| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | దశగ్రీవుఁ డనరణ్యనృపునితోఁబోరి జయించిన కథ |
| తే.గీ. | ఏమి దెలిపెద నింక శ్రీరామచంద్ర! యొక్క నృపుఁడైన నెదిరింప నోపఁడయ్యె రావణాసురుపై ననరణ్యనృపవ రేణ్యుఁ డొకరుండు దాఁకె నిర్భీకుఁ డగుచు | 155 |
| ఉ. | ఆ వివరంబుఁదెల్పెద దశాననుఁడిట్టుల నెల్లరాజుల న్లావు దొఱంగఁజేయు చొకనాఁడు బలాన్వితుఁడై యయోధ్య కెం తే వడినేఁగుదెంచి ‘పఱతె మ్మనరణ్యనృపాల! పోరికిన్ నీ విపులప్రతాపము గణింతురు దిక్కుల శూరు లందఱున్ | 156 |
| కం. | అనుమాన మేల? వెఱిచిన ననుమా యోడితి నటంచు ననుమాట చుఱు క్కున మానవపతి చెవి సొర ఘనమానము రోస మీసుఁగనఁబడ ననియెన్ | 157 |
| ఉ. | ఏల దురుక్తులాడె దసురేశ్వర! మమ్మెదిరించి పోరఁగాఁ జాలుదువేని ద్వంద్వమునఁ జక్కఁగ నిల్వుము పిల్కుమార్చెదన్ బేలతనంబుతో ఘనులు పెద్దఱికంబు గణించుకొందురే? యాలములోపలం దెలియు నందఱ బీరము లంచుఁబల్కుచున్ | 158 |
| సీ. | పృథ్వీస్థలం బెల్లఁ బెల్లగింపఁగఁ జాలఁ - బెంపొందు రథములు పెక్కు వేలు ఘనగాత్ర మహిమ నాకాశమెత్తెడు భంగి - బెడఁగైన యేనుఁగుల్ పెక్కు వేలు చక్రవాళమునైనఁ జక్కదాఁటెడుధాటి - బెరయు ఘోటకములు పెక్కువేలు కల్పాంతభైరవాకారులై శూరులై - బిరుదులందిన భటుల్ పెక్కువేలు | |
| గీ. | మిక్కుటపు వీఁక దిక్కులఁ బిక్కటిల్ల నొక్కమొగిఁ దన్నుఁ గొల్వఁగా నుక్కుమీఱి కదనమున కాయితం బయి కదలిపోయె రావణుని మీఁద మన యనరణ్యనృపతి | 159 |
| కం. | ఆ విభుని సైన్యపతులకు రావణు సైనికుల కుగ్రరణ మయ్యెఁ ద్రిలో కీవిస్మయావహోద్ధతి దేవాసురయుద్ధమైన తెఱఁగున నధిపా! | 160 |
| మ. | దనుజుల్ నీలశిలోచ్చయోచ్చతను లుద్యద్బాహు లుగ్రాశని ధ్వను లొక్కుమ్మడిఁ జుట్టుముట్టి భటమస్తంబుల్ రథాంగంబు ల శ్వనికాయోదర పార్శ్వముల్ కరటిహస్తంబుల్ విదారించి య య్యనరణ్యాధిపుసేన గాడుపు లరణ్యానిన్ బలెం గూల్చినన్ | 161 |
| సీ. | పడగలు గొడుగులు పావడల్ వీచోపు - లొండింటిపై వ్రాలియుండు నెడలుఁ దొడలును మెడలు చేతులు గాళ్ళు వ్రేళ్ళు ప్ర - క్కలు డొక్క లొకప్రోఁగుఁ గన్న యెడలు నరము లెమ్ములు క్రొవ్వునంజుడు మెదడు ప్రే - వులు నెత్తు రొక్కటై కలయునెడలు హారకుండల కిరీటాంగుళీయకకంక - ణాంగదాదులు చూర్ణమైన యెడలు | |
| గీ. | బహువిధాయుధశకలముల్ పడినయెడలుఁ గలిగి పలలాశనోత్సవకారి యగుచుఁ దన బలము నేలపాలైన యునికిఁజూచి యలిగి యనరణ్యభూపాలుఁ డౌడుగఱచి | 162 |
| చం. | కరమున విల్లుఁబూని లయకాలకృతాంతుని లీల మౌర్విటం కరణము దిక్కరిశ్రవణఘట్టనముల్ ఘటియింపఁదేరు స త్వరముగ సూతుఁడున్ నడపఁ దన్నెదిరించినఁ జూచి పంక్తికం ధరుఁ డనరణ్యునిం బెలుచ నవ్వుచు నీసు వహించి యిట్లనున్ | 163 |
| తే.గీ. | ఆఁకలియు దప్పిగొన్న నరాదు లాహ రింప నరసేనఁ దెచ్చి యర్పించినటుల చటులమామకశర శిఖిజ్వాలికలకు నిన్నొసఁగ వచ్చితే? యన్న నృపుఁడు గదిసి | 164 |
| చం. | దనుజుఁగిరీటముల్ పదియుఁదాఁక ననేకశరంబులేసి యా ర్చిన శతశాతబాణములచే దశకంఠుఁడు రాజు నొంచి యా తని విలుఁ ద్రుంచి సారథివధంబొనరించి హయాంగముల్ దళిం చిన రథహీనుఁడయ్యుగదఁ జేకొని శత్రుని మోదె మోదినన్ | 165 |
| తే.గీ. | దండతాడిత ఫణిరీతి దశముఖుండు పుడమి కుద్ధతి లంఘించి బిడుగుఁబోలు కఱకుటఱచేతఁ దన మస్తకంబు వ్రేయ వాయుహతసాలలీల భూవరుఁడు గూలె | 166 |
| ఉ. | అగ్గతి నేలఁగూలిన ధరాధిపుఁగన్గొని పంక్తికంఠుఁడున్ బెగ్గిలఁగేక వేసి నగి బీరము లాడితి విప్పు డింతలో డగ్గెఱనోటు మృత్యు వెచటన్ నను గెల్వఁగ నెవ్వఁడోపు? నీ సిగ్గిటు సేసె - నోటమి వచించిన నిద్దురవస్థ వచ్చునే? | 167 |
| చం. | అని తనుఁ దూలనాడిన జనాగ్రణి గన్నులు విచ్చి దైత్యునిం గనుఁగొని నన్ను నీ విపుడు గాఱియఁబెట్టిన నేమి? మీఁదటన్ నిను వధియించు నొక్క మహనీయచరిత్రుఁడు మత్కులంబునన్ జననమునొందు వట్టి పరుషంబులు వల్కకు పొమ్ము రావణా! | 168 |
| చం. | పురుషుఁడు కర్మ సంగమునఁ బొందు సుఖంబును దుఃఖ మెవ్వ రె వ్వరికి విరోధముల్ సలుపువా రిది దైవవశంబు దీనఁ గా తరత వహింప నేఁ గనకదానమఖాధ్యయనాదికర్మముల్ వొరసితినేనిఁ బల్కుపొలివోవక యట్లగుఁగాక యం చనన్ | 169 |
| కం. | మించిన తమిని సురల్ గురి యించిరి మందారవృష్టి యిది నిజమని మ్రో యించిరి పణవాదులు నుతి యించిరి యనరణ్యనృపతి ధృతి విభవంబుల్ | 170 |
| చం. | అది సహియింప కచ్చెడు గహంకృతితో నిటువంటి సత్త్వమే కద నిను నింత సేసెఁ దుదిగాంచియు వైరము మానవంచు బ ల్గదఁగొని మస్తకమ్ము వగులన్ వడినొంచి జయంబుఁగాంచి స మ్మదము వహించి యేఁగె నను మౌనికి నవ్వుచు రాముఁ డిట్లనున్ | 171 |
| కం. | అరి నోర్వఁజాలు వీరులు ధర నెక్కడలేరొ? వీరధర్మము సెడెనో? నరపతుల శౌర్యధైర్య స్ఫురణ లిటుల నేలఁ గలసిపోనేమిటికిన్ | 172 |
| వ. | అని పలికి యంత నిలువక | 173 |
| మ. | అకటా! సూర్యశశాంకవంశ్యులగు బాహాసంభవుల్ నొచ్చిరే? స్వకరాస్త్రంబులు హానిఁ జెందెనె? మనస్సంపన్నతల్ గుందెనే? యొకఁడైనన్ రిపు నొంపకున్నకత మేమో? విన్న వింతయ్యెడిన్ సకలస్తుత్యతపఃప్రభావనిధి! యీ సందేహముం దీర్పవే! | 174 |
| కం. | నా విని లోపాముద్రా జీవితనాయకుఁడు నగుచు క్షితికన్యాదృ గ్జీవంజీవహితానన జైవాతృకుఁడైన రామచంద్రున కనియెన్ | 175 |
| మ. | తనచే నిర్జితుఁడైన శాత్రవుని దోర్దర్పంబుఁ గీర్తించినన్ విని సంతోషముఁ జెందు నెట్టిఘనుఁడున్ విశ్వావనీశాగ్రణీ! హననం బోర్వక వాని యోటములె నీ వాలింపఁగాక్షించె దెం తని వర్ణించెద నీ గుణస్ఫురణ రామా! రాజచూడామణీ! | 176 |