ఇతిహాసములు ఉత్తరరామాయణము వాలి రావణుని గర్వం బడంచి పరిభవించుట
వాలి రావణుని గర్వం బడంచి పరిభవించుట
ఉ.ప్రక్కలు సక్కఁగా నదిమి బాహుశిరః ప్రముఖాఖిలాంగముల్‌
మిక్కిలి నొవ్వఁ జేయుచు నమేయబలంబున వాలి మింటికిన్‌
గ్రక్కున నుద్గమించెఁదను గన్గొని వేల్పులు సిద్ధసాధ్యు ల
మ్మక్క! మహాపరాక్రమ సమగ్రుఁడితండని సంస్తుతింపఁగన్‌
283
ఆ.వె.ఇటుల నుద్గమించి యింద్రుని గారాబు
పట్టి చిలువ నొడిసి పట్టి పఱచు
పన్నగారిదారిఁబశ్చిమాంబుధిఁ జేర
నరుగు నంతలోన నద్భుతముగ
284
శా.ఆకాశంబున కడ్డమేఁగిన ప్రహస్తాద్యాసురామాత్యు ల
ప్పాకారి ప్రియసూతి వాల జనిత ప్రత్యగ్రఝంఝానిలో
ద్రేకం బోర్వక తూలికల్‌ చెదురురీతిన్‌ మేఘముల్‌ విచ్చి చీ
కాకై పోయెడుజోక నొచ్చి చని రాకంపింప సర్వాంగముల్‌
285
కం.తోయదమున్‌ గొని పోయెడు
వాయువువలె వాలి పంక్తివదను నిటులు కొం
పోయి వడిఁ బశ్చిమాంబుధి
తోయముల మునింగి నియమధూర్వహమతియై
286
చం.ఇరవుగ నప్పయోధి ఘటియింపఁగలట్టి క్రియల్‌ ఘటించి యు
త్తరజలరాశికిం జని యథావిధి స్నానముఁజేసి పంక్తికం
ధరు నలవోక సందిటను దాల్చియె తూరుపువార్ధిఁ జేరి యం
దురుజపనిష్ఠ లెల్ల నియమోన్నతిఁ దీఱిచి యివ్విధంబునన్‌
287
మ.కృతకృత్యుండయి యింద్రనందనుఁడు కిష్కింధాపురోద్యాన ప
ద్ధతిఁ బ్రాపించి భుజాంతరంబున మహాదైన్యంబుతో వ్రేలు న
ద్దితిజాధీశ్వరు నందు వైచి నగుచున్‌ దేవారి! హా! యెప్పు డం
చతనిం జూడనివాని యట్లడుగ వీతాహంక్రియౌద్ధత్యుఁడై
288
మ.తను వాద్యంతము చెమ్మరింప భయగాద్గద్యంబు గాన్పింపఁ గ
న్గొనలన్‌ బాష్పము లావహింప వడఁకుం దోడ్తోఁబ్రవర్తింప బో
రున నిట్టూర్పులు మించ లేచి దనుజేంద్రుం డంతఁ దాఁ గ్రమ్మఱన్‌
జననం బొందితి నంచు నెంచి యనియెన్‌ శాఖామృగస్వామితోన్‌
289
చం.బలియుఁడవైన నీవె నిరపాయరయాఢ్యుఁడవైన నీవె ని
శ్చలమతివైన నీవె విలసద్ధృతివైనను నీవె కాక నీ
కిల నొకరుండు సాటి యగునే? సురనాథకుమార! నిన్ను నేఁ
దెలిసితి నేఁడు నిక్కముగఁ దీఱె మదీయమదాంధకారముల్‌
290
శా.కైలాసం బగలించి శంకరునిచే ఖడ్గంబుఁ బ్రాపించి ది
క్పాలశ్రేణిఁగలంచి మించిన ననుం గక్షాంతరాళంబునన్‌
తూలంబున్‌ బలె వ్రేలఁ జేసితివి నీ దోశ్శక్తి మ్రోలన్‌ వృధా
స్థూలంబయ్యె మదీయ శౌర్య మఖిలస్తుత్యప్రభావోదయా!
291
చం.గరుడు రయంబు మానసముగాంచిన వేగము చండమారుత
త్వరయు భవజ్జవంబున లవంబున కైనను సాటి వచ్చునే?
సురగరుడోరగాసురులఁ జూచితి నీదృశబాహువిక్రమ
స్ఫురణ లెఱుంగ సత్యమిది స్తోత్రము గాదు ప్లవంగపుంగనా!
292
ఉ.అన్నవు నీవు భానుసుతునట్టుల నేనును గూర్మి తమ్ముఁడన్‌
నన్నుఁగృపన్‌ గనుంగొనుము నా ధన మంతయు నీది నీవు నే
నెన్నఁటికిట్లు చెల్మి వహియించియె యుండుదమన్న నింద్రజుం
డన్నరభోజితోడ నపు డట్టులె సఖ్యముసేసి వేడుకన్‌
293
కం.బాంధవుఁడగు నాతనిఁ గి
ష్కింధకుఁ దోడుకొని పోయి స్నేహమున జగ
ద్భాంధవసుతుఁ జూచిన గతి
బంధురమతిఁ జూచి మిగుల బహుమతిఁ జేసెన్‌
294
కం.మాసముదారత నచ్చట
మాసము వసియించి మిగుల మైత్త్రియుఁగని య
య్యాసురపతి సత్కృతుఁడై
యా సురపతిసుతుఁడు వనుప నరిగె నృపాలా!
295
వ.అని పలికి యగస్త్యమునిశేఖరుండు రఘువీరశేఖరునకు వెండియు నిట్లనియె296
మ.చతురంభోధుల దైత్యుముంచిన భుజాశౌర్యాఢ్యు నవ్వాసవిన్‌
హతుఁ గావించితి వొక్కతూపున సమిత్త్రామాత్యపుత్రంబుగాఁ
గృతవీర్యాత్మజుఁ ద్రుంచివైచిన త్రిలోకీవర్ణితున్‌ రేణుకా
సుతు నిర్జించితి వెంచ శక్యమె నినున్‌? క్షోణీసుతాధీశ్వరా!
297
కం.విను మవ్వలి కథ యిటువలె
దనుజుఁడు కిష్కింధ వెడలి తన సహజ మదం
బున మునుపటివలె నృపతుల
నని నొంచుచు ధరఁ జరించు నక్కాలమునన్‌
298
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju