| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రావణుఁడు కార్తవీర్యార్జునుని మీఁది కేఁగుట |
| కం. | వారలలోఁ జతురులు శుక సారణు లభ్రగతు లగుచుఁ జరమదిశకుఁ ద త్తీరమునన యర యామడ దూరము సన వినిరి మదవతుల కలకలముల్ | 222 |
| మ. | విని యక్కాంతల చెంతఁ గన్గొనిరి ప్రావృట్కాల కాలాంబుము గ్ఘన లీలాలక విస్తృతాళికు నుదగ్రస్వోగ్ర బాహాసహ స్రనిరుద్ధాబ్ధికళత్రు నిద్ధమదసంరక్తాంతనేత్రున్ సుమో హనగాత్రున్ గృతవీర్యపుత్రు జలఖేలాయత్తచిత్తాబ్జునిన్ | 223 |
| కం. | కనుఁగొని నివ్వెఱపడి చ య్యన మగిడి దశాస్యుఁ జేరి యంజలిబంధం బొనరించి నిలిచి దేవర! వినుఁ డొక వింత యని యనిరి వేగరు లంతన్ | 224 |
| మ. | ఘనసాలోన్నతిఁ గాంచినాఁడు మరు సింగారంబునన్ మించినాఁ డు నదిన్ స్వీయభుజాసహస్రముల నాటోపించి బంధించినాఁ డు నవీనాంబు విహార తత్పరత నాండ్రుం దా విజృంభించినాఁ డు నరగ్రామణి యెవ్వఁడో యొక బలిష్ఠుం డాసురగ్రామణీ! | 225 |
| కం. | తన కరముల వలె నివ్వా హిని తరఁగలు మించు ననెడి యీసునఁ గాఁబో లు నతండు గట్టినాఁడం దునఁ బడమర సనక తటిని తూరుపు వట్టెన్ | 226 |
| కం. | దేవర కంటెను మించునొ దేవరకు సమానుఁడౌనొ తెలియఁబడదు మే మీవఱ కా విభుఁ బోలిన భూవరుఁ గని యెఱుఁగ మనిన బుద్ధి చలించెన్ | 227 |
| మ. | శివపూజా నియమంబు మాని తొలి జేజే పెద్ద మాహిష్మతీ ధవుఁడాతండు బళీ! కనంబడెను. యుద్ధక్షోణి మా తారత మ్య విశేషంబులు గానిపించుఁ జనుదెం డంచున్ వడిన్ లేచి దా నవయోధుల్ రథదంతి వాహముఖ నానాసేనలుం గొల్వఁగన్ | 228 |
| వ. | కదలి మదాధిక పదాతిపదాఘాతధూతధరాతల పరాగ పటలంబులతో గలసి మలసి ప్రతికూల మారుతంబు లెదురుకొన సరకు గొనక పశ్చిమోన్ముఖుండై పంక్తిముఖుండు దన్తటినీతటంబునం జని చని | 229 |
| శా. | రంభోరూశతగీతనృత్యరసనిర్మగ్నాత్ముఁడై యాత్మదోస్ స్తంభస్తంభితనర్మదాహ్వయ సరిత్కల్లోల జాలంబులోఁ గుంభీంద్రున్ బలెఁ గేళి సల్పు నృపముఖ్యున్ దవ్వులం జూచి ర క్తాంభోరుట్ప్రతిమానవింశతిదృశుండై రావణుం డంతటన్ | 230 |
| శా. | చేరంబోవఁ బ్రధాను లడ్డమయి యాక్షేపించి యిట్లేఁగఁగా మేరా? నీ వెటఁ బోయె దెవ్వడవు? నెమ్మిం గొమ్మలం గూడి నేఁ డీ రా జున్న రహస్య మెన్న విదియేమీ? యన్న మీ రాజుతోఁ బోరన్ వచ్చితి రావణుండఁ బిలువం బొండాతనిం జెచ్చెరన్ | 231 |
| కం. | ఊరకపోవఁడు చూచినఁ బోరక దశకంఠుఁడనిన భూరికృపాణ స్పార ప్రభ లినుఁ బొదువఁగ వారలతని కనిరి ధైర్య వైభవ మెసఁగన్ | 232 |
| కం. | సమరమున కనుచు నొప్పని సమయంబున వచ్చి పిలువఁజనునే? నీమా త్రమున కతఁడేల? మేమో పమె? రమ్మెదిరింపఁ బంపు బలముల ననినన్ | 233 |
| చం. | వినియు సహింప కద్దనుజవీరుని మంత్రులు రాజమంత్రులం గినుక నెదిర్చి శస్త్ర చయకీలితగాత్రులఁజేసి వారిఁగొ ల్చిన భటకోటి భక్షణము సేయుచు రక్తము లానుచున్ ముదం బునఁ జెలరేఁగి యార్వ నుడివోవక హైహయసైనికాగ్రణుల్ | 234 |
| మ. | బహునారాచపరంపరల్ గురియుచుం బైపైఁ బ్రహస్తాది దు స్సహులై మించిన రావణుం డలిగి హస్తన్యస్త శస్త్రచ్ఛటా ప్రహతిన్ సేనలఁ జెక్కుచున్ నఱుకుచున్ భంజించుచున్ ద్రుంచుచున్ గహనం బగ్నిసఖుండు గూల్చుక్రియ మ్రగ్గంజేసె నొక్కుమ్మడిన్ | 235 |
| వ. | ఇవ్విధంబున | 236 |
| చం. | హళహళితో నెదిర్చి దనుజాగ్రణిచే బహుసైనికోత్తముల్ గలన నడంగఁజూచి, చని, కంచుకు లప్పుడె రాజుముందటన్ నిలిచి పరాకుసామి! రజనీచరుఁడొక్కఁడు పెక్కురక్కసుల్ గెలఁకుల గొల్వ నొండు పరికింపక మీకడ కేఁగుదేరఁగాన్ | 237 |
| కం. | అడ్డము వోయిన మంత్రుల జడ్డిగములు ద్రుంచె భటుల సందడి మాన్చెన్ దొడ్డ చలంబున నీ కెదు రొడ్డి విజృంభించె నవలి యెడ్డున నధిపా! | 238 |
| తే.గీ. | పేరు రావణుఁడఁట యేమొ వీరి వారిఁ గొందఱ జయించినాఁడఁట యందఱబలె మిమ్మును జయించుట కుపక్రమించినాఁడు మించినాఁ డిప్పుడదె విక్రమించినాఁడు | 239 |
| మ. | అనుమాటల్ పెనుగాడ్పులై నిగిడి రోషాగ్నిం బ్రవృద్ధం బొన ర్చిన ధూమంబన భ్రూకుటిస్ఫురణ మించెన్ - దంతఘర్షంబునం గనిపించెన్ విపులస్ఫులింగములు - దృక్కంజంబులన్ జ్వాలలు న్జనియించెన్ - నృపుఁడంత నన్యబలవన్యాప్లోషసంరంభియై | 240 |
| తే.గీ. | ఒదవు పరవాహినీరోధ ముజ్జగించి యిటు వృథావాహినీరోధ మేల చేయ? ననుచు నవరోధకాంతల యళుకు మాన్చి తటిని రోధంబు వాపి రోధంబు సేరి | 241 |
| ఉ. | భూధవమౌళి ధౌతపటముల్ ధరియించి విశేషదివ్యభూ షాధవళానులేపముల స్రక్కుల మిక్కిలి టెక్కుఁ జెందియున్ గ్రోధము మూర్తిఁ గైకొనిన కోపునఁ గాంచన వేష్టనోజ్జ్వలో త్సేధగదాధరుం డగుచుఁ జెచ్చెర రావణుమీఁది కేఁగఁగన్ | 242 |
| ఆ.వె. | ఆ సహస్రకరుని నడ్డగించెఁ బ్రహస్తుఁ డతనితోడ మూఁక లావరించె ఖరకరాయుధాంశు కలన నమ్మూఁక పెం జీఁకటులను విరియఁ జేసె నతఁడు | 243 |
| చం. | అలిగి ప్రహస్తుఁడుద్దవిడి హైహయుపై ముసలంబు వైచినన్ బలువడిఁ దప్పఁద్రోచి గదపై కెగనెత్తి పలాశి నెత్తి సం చలనము నొంద వ్రేయఁ గులిశప్రహతాచలరాజశృంగమున్ బలె నతఁ డొల్లఁబోయి యిలపైఁబడియెన్ జడియన్ నిశాచరుల్ | 244 |
| ఆ.వె. | వానిపాటుఁ జూచి వడిగలతనమెల్ల మంటఁ గలయ నున్న మంత్రివరులు నొకఁడు సనినత్రోవ నొక్కండు వోవక బీఱుబోయి పదరి పాఱుటయును | 245 |