| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రావణుఁడు జన్నంబొనర్చు మరుత్తభూపతిపైఁ దండెత్తిపోవుట |
| కం. | ఒకచో స్వాహాస్వరపూ ర్వకవివిధాజ్యాహుతి ప్రవర్ధిత కీలా ప్రకరానలధూమవ్యా పక మగు నొక సవనమండపముఁ గనుఁ గొనియెన్ | 137 |
| కం. | కని యెవ్వరి మఖమో క న్గొని రమ్మని శుకుని సారణునిఁబనుప హసా దని పోయి తెలిసి క్రమ్మఱి వినిపించిరి యిట్టులనుచు వింశతిభుజుతోన్ | 138 |
| సీ. | అవధారు జయరమాయత్తుఁడైన మరుత్తు - సర్వంసహాభర్త సవనకర్త యమరేజ్యుననుజుఁ డుగ్రమహత్త్వశాలి సం - వర్తకుండు గ్రతుప్రవర్తకుండు బలభేది శమనాంబుపతి ముఖ్యులగు వేల్పు - మన్నెవారు వహించుకొన్నవారు కశ్యపాత్రి వసిష్ఠకౌశికాదులు పుణ్య - భాజనంబులు దత్సభాజనములు | |
| గీ. | హైమమణికాంతిఁదగు శాల యజ్ఞశాల మెచ్చినాఁడు హరుండర్థ మిచ్చినాఁడు విప్రయోగంబు మునులచే సుప్రయోగ మైనదని వారు దెల్పఁగా నాలకించి | 139 |
| శా. | ఆహా! నా యెదుటన్ మఖం బొకటి సేయం బూనెనే వెఱ్ఱి యా బాహాజన్ముఁడు? విఘ్న మెట్లొదవదో భాగంబు లె ట్లందఁగా నూహల్ సేసిరొ? చూత మీ సురలటం చుగ్రాహవక్రీడనో త్సాహశ్రీ వహియించి యచ్చటికి దైత్యస్వామి యేతేరఁగన్ | 140 |
| సీ. | నమ్మియున్నను గ్రమ్మిదొమ్మి సేయు నటంచు - నెమ్మిరూపు సురాధినేత దాల్చె నాఁకొన్న హరి ఢాక చేకొన్నవాఁడంచు - గాకవైఖరి దండకరుఁడు బూనె మించినాఁడితఁ డాక్రమించి యేమెంచునో - యంచు నంచ విధంబుఁ గాంచె వరుణుఁ డొండు చూడండు మూర్ఖుండు మండునటంచుఁ - దొండయై గండాఱియుండె ధనదుఁ | |
| గీ. | డితరు లాతురులై జాతిహీనరూప ధారులై పాసి రంత నద్దశముఖుండు దారుణాకారుఁడై మరుత్తక్షితీంద్రు కట్టెదుట వచ్చి నిలుచుండి యిట్టు లనియె | 141 |
| కం. | ఓయి మరుత్తక్షితివర! యే యుద్ధాపేక్ష నిచటి కేతెంచితి నా తో యుద్ధమైనఁ జేయుము వేయేటికి వెఱచితేని వెఱచితి ననుమా | 142 |
| మ. | నను నీ రాజుల లీలఁ జూడవల దన్నన్ నవ్వుతో నమ్మరు త్తనృపాలాగ్రణి శత్రుకోటికుల గోత్ర ప్రాభవాచారముల్ వినకే యుద్ధము సేయ, నెవ్వఁడవు? నీ వృత్తాంత మాద్యంతమున్ వినఁ గాక్షించెదఁ దెల్పు నావుడు మరుద్విద్వేషి గర్వంబునన్ | 143 |
| మ. | విను ముర్వీశ్వర! నేఁ బులస్త్యకులుఁడన్ వేధోవరోద్యత్ప్రతా పనిరూఢుండ దశాస్యనామకుఁడ మద్భ్రాతన్ ధనాధీశు ము న్ననిలో గెల్చి విమానముంగొని త్రిలోకాతీతమాహాత్మ్య మొం దినవాఁడన్ రణభిక్ష యిమ్మనినఁ బృథ్వీనాయకుం డిట్లనున్ | 144 |
| చం. | అవుర! మఱేమి నీ మహిమ లన్నను గెల్చితి నన్నమాట వి న్న విశదమయ్యె నాయన ధనం బగు పుష్పకమున్ గ్రహించినాఁ డవు బళి! యింట గెల్చికద డయ్యక రచ్చల గెల్వఁబోవలెన్ భువనములందుఁ గీర్తియును బుణ్యము దీన సమృద్ధిఁ జెందవే? | 145 |
| ఉ. | ఇంతటి ధర్మశాలి నిఁకనెవ్వ రెదుర్కొని గెల్చువారు? ర మ్మంతప్రియంబు గల్గినటులైన రణం బొనరింప నేనె ని న్నంతకు చెంతకుం బనుతు నంతకు నేఁదగువాఁడ నంచు నం తంతకు రోస మీసు బెరయన్ ధరణీశుఁడు లేచెఁ జెచ్చెరన్ | 146 |
| మ. | శరచాపంబులు పూని వజ్రకవచస్ఫారప్రభల్ భూనభోం తరముల్ నిండ నజాండఖండనసముద్యచ్ఛింజినీ నిస్వన స్ఫురణన్ రాజ దశాస్యుపైఁజనఁగ నచ్చో నడ్డమై “ధారుణీ శ్వరచూడామణి! పోకు పోకు”మని సంవర్తుండుదాత్తధ్వనిన్ | 147 |
| చం. | పలికె బళా! మఱేమి! మది భాసిలదీక్ష వహించి శత్రుపై నలుగుట నాయమే? యిది మహాక్రతు వించుక విఘ్నమైనచోఁ గులము నశించు నద్దశముఖుండును దుర్జయుఁడేల వానితోఁ జల ముపసంహరింపు పరుషత్వము నా విని యమ్మరుత్తుఁడున్ | 148 |
| శా. | ఆ సంవర్తునిమాటఁ జేకొని పరిత్యక్తాస్త్ర కోదండుఁడై యీసున్ రోసము నుజ్జగించి చన దైత్యేంద్రుండు వీక్షించి నా తో సంగ్రామము సేయ నోపక మరుత్తుండోడెఁజుండీ యటం చాసన్నాద్రిగుహావళుల్ బదులు మ్రోయన్ బెట్టు చాటింపుచున్ | 149 |
| ఉ. | అమ్మఖశాలఁజొచ్చి కుపితాత్మకుఁడై మునికోటిఁద్రుంచి యూ పమ్ములు పెల్లగించి పశుపంక్తి హరించి, ఘృతంబు వహ్నికుం డమ్ముల నించి హోతల నడంచి యహో! తలమంచు యాజకుం డమ్మెయిఁబల్క నొక్కగతి నక్కడఁబాసి చనెన్ బలంబుతోన్ | 150 |
| కం. | హరిహయముఖ్యులు భయములు గిఱికొన శిఖికాకహంసకృకలాసగతుల్ ధరియించి యమ్మహాపదఁ దరియించి తదీయహితముఁ దలఁచి ప్రియోక్తిన్ | 151 |
| సీ. | కన్ను లీఁకలఁ జంద్రకములుగా ఘనవేళ - నెమ్మిగా బలవైరి నెమ్మి కొసఁగె బెద్దకాలము మన్కి ప్రేతాత్మకత భుక్తి - గలుగఁగా జముఁడు కాకమున కొసఁగెఁ బాలును నీరు నేర్పఱచు నేర్పుఁ బయోవి - హారంబు నుదధీశుఁ డంచ కొసఁగెఁ దల వెండివలె నుండఁ దనువు బంగరుఁజాయఁ - దులకింప ధనరాజు తొండ కొసఁగెఁ | |
| గీ. | నివ్విధంబునఁ దమదమ యెలమికిఁదగు వరము లజ్జంతువుల కిచ్చి వారు సవన భాగముల్ గొనిపోయి రప్పార్థివుఁడును మఖము నెఱవేర్చె సంవర్తమౌనికరుణ | 152 |
| చం. | అటుల మరుత్తభూవిభుని యజ్ఞధరాస్థలిఁ బాసి యార్చుచున్ బటహమహార్భటుల్ దిశలు బ్రద్ధలు సేయ నజయ్యుఁడై ధరా విటులఁ బరాక్రమోద్భటుల వీఁక నెదుర్చుచు నోపమన్నచో నటఁ దన గెల్పుఁ దెల్పుచు దశాస్యుఁడు ద్రిమ్మరె భూమియంతయున్ | 153 |
| సీ. | పరిపంథిమదతమః పంకజన్యధిభూవి - భుండైన దుష్యంతభూవిభుండు వైరిరాజప్రాణవాయుభుగ్భుజభుజం - గాధిరాజై మించు గాధిరాజు హరిశౌర్యఘటితాఖిలారివీరమృగాప - హరణాజిమృగయుఁడై యలరు గయుఁడు శత్రుహృద్భేదనక్షమచక్ర దీర్ఘఘ - ర్ఘర ఘోషసురథుఁడై క్రాలు సురథుఁ | |
| గీ. | డహిత నుత చారుగౌరవుండగు పురూర వుండు మొదలైన నృపపుంగవులు మహోగ్రుఁ డౌదశాస్యునితోడఁ బోరాడలేక నోడితిమటంచు వచియించి రోహటించి | 154 |