| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రావణుఁడు వాలితోఁ బోరనేఁగుట |
| శా. | దుష్కాంక్షల్ తివరింపఁ గ్రమ్మఱ మదాంధుండై నృపాలచ్ఛటా శుష్కారణ్యదవాగ్ని తేజమున నెచ్చోనైనఁ గ్రీడించుచున్ నిష్కారుణ్యమునన్ ధరాజనుల హానిం జెందఁగాఁజేయుచున్ గిష్కింధాపురి కొక్కనాఁడు వడి నేఁగెన్ వాలితోఁబోరఁగన్ | 269 |
| కం. | ఏఁగి పురద్వారము బి ట్టాఁగి నిలిచి తన్నుఁ జూడ నడవిదిరుగుడుల్ మూఁగికొన గగన మట్టిటు గాఁగ లయాంబుదము లీల గర్జించుటయున్ | 270 |
| కం. | ఆ రవము విని యశోజిత తారుఁడు తారుఁ డరుదెంచి దశముఖుఁగని యే మీ రావణ! నీవచ్చిన కారణ మెఱిగింపు మనిన గర్వమున ననున్ | 271 |
| కం. | వాలి మహాభుజవిక్రమ శాలి యనఁగ నాలకించి సమరక్రీడా భీలతఁ జూపఁగ వచ్చితి నాలస్యం బేల? పనుపు మగచర! యతనిన్ | 272 |
| ఉ. | నా విని తారుఁడిట్లనియె నవ్వుచు నీ విది యేమి వెఱ్ఱివే? రావణ! వాలితోడ బవరం బొనరింపఁగ నెవ్వఁడోపు?ఁబొ మ్మీ వొకరుండవేల? పరమేశ్వరుఁడైన నెదిర్చి నిల్వ లేఁ డీవఱ కాతనిం దొడరి యెందరు నొచ్చిరొ? నీ వెఱుంగుదే? | 273 |
| చం. | వనచరనాథునిం దొడర వచ్చిన శూరుల కీకసావళుల్ గనుమదె ప్రోవులై గిరులకైవడి నున్నవి దానవేంద్ర! నీ వును జను వాలిమీఁద నసువుల్ భరియింపఁగ నొల్లవేని నా యన యిపుఁ డేఁగినాఁడు చతురబ్ధుల స్నానము లాచరింపఁగన్ | 274 |
| వ. | అని యంత నిలువక | 275 |
| సీ. | మహితాహిగుణ వేష్ట్యమానోరు మంథాన - మహిధరోన్మథితోర్మిమాలి వాలి! మాయావి ముఖదైత్య మాయావనప్లోష - కేళిభీషణదావకేలి వాలి! పదఘట్టనోద్భగ్న పాదపాదపశిలో - జ్జ్వలశృంగశత సప్తశైలి వాలి! వజ్రిధ్వజోత్తాళవాల విక్షేపణో - త్పాతిత నక్షత్రపాళి వాలి! | |
| ఆ.వె. | యట్టి వాలిఁ దొడరి యమృతంబు ద్రావిన వారికైన బ్రదుకవచ్చు నోటు? కాదు కూడ దతని కయ్యంబు వలెనన్న నిపుడె దక్షిణాబ్ధి కేఁగు మనిన | 276 |
| కం. | అత్తారుని భర్జించుచుఁ గ్రొత్తలు వింటిమి, మఱేమి క్రోతులపురి నం చెత్తిన మదమున దనుజకు లోత్తముఁ డా క్షణమ దక్షిణోదధి కరిగెన్ | 277 |
| వ. | అరిగి తత్ప్రదేశంబున | 278 |
| సీ. | అతులితానంతపథాక్రాంతి శ్రాంతుఁడై - ధరణికి దిగిన మార్తాండుఁ డనఁగ నుత్తరదిశ మాని యొక వేడుకకు దక్షి - ణాశఁజేరిన కాంచనాద్రి యనఁగ ననవరతాంబుపానాయాసమునఁ దీర - మాశ్రయించిన బాడబాగ్ని యనఁగఁ గరచరణాదికాంగములతోఁ గపిరూపుఁ - దాల్చిన యామ్యప్రతాప మనఁగ | |
| గీ. | దుర్నిరీక్ష్య ప్రభావంబుతో నుదగ్ర తనువుతోఁ గీలికాభీల తరళవాల వల్లితో శోణముఖవైభవంబుతో న వంధ్యగతి సంధ్యవార్చు నవ్వాలిఁ గనియె | 279 |
| మ. | కని శాఖామృగమాత్రుఁగాఁదలఁచి రక్షస్స్వామి యయ్యింద్రపు త్త్రుని వంచించి గ్రహింప నెంచి తన మంత్రుల్ దవ్వునన్ నిల్చి క న్గొనఁ దానొక్కఁడ పుష్పకంబు డిగి యందున్ సద్దుగాకుండ నొ య్యన పాదంబులు వెట్టుచున్ వెనుకయై యంతంత నేతేరఁగన్ | 280 |
| చం. | పదముల చప్పుడింత చెవిఁబాఱినఁగన్నులు విచ్చి వాలి గ న్దుదలనె వానిఁగన్గొని ననుం గపటంబునఁ బొంచి పొంచి ప ట్టెదనని రావణుండు నిగిడెన్ వడి వీని భుజాంతరంబులన్ బొదివి చతుఃపయోధులను ముంచెద నంచు జపించుచున్నెడన్ | 281 |
| మ. | చరణాగ్రంబులఁ దిన్నగా నడిచి పశ్చాద్భాగముంజేరి యా శరుఁడున్ మస్తము తోరఁ జేసుకొని హస్తంబుల్ పయింజాఁచినన్ హరి దంతిన్ గ్రహియించునట్లు ప్రబలుం డవ్వాలి బల్సందిటన్ శిరముల్ ప్రక్కలు బాహు పంక్తు లిఱికించెన్ జండసత్త్వంబునన్ | 282 |