఁ బెండ్లియాడె | 130 |
| తే.గీ. | శంఖచక్ర గదా ఖడ్గశార్‌ఙ్గ గరుడ వాహనాదులు మాని, యిక్ష్వాకుకులము ఖ్యాతి గైకొన మానవాకార మూని నట్టి నిన్నాశ్రయింతుఁ బట్టాభిరామ! | 131 |
| కం. | సాకేతనగరరాజమె వైకుంఠము నీవె హరివి వైదేహి రమా కోకస్తని యీ కపు లా నాకపులు యథార్థమిది ఘృణాగుణజలధీ! | 132 |
| కం. | కృతయుగమున వేదవతీ సతియై తపమొంది త్రేత జనకజయై తా మతిఁ దలఁచినట్టు పట్టిన ప్రతినయు నెఱివేర్చెఁ దత్ప్రభావం బసదే! | 133 |
| ఉ. | నా విని రాముఁ డద్భుతమునం గలశోద్భవుఁజూచి యీ సతిన్ రావణుఁడట్లు దొల్లియును రాయిడి వెట్టెనె? క్రోధమూర్తియై పావకులోపలం బడిన బాలికఁ గన్గొని చేష్టదక్కి వాఁ డావల నెందుఁబోయెఁ దెలియన్ వలయున్ వినిపింపుఁ డింపునన్ | 134 |
| మ. | అనినం గ్రమ్మఱఁ గుంభజుం డనియె రామా! యెయ్యెడన్ నీ వెఱుం గని దేమున్నది? యైన మా ఘనత లోకంబుల్ ప్రశంసింప న జ్ఞుని చందంబున నాలకించెదవు ప్రాజ్ఞుల్ నిచ్చ లోఁజూపులం గను నానందము నీవెకావె? విను రక్షశ్చర్య లామీఁదటన్ | 135 |
| తే.గీ. | అటుల వేదవతీకన్య యనలశిఖల జొచ్చిమ్రగ్గుటఁ జూచి యచ్చోటు వాసి చపలుఁ డప్పంక్తిముఖుఁడు పుష్పకవిమాన మెక్కికొని భూమిఁదిరుగుచు నొక్కనాఁడు | 136 |