ఇతిహాసములు ఉత్తరరామాయణము నారదుండు యమునికి రావణుని రాకఁ జెప్పుట
నారదుండు యమునికి రావణుని రాకఁ జెప్పుట
ఉ.నారదుఁ డంత నిట్లని మనంబున నెంచె దశాస్యుఁ డెంతయుం
గ్రూరుఁడు మూఁడు లోకములకున్‌ వెతసేయఁగఁబూనుకొన్నవాఁ
డీరస మెక్కు డంతకుఁడు నింతట నంతట రిత్తవోవునే?
వీరలు వోరు పోరుఁగని వేడ్క యొనర్చెదఁ గన్నుదోయికిన్‌
314
చం.యమునకు దానె పెద్ద యముఁడై భయమొందక రావణుండు సం
యమనికిఁ బోయె నింక నెటులైనను మంచిది మర్త్యకోటి బ
న్నము గడతేఱె నింతటఁ గనారిలి వేల్పులమీఁద జూపు వి
క్రమ మదిమేలుగా దయినఁ గన్గొని మెచ్చక పోవవచ్చునే?
315
ఉ.ఇచ్చటఁ దామసింపఁదగ దిప్పుడె యాతని కివ్విధంబు వా
క్రుచ్చెదనంచు నారదుఁడు గొబ్బున సంయమనీమహాపురిం
జొచ్చి చిరత్నరత్నమయ శోభిత దివ్యసభాంతరంబులో
నొచ్చెములేని కల్మిఁ గొలువున్న జముం గని చేరఁబోవఁగన్‌
316
సీ.కణ్వగార్గేయ మార్కండేయులొక వంక - సముచిత స్మృతి వివాదములు సలుపఁ
దమరు దెచ్చిన ప్రాణితతుల ముందట నుంచి - యెడనెడఁ గింకరుల్‌ హెచ్చరింప
నెవ్వరెవ్వరి నొంతు మెందెందుఁబోదు మం - చాకృతుల్‌ గని యామయములు వలుకఁ
గవిలెలో నున్న ప్రకారానఁ బ్రజ పాప - పుణ్యముల్‌ చిత్రగుప్తుండు దెలుప
 
గీ.ధర్మపీఠంబునను గాలదండమృత్యు
సహితుఁడై నిండుఁకొలువుండి సకలలోక
వంద్యుఁడాతండు సురమౌని వచ్చురాకఁ
గాంచి యెదురేఁగి మ్రొక్కి యర్ఘ్యంబొసంగి
317
ఆ.వె.ఉన్నతాసనమున నునిచి పూజలు సేసి
కుశలమడిగి ప్రియముఁ గూర్చి యిచటి
కేఁగుదేర నేమి హేతువు? మునినాథ!
తెలుపవలయుననినఁ బలికెనతఁడు
318
మ.నిఖిల స్తుత్యభుజప్రతాపనిధివౌ నీమీఁద దండెత్తి వ
చ్చె ఖలుండైన దశాననుం డతనితో సిద్ధంబు యుద్ధంబగున్‌
శిఖరిన్‌ మేషము దాఁకి కుందుగతి నీచేవందురున్‌ సంగరో
న్ముఖభావంబు వహింపు మన్న నగి యంభోజాప్తపుత్త్రుం డనున్‌
319
ఉ.మేలు మఱేమి మా పురము మీఁదికిఁ రావణుఁ డేఁగుదెంచినన్‌
జాలు భవత్ప్రసాదమున శౌర్యగుణంబు ఫలింపఁజేసెదన్‌
గాలుని కాలదండ మెఱుఁగం డొకొ? మృత్యువుఁజెంద వానికిం
గాలము డగ్గఱించె నది గానియెడన్‌ మది నిట్టు లెంచునే?
320
కం.మంచిది రానిం డంతయుఁ
గాంచెద రీ మునులు మీరు గర్వోక్తులు భా
షించఁ బనియేమి యంచు స
మంచితధైర్యమున నుండె నట దశముఖుఁడున్‌
321
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju