| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రావణ కార్తవీర్యార్జునుల యుద్ధము |
| శా. | మోముల్ జేగుఱుఁజాయ మించ దితిభూమూర్ధన్యుఁ డత్యుగ్రుఁడై యామూర్ధన్యు నెదిర్చి భూరిగద బాహాగ్రంబునం బూని య భ్యామర్దస్పృహ సింహముం గదియు సింహంబున్ బలెన్ విక్రమో ద్దామక్రీడనతత్పరుండు నృపునిం దాఁకెన్ సురల్ మే లనన్ | 246 |
| వ. | ఇత్తెఱంగున నక్కా ర్తవీర్యదైత్యవర్యు లుదాత్త ధైర్యస్థైర్యశౌర్యధుర్యులయి, యహార్యయుగళంబు డంబున, నుత్తుంగమాతంగ పుంగవద్వయంబు భంగి, నభంగుర ప్రళయకాలమా ర్తండమండలద్వితయంబు మెండువ, నుద్దండలయదండధర ద్వంద్వంబుగండున, నఖండకాండ ప్రచండ చండీశ్వరయమళంబు భాతి, విలయ సమయసమున్నిద్ర సముద్ర యుగోద్రేకంబున, నొండొరుల నెదుర్కొని మండలా కృతిన్ బెరయ, బిఱబిఱ గదాదండంబులు ద్రిప్పుచు, మండల భ్రమణంబులఁ బరిభ్రమించుచు, దిట్టతనంబునెట్టుకొన మండె నెట్టుచు, బెట్టుగా వ్రేయువ్రేటుల కొగ్గినటువలె నుండి, యొక్కింత యోసరించుచు, బదులు వ్రేయన్ గమకించుచుఁ, దప్పించుకొను నేర్పునన్ దర్పించి పైఁ బడం గుప్పించుచు, మర్మంబు లెఱిఁగి నొప్పించుచు, నుప్పరంబున కెగసి యన్యోన్యగదా ప్రహారంబుల మేఘమాలికలఁ జీలికలు సేయుచు, దిగ్గజంబులు మ్రొగ్గ నగ్గలికతో నుర్వికి లంఘింపుచు, నాలీఢాది పదవిన్యాసంబుల బిత్తరంబుతో నొత్తరించుకొని యొరయుచు, నొకరొకరిం జూచుకోపంబుచూపుల నిప్పులు గురియుచు, నొండొరుల నొప్పిదప్పులకు మురియుచుఁ, బ్రతిహతులకుం బాయుచు, నప్రతిగతుల డాయుచు, నుప్పతిల్లు గొప్ప నెత్తురువఱదలఁ దొప్పదోగుచు, నొండొరుల గదాహతు లాఁగుచు, నొడ్డారంబున మడ్డులు వెట్టి యెండు దెసం జూపి యొండు దెస మసలం గొట్టి బడలికలు పుట్టించుచు, గట్టల్కతో మట్టు మీఱి దట్టించుచు, సకలభూతంబులు భయాద్భుతరసోపేతంబు లయి పలుదెసలకుం బఱవ నార్చుచు, బెట్టి దంపు సాదన పెనఁకువలం బేర్చుచు, హుంకారంబు లొనర్చుచు, నహంకారంబున నెదుర్చుచు, నొల్లంబోయి యొక్కింతతడ వూరక నిల్చుచు, నొకళ్ళొకళ్లఁ బేరుకొని పిల్చుచు, నిదిగో వ్రేసెదఁ దప్పించుకొను మని హెచ్చరించుచు, నితరేతర బాహుబలంబులు సహింపక మచ్చరించుచుఁ, బెల్లు మించినం బొగడుచుఁ, దల్లడించినం దెగడుచుఁ, గాలసర్పంబులవలె బుసఁగొట్టుచు, నేటి దరి చెట్టులు నుగ్గునూచంబులుగా మెట్టుచు, భుజాస్ఫాలనంబు లాచరించుచుఁ, గార్చిచ్చుల హెచ్చున గోచరించుచు, ఖేచరులు మెచ్చ గద్దఱితనంబులం బెద్దతడవు గదాయుద్ధంబు సేసి, రయ్యవసరంబున. | 247 |
| తే.గీ. | అలుకను వహించి కార్తవీర్యార్జునుండు బాహుగదఁ బూన్చి గర్జించి పంక్తిముఖుని నుర మొరయనేయ నది యొప్పె నుఱుము కాల మేఘమున మించఁ గనిపించు మించుఁబోలె | 248 |
| కం. | దనుజుఁడును గార్తవీర్యా ర్జును నురమున గద మిడుంగుఱులు సెదరఁగ వై చిన నది పర్వత మధ్యం బున నూల్కొను నుజ్జ్వలోల్కపోల్కి వెలింగెన్ | 249 |
| వ. | ఇవ్విధంబున | 250 |
| ఉ. | కొమ్ములఁగ్రుమ్ములాడు మదఘోరవృషంబులమాడ్కిఁ బోరుచో నమ్మనుజేంద్రుఁడుద్ధతి మహాగద వైచినఁ బంక్తికంఠు వ క్షమ్మది తాఁకి క్రుంగె వరశక్తి నడంగక వింటిపెట్టుదూ రమ్మతఁడేఁగి మూర్ఛ యడరం బుడమింబడె వీతచేష్టుఁడై | 251 |
| వ. | అప్పుడు | 252 |
| చం. | గరుడుఁడు సర్పముం బొదువు కైవడి రావణు రాజుడాసె మున్ హరి బలిఁ గట్టివైచిన క్రియం బటుపాశనిబద్ధుఁ జేసె, ఖే చరులు సుమావళుల్ గురియ సైన్యముతోఁబురి కేఁగె, నంత న య్యరదము సుట్టుముట్టిరి ప్రహస్తముఖాసురరాజసైనికుల్ | 253 |
| చం. | ఇటువలెఁజుట్టుముట్టుకొని యెక్కడి కేఁగెదు రాజ! నిల్వు మెం తటిపనికైనఁ బద్మభవునాలవవాని గ్రహింపఁగూడునే? తటుకున నీతనిన్ విడుము దర్పమునన్ విడవేని నేఁడు నీ పటుభుజముల్ శరావళుల బ్రద్దలు వాపక రిత్త వోదుమే! | 254 |
| చం. | అని కాలాభ్రము లభ్రముం బొదువు నట్లయ్యర్జునుంగ్రమ్మి యు క్కున నొక్కుమ్మడిఁ బ్రాసపట్టిస గదా కుంతాదిశస్త్రంబు లే సిన నాతం డవియెల్లఁజే నొడిసి సుస్మేరాస్యుఁడై వారిమీఁ దనె వైవన్ గడు నొచ్చివిచ్చి చని రాత్మస్వామి చింతిల్లఁగన్ | 255 |