ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుఁడు నర్మదం జేరి తత్సైకతంబున శివపూజ సేయుట
రావణుఁడు నర్మదం జేరి తత్సైకతంబున శివపూజ సేయుట
మ.అచలోపాంతమునం గనుంగొనియెఁ దుంగాభంగభంగానిలా
భ్రచరత్ఖేచరబాలికాతిలకభాక్ఫాలస్థలీఘర్మదన్‌
బ్రచురస్నాతకశర్మదన్‌ స్వమహిమప్రధ్వస్తనానాసరి
త్ప్రచయాంతర్మద నర్మదన్‌ జలగళద్దంతావళోచ్చైర్మదన్‌
192
మ.కని కోయష్టిక చక్రసారస బకక్రౌంచాది నానాఖగ
ధ్వనులన్‌ వీనులుఁ జంచదూర్మిలులితావర్తేక్షలం గన్నులున్‌
వనజాతోత్పల సారసౌరభములన్‌ నాసల్‌ తదీయానిలం
బున మేనున్‌ సఫలత్వమొంద దితిభూమూర్ధన్యుఁ డుత్సాహియై
193
కం.అత్తటినిఁ జేరఁ బోయి వి
యత్తటినికి సాటియైన దౌరా! యనుచున్‌
ప్రోత్తుంగం బగు తటమున
హత్తివలె వసింపఁగని ప్రహస్తుఁడు వలికెన్‌
194
చం.జలశకునాకులచ్ఛకుల జాలవిలోల విలోకనంబులన్‌
జళు కెఱిఁగింపుచున్‌ గమలషండచలత్కలహంసికాగరు
చ్ఛలవసనాంచలంబునఁగు చాయితకోరకపాళిఁగప్పుచు
న్బలియుఁడవైన నీ యెదుట నర్మద సాధ్వి తెఱంగుఁబూనెడిన్‌
195
చం.తన విమలోదకంబుల సుధామధురత్వము ఫేనయుక్తమౌ
తన సికతాతలంబున సితప్రభయుం దను నాశ్రయించు చా
డ్పున ననవద్యశైత్యమును బొల్పుగ నిన్నది తండ్రి పోలిక
ల్గనియు నడంచెఁ గ్రిందనె కళంకము కర్దమకైతవంబునన్‌
196
మ.జలపానాగత సింహభీతసలిలస్తంబేరమస్తోమ సం
చలనోపద్రవధావదుగ్రకమఠీ శంక్వాదికేతస్తతో
వలనానచ్ఛఘనప్రవాహయగు ఠేవందోఁచు మాలిన్య మీ
జలజాప్త ప్రతిబింబ మొందెఁ జనునే సంసర్గదోషం బిలన్‌
197
మ.అరుణాబ్జద్యుతి నీ ముఖద్యుతులచే నత్యున్నతోర్మిచ్ఛటా
గరిమల్‌ నీ కర పంక్తిచే శకునరేఖల్‌ నీ యశశ్ఛాయచే
హరియింపంబడె నంచు నిన్నుఁ బొగడెన్‌ హంసార్భటిన్‌ వార్ధిరా
ట్తరుణీరత్నము వింటివే యసురచంద్రా! యన్న లేనవ్వునన్‌
198
చం.అవునని మంత్రితోఁ బలికి యందఱిఁజూచి యహస్కరుండు నా
యవిరళకాంతికిన్‌ వెఱచి యంబరమధ్యగుఁడయ్యెఁ జల్లనై
కువలయబంధు పోల్కిఁ గనుఁగొంటిరె? యిన్నదిఁగ్రుంకి యిందఱుం
బువులిఁకఁగోసి తెండు శివపూజకటంచు దశాస్యుఁ డంచినన్‌
199
ఉ.స్వామి! హసా దటంచు శుకసారణముఖ్య సమస్త సైనిక
గ్రామణు లమ్మహానది తరంగము లుద్దరు లావరింపఁగా
సామజపుంగవస్ఫురణ స్నానము లాడి దుకూలధారులై
యా మహనీయవన్యల సుమాపచయం బొనరించి రందఱున్‌
200
సీ.తొఁగలు గెందమ్ములు దుమ్మిపూ లబ్బెండ - పువ్వులు పొన్నలు పొగడ విరులు
సన్నజాజులు సురపొన్నలు గలిగొట్లు - మల్లెలు సంపఁగెల్‌ మొల్లవిరులు
బొండుమల్లె లశోకములు మంకెనలు నంది - వర్ధనంబులు విరవాదివిరులు
గోరంటలును గొండగోఁగులు దేవకాం - చనకుసుమములు గొజ్జంగ విరులు
 
గీ.మాచిపత్రియుఁ గురువేరు మరువకంబు
దవనమును గగ్గెరయు బిల్వదళము లాది
యైన పూజార్హవస్తువు లపుడు దెచ్చి
వంతులకుఁ గొండపొడువుగా వైచుటయును
201
మ.పరితోషించి శివార్చనాకుతుకసంబద్ధాత్ముఁడై లేచి యా
శరమూర్ధన్యుఁడు నర్మదాతటినిలో సంకల్పపూర్వంబుగా
స్మరవైరిన్‌ స్మరియింపుచున్‌ మునిఁగి తన్మంత్రంబు వేమా ఱభం
గురనిష్ఠన్‌ జపియించి వెల్వడి మడుంగుల్గట్టి నేమంబునన్‌
202
కం.ఏకతమున శుచియగు నొక
సైకతమున నధివసించి స్మరణప్రాప్తం
బౌ కాంచనమయలింగముఁ
జేకొని ప్రాణప్రతిష్ఠ సేసి నునిష్ఠన్‌
203
సీ.ఆవాహనము వృషభాధివాహనునకు - నాసనం బద్రిశరాసనునకు
నర్ఘ్యంబు విషధరానర్ఘ్యభూషణునకుఁ - బాద్య మాగమశిఖాపాద్యునకును
గలితామృతాభిషేకం బమృతాత్మున - కంబరం బతుల దిశాంబరునకు
యజ్ఞోపవీతంబు యజ్ఞాభియాతికి - గంధంబు విషరమ్యగంధునకును
 
గీ.హారిధవళాక్షతలు సంగరాక్షతునకు
నర్పణమొనర్చి తత్సహస్రాభిధాన
ములను బంచాక్షరీమంత్రమునను నమక
మునను రుద్రియమున విరుల్‌ పూజ చేసె
204
తే.గీ.అమ్మహాపూజ గొనసాగినట్టులైన
సంగరంబున గెల్చు నే శత్రునైన
విఘ్న మొందిన నోడు నవ్విధము మత్త
చిత్తుఁడౌట గణింపక చేయఁదొడఁగె
205
కం.ఇరువది చేతుల శంభునిఁ
బరిపూజన సేయుచుండి పంక్తిముఖుం డోం
హరహర హరహర హర! యోం
హర! యని పదినోళ్ళఁ బలుకు నంబర మద్రువన్‌
206
కం.కదలని గాత్ర మొకించుక
వదలని పద్మాసనము శివానాథునిపైఁ
జెదరని తలఁపును జలనము
గదురని చూడ్కులును బంక్తికంఠునిక తగున్‌
207
తే.గీ.ఈ విధంబున నమ్మహాశైవతిలక
మలికనయనుని నయ్యేటి కెలన నుంచి
యంచితప్రీతిఁ బూజఁగావించుచుండె
నంత నక్కడఁ గార్తవీర్యార్జునుండు
208
సీ.చిగురులు గిల్లుచోఁ జిగురులు దమకేలుఁ - జిగురులు రక్తితోఁ జెలిమి సలుపఁ
బువ్వులు గోయుచోఁ బువ్వులు దమనవ్వుఁ - బువ్వులు తెలివిమైఁ బొత్తుసేయ
లతికలు సేరుచో లతికలు దమతనూ - లతికలు మృదురీతులను బెనంగఁ
దేనియల్‌ వడియుచోఁ దేనియల్‌ దమమోవి - తేనియల్‌ రుచుల పొందికలఁ జెంద
 
గీ.మాటలాడుచుఁ బాడుచు మందమంద
గమనములఁ గామినీమణుల్‌ గలసిమెలసి
వనవిహారంబు గావింప వారిఁగూడి
యలరె నవమన్మథునిలీల నర్జునుండు
209
మ.పరితస్స్రస్తలతాప్రతానము, పృథగ్భగ్న ప్రవాళచ్ఛదో
త్కర మారాన్నిపతద్ద్రుమంబు, యుగపద్ధావత్ఖగం బంజసా
చరదిందిందిర మగ్రతఃప్రవిచలచ్ఛాఖానికాయంబునై
ధరణీనాథవధూవిహారముల నుద్యానంబు గాసిం బడెన్‌
210
వ.అప్పుడు211
మ.శ్రమతోయార్ద్రకపోల మంసగళదంచన్మాల్య మామ్లానగా
త్ర మసహ్యావృతకంచుకం బళికమధ్యస్థాలకం బానతా
స్య ముదారోచ్ఛ్వసనాకులంబు నగు స్వస్త్రైణంబుతో హైహయుం
డమరీయుక్త బలారి యట్లరిగె రేవాంభోవిహారస్పృహన్‌
212
తే.గీ.అరిగి పశ్చిమవాహినియైన యమ్మ
హాతరంగిణి బాహుసహస్రమునను
గార్తవీర్యార్జునుం డడ్డుకట్టి శశిము
ఖీసహస్రంబుతో జలక్రీడలాడె
213
వ.అప్పుడు214
లయగ్రాహిపొంచుచు వయస్యల గ్రహించుచుఁ దదంగములు - వంచుచుఁ దరంగముల ముంచుచుఁ జలంబుల్‌
వెంచుచు నొకళ్ళొకరి మించుచు సరోజములు - ద్రుంచుచు ముఖాబ్జముల నించుచుఁ దొఁగల్‌ ప్రా
పించుచు రథాంగులఁగలంచుచు మరాళములఁ - గాంచుచుఁ దమిం బొదువఁ నెంచుచుఁ బతిం బ్రా
ర్థించుచు జలేభులకుఁ గొంచుచు ఖగాళి బెద - రించుచుఁ జెలంగిరి హసించుచు లతాంగుల్‌
215
సీ.సార్వభౌముని నొక్కసతి పద్మముల వైచి - పద్మముల్‌ దగు నని పరిహసించెఁ
జక్రవర్తి నొకర్తు సక్కని కువలయం - బుల ముంచి యివి నీకుఁ బోలు ననియె
రాజుపై నొకతె కైరవిణీముఖోదార - మధుధారఁ జిలికి నర్మంబు లాడె
నర్జును మేనొక్క యతివ బాహావల్లి - కలఁజుట్టి యౌచిత్యగరిమఁ దెలిసె
 
గీ.గట్టివా యొక్కతె సహస్రకరుని మీఁదఁ
దఱచు గార్కొను శైవాలతమము నించి
తలఁప నిది యొక్కటియె యయుక్తం బటంచు
విభుఁడు చిఱునవ్వు నవ్వ నవ్వించె సఖుల
216
కం.మాహిష్మత్యధినాయకు
బాహాసేతువునఁజిక్కువడి కరతోయా
వాహిని కడు సుడివడియెన్‌
సాహసిచేఁ బట్టువడిన సతి చందమునన్‌
217
మ.పదదభ్రంకష తీరభూమిరుహయై ప్రాదుర్భవత్ఫేనయై
హతనాళీకమృణాళనాళయయి భీతాంభశ్చర వ్రాతయై
కృతవీర్యాత్మజు బాహురోధమునఁ బైకిం బొంగి రేవాసర
స్వతి ప్రాగ్వారిధి చాయకున్‌ మరలెఁ జంచత్తుంగ భంగార్భటిన్‌
218
మ.గిరినైనం దెగఁ గోసి మత్తహరిమాడ్కిం బాఱునయ్యేఱు భూ
వరదోః స్తంభవిజృంభముం గడచిపోవన్‌ బల్మి లేకట్టె స
త్వరయై క్రమ్మఱ వచ్చి పంక్తిముఖకప్తస్వర్ణలింగార్చనా
స్ఫురితద్రవ్యములెల్ల ముంచుకొనియెన్‌ బ్రోద్యత్ప్రవాహోద్ధతిన్‌
219
మ.తను రోధించె నృపాలకుం డతనిపై దండెత్తి పొ మ్మేటి పూ
జన లిచ్చోనని చంచదూర్మి నినదచ్ఛద్మంబునన్‌ బల్కుచున్‌
వినకున్నన్‌ నది మించి ముంచెనొ యనన్‌ విఘ్నంబు పూజావిధిన్‌
మొనయన్‌ దానవచంద్రుఁ డద్భుతరసాంభోరాశిమగ్నాత్ముఁడై
220
మ.చరమాంభోనిధి చెల్మి యేల యనుచుం జాలించి పూర్వాంబుధిన్‌
దొరయం బోయెడినో తరంగిణి? యిదెందుం గాన మంచున్‌ మహే
శ్వర పూజా నియమంబు మానక, కరధ్వానంబునం జెంత మం
తురులం బిల్చి ప్రవాహకారణము దోడ్తోనారయం బంచినన్‌
221
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju