| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | దశగ్రీవుండు తన సేనలతో వింధ్యాచలంబున కేఁగుట |
| మ. | అవలోకించె దశాననుం డెదుట దివ్యస్త్రైణవీణారవ శ్రవణోల్లాసరసోన్నమత్ఫణి ఫణారత్న ప్రభాలాత భీ తివిధావత్తటకుంభి ఘీంకృతి రటద్దీవ్యద్గుహాయాతమౌ నివరారక్త జటాంశుకింశుకఘృణి న్వింధ్యా చలగ్రామణిన్ | 190 |
| వ. | కని, యక్కొండ చక్కటికిఁ జక్క నరిగి, సుర గరుడ గంధర్వాది దేవతా మిథునంబులనిధువనంములకుం దగు పృథువనంబులలోఁ, దరలనియిరుల కిర వగు తోరంపుటీరంపుగుంపులఁ బెంపు గనుమవ్వంపుదివ్వెలవలె నివ్వటిల్లు నిగనిగను మణులకై కెరలుమధుకరనికరంబుల గరుల తెమ్మెరలవలనఁ జలనంబు నొందు నలరులయం దుండియుం దొరంగు మరందధారా బృందంబు వాఁకలం గలసి ప్రవహించు సెలయేటి నీటితుంపరలన్ దొరసి, మందగతులం దిరుగుమంద పవనంబులం దార్కొని, యావటించు సానుచరద్భుజంగ సంఘమ్ముల ఫూత్కారంబులన్ బెగడువడి, నిగుడం బరువు లిడుతమ పడుచుల జడుపు దీర్చుట కెదురువచ్చు తబిసి పెద్దల కటితటీరమణీయతర వ్యాఘ్రచర్మంబులడంబుఁ గని, తల్లడంబునం గ్రేళ్ళుఱుకు కన్నె లేళ్లకు మొల్లంపుఁబచ్చిక లనుమచ్చిక లెచ్చరించు పచ్చఱాగనుల చెంగటం గనుపట్టునీలరత్నాకరంబుల విభాక దంబంబు లంబుద నికురుంబంబు లనియుఁ, దదుపరి ప్రద్యోతితజ్యోతిర్ల తావితానంబులు తటిల్ల తాప్రతానంబు లనియు నెంచి, యౌఁగా దని పన్నిదంబులు సఱచి, పఱతెంచి పరికించి, మృషయైన నోడినవారిఁ గేరడంబు లాడు చెంచుమించుఁ బోఁడుల కరాంచలశరాసనోన్ము క్తదురాసదశరా సారంబులం బగిలిన వేణువుల నుండి రాలుమెఱుంగు ముత్తియంపుఱాలు దందశూకాంకాండంబు లని ఖండింపం దివురుశిఖండిప్రకాండంబుల విప్పు గలకప్పుఁబించెంముల నొప్పు సాంద్రతర చంద్రికాద్యోతు లింద్రచాపద్యుతులని చరించు రాయంచల చంచూపుట చరణారుణ ప్రభాన్ఫురణంబులం గౌఁగిలించు జేగుఱులతోఁ గరంబు మీఁ టగుకూటఝాటంబులం గ్రీడింపుచు, నప్పం క్తికంధరుండు | 191 |