ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుఁడు నారదమహర్షినిఁ జూచుట
రావణుఁడు నారదమహర్షినిఁ జూచుట
శా.సర్వాంగీణ విభూతికాంతులు శరచ్చంద్ర స్ఫురచ్చంద్రికా
నిర్వాహంబుఁగనన్‌ జటల్‌ భుజగమాణిక్యచ్ఛటల్‌ నాటఁగా
సర్వజ్ఞత్వము సార్వకాలము రహించన్‌ మించు దేవర్షి యం
తర్వాణిస్తవనార్హకీర్తి యెదురైనన్‌ దైత్యుఁ డుప్పొంగుచున్‌
299
ఉ.దండము వెట్టి సేమమెకదా! యనిమేపరియయ్యవారి కెం
దుండిపు డెందుఁబోయెదరొ? యోజనలేమి? విశేషమెద్ది? బ్ర
హ్మాండమునందు మీఁకుఁ దెలియం బడకుండునె సర్వమున్‌ ధరా
మండలనాథులన్‌ గెలుచు మద్భుజశౌర్యము మెచ్చ వచ్చునే?
300
వ.అనిన జతురవచనరచనావిశారదుం డగు నారదుండు, నీరద పథంబునం జనుపుష్పకంబు నిలుపు మని నియమించి యతనితో నిట్లనియె301
వ.యశమున్‌ దేజము బాంధవప్రియము ధైర్యస్థైర్యముల్‌ గన్న నీ
కుశలం బేఁ దలఁతున్‌ శుభంబెకద నీకున్‌ రాక్షసాధీశ! యీ
దృశశౌర్యాఢ్యుఁడ వీవు మానవులతో నేవేళఁ బోరాడఁగాఁ
గృశతన్‌ బొందె మదీయకౌతుక మదేమీ యన్న వాక్రుచ్చెదన్‌
302
కం.పిచ్చుక పయి బ్రహ్మాస్త్రము
విచ్చలవిడి నిగుడఁజేయు విధ మింతెకదా!
మచ్చరము మనుజతతిపైఁ
దెచ్చుక పొలియింప నీవు దిరుగుట లెల్లన్‌
303
మ.అకటా! విష్ణుని గెల్చుటో? జముని బాహాశక్తి మాయించుటో?
సకలాదిత్య వినాశముల్‌ సలుపుటో? శక్రున్‌ నివారించుటో?
వికట వ్యాధిజరావికార కృశులన్‌ విభ్రాంతులన్‌ మర్త్యులన్‌
బ్రకటక్రోధమునన్‌ జయించిన వికారం బందరే మాదృశుల్‌
304
కం.సామజరాజము దోమల
తో మార్కొని పోరునటులఁ దోచెన్‌ మనుజ
స్తోమముతోఁ దార్కొని సం
గ్రామము నీ వాచరింపఁగాఁ గనుఁగొన్నన్‌
305
మ.వర మబ్జాసను వేఁడునప్పుడును దేవశ్రేణులన్‌ గాని నే
నరులన్‌ వానరులన్‌ గణింప ననవే? నాయంబె భీతాత్ములం
బరివేధించుట? మార్కొనన్‌ వలసినన్‌ బాతాళవాసుల్‌ ఫణా
ధరులున్‌ దైత్యులు లేరె? వా రసదులే? దైతేయవంశాగ్రణీ!
306
వ.అని మనుజహితార్థియై రావణునకు రసాతలజయోద్యోగంబునందు బుద్ధి పుట్టించి యన్నలువపట్టి యంత నిలువక307
తే.గీ.ఇది హితంబుగ నూహించి యింక మనుజ
కోటిపై ధాటి చూపక నేఁటినుండి
చనుము పాతాళవాసుల సంహరింప
నీ గెలుపు గెల్పుగాదు దైత్యేంద్ర! యనిన
308
ఉ.నారదుమోముఁజూచి యెలనవ్వునఁ బంక్తిముఖాసురుండనున్‌
మీరు మనుష్యకోటులకు మేలు దలంచితిరేమొ, మంచిదే!
శూరులు భీరులందొడరి శూరతఁ జూపిన శూరుఁడందురే!
భూరిగుణాభిరామ! తగు బుద్ధిగణించిన మానవచ్చునే
309
మ.బలిసద్మంబున కేఁగి తొల్త బలిశుంభద్గర్వమున్‌ మాన్చి దై
త్యుల యౌద్ధత్య మడంచి భోగివరులం దూలించి వత్తున్‌ రసా
తలయాత్రానుమతి ప్రదానము మునీంద్రా! యిచ్చితే? యన్న నం
దుల కానందముఁబొంది పద్మజుని పుత్త్రుం డిట్లనున్‌ గ్రమ్మఱన్‌
310
మ.అల యుప్పొంగ రసాతలాధిపుల బాహాటోపముల్‌ మాన్పఁగా
వలతేనిన్‌ దొలుదొల్త సంయమని త్రోవం బొమ్ము, నీరాకకు
మ్మలికం జెంది జముండు మార్కొనిన సమ్మర్దంబుగా నచ్చటన్‌
గలుగుం బో రతనిన్‌ జయించి, యశముం గైకొమ్ము నా మెచ్చుచున్‌
311
ఉ.దేవమునీంద్ర! మంచి యుపదేశ మొసంగితి రంతకాదిది
గ్దేవతలన్‌ దురంబునను గెల్వఁబ్రతిజ్ఞ యొనర్చినాఁడ ము
న్నావిధ మెచ్చరింప హితమయ్యె, జయింతు నవశ్యమాతనిన్‌
దీవన లిచ్చి మీ రిపు డతిప్రమదంబున వీడుకొల్పుటన్‌
312
కం.పనివినియెద నని నారద
మునికిన్‌ వినయోక్తియుక్తి మ్రొక్కి దశాస్యుం
డనుమతిఁగొని జము గెలువఁగఁ
జనియెన్‌ బలుకలకలంబు చదలం బొదలన్‌
313
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju