ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుఁడు కార్తవీర్యార్జును గెలువఁబూనిన కథ
రావణుఁడు కార్తవీర్యార్జును గెలువఁబూనిన కథ
కం.అశ్రమమున ధరఁదిరుగుచు
విశ్రవసు సుతుండు కార్తవీర్యార్జునవా
ర్ధశ్రవసాదుల కోడిన
విశ్రుతకథలు గల వవియు వినుమని పల్కెన్‌
177
శా.ఆ హంసోన్నతవజ్రసౌధరుచి సౌధాంభోధి దివ్యాపగో
ద్వాహోపక్రమసూచకోపరిచరత్పాండుచ్ఛదగ్రామణీ
సాహస్రచ్ఛదనిస్సృతాంబుకణ చంచన్మౌక్తికస్తోమమై
మాహిష్మత్యభిధానపత్తనలలామం బొప్పు భూమీశ్వరా!
178
శా.ఆ ప్రో లర్జునచక్రవర్తి కృతవీర్యక్షోణిభృత్‌క్షీరవా
ర్ధిప్రత్యక్షశకాంకమూర్తి నతదారిద్య్రార్తివిచ్ఛేదనో
ద్దీప్రక్షిప్రదయానువర్తి ద్విచతుర్దిగ్దంతిరాడ్దంతకాం
తిప్రద్యోతితకీర్తి యేలు నెపుడున్‌ దేవేశ్వరస్ఫూర్తితోన్‌
179
సీ.అనవద్యబాహా సహస్రముల్‌ దన చక్ర - భావమంతయు బట్టబయలు సేయ
నణిమాది విభవంబు లల్ల దత్తాత్రేయ - గురుకృపఁ దను ముంచుకొనుటఁదెలుప
సంతతౌదార్య మష్టాదశద్వీపంబు - లేలెడి తన కల్మి నెఱుకవఱుప
దక్షిణ నాయకత్వమనేక సతులతో - విహరించు తన నేర్పు విస్తరింప
 
గీ.సార్వభౌమలలాముఁడై జగతియేలె
నప్రతిహత ప్రతీపబాహాప్రదీప్త
దావపావకకీలికాదగ్ధదుర్జ
నార్జునుండగు కార్తవీర్యార్జునుండు
180
కం.ఆ సార్వభౌముఁడమితవ
శాసంగతసార్వభౌము చందమున బహు
స్త్రీ సంయుతుఁడై యొకనాఁ
డాసన్నసరిద్విలోకనాదృతిఁ జనియెన్‌
181
మ.చని వింధ్యాచలసార్వభౌమనికటాంచన్నర్మదాతీరభా
గ్వన సౌభాగ్యము మెచ్చి హైహయధరావజ్రాయుధుం డంగనా
జనతానేకవిధాంగసంపదలతో సామ్యంబులౌ వస్తువుల్‌
గనుఁగొంచున్‌ లతకూనలన్‌ దొరసి వేడ్కల్‌ సెందెఁ జైత్రుంబలెన్‌
182
శా.తత్కాలంబున రావణాసురుఁడు దైత్యగ్రామణుల్‌ గొల్వ ను
ద్యత్కౌబేరవిమాన మెక్కికొని యుద్ధాపేక్ష రా సర్వభూ
భృత్కోటీర కిరీటరత్న నికరాభీలద్యుతి ప్రస్ఫురత్‌
పత్కంజద్వయుఁడర్జునుం డనెడి వార్తల్‌ భూమిలో మించినన్‌
183
కం.అతిరోషంబున మాహి
ష్మతికిం జని రావణుండు సమరస్పృహ వ
చ్చితి నా యాగతి మీ యధి
పతికిం దెల్పుఁడన సార్వభౌముని మంత్రుల్‌
184
వ.అతనితో నిట్లనిరి185
సీ.బలువేసడములపై బండ్లపైఁ బ్రబలోష్ట్ర - పంక్తిపై ముందుగా బరువు లేఁగఁ
దదనువర్తనలీల దారుణాయుధరుచుల్‌ - దులకింప సుభటముఖ్యులు సనంగ
రథిక హాస్తిపక తౌరంగికుల్‌ వలగొని - మేడెమై కనుఁజూపుమేర నడవఁ
జెంతల నెవ్వారిఁజేర రానీయక - బహుకంచుకులు బరాబరులు సేయ
 
గీ.నవ్యపల్యంకికారోహణము లొనర్చి
రాణివాసపు సతులు పార్శ్వములఁ గొలువ
భద్రగజమెక్కి మారాజు ప్రాభవమున
నర్మదాతీర వని కేఁగినాఁడు నేఁడు
186
శా.నేఁడే వచ్చునొ రేపెవచ్చునొ వనిన్‌ స్త్రీయుక్తిఁ గ్రీడించుచున్‌
రాఁడో రాజుల చిత్తముల్‌ దెలియునే! రక్షఃకులాధ్యక్ష! యె
వ్వాఁడున్‌ మాపురిఁజేరి నీకరణి గర్వస్ఫూర్తి నిట్లాడగా
లేఁ డుగ్రుండవతండు వచ్చినను బాళిన్‌ రమ్ము మేలౌననన్‌
187
శా.ఆ మాటల్‌ విని నవ్వి పంక్తివదనుం డౌరౌర! యీ బూమెలే
లా? మీ యేలిక నా ప్రయాణకథ యెల్లన్‌ విన్నవాఁడై వధూ
స్తోమంబుంగొని డాఁగ నేఁగె రణభీతుంజేరి పోరాడునే
భూమిన్‌ రావణుఁడంచు వారి నగుచున్‌ బోయెన్‌ మదోద్రేకియై
188
తే.గీ.ఇటులు మాహిష్మతీపురాధీశుఁగాన
కసుర యచ్చోటు వాసి సైన్యముల డాసి
యల ప్రహస్తుండు మొదలైన యఖిలమంత్రి
పుంగవులు గొల్వ నవ్వలఁ బోయిపోయి
189
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju