| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రావణుఁడు యముని నగరముపై దండెత్తుట |
| చం. | హలహలతీక్ష్ణభంగులు లయాంబుధర ప్రతిబింబరూపముల్ ప్రళయసముద్రఘోషములు బాడబకీలల నేలు తేజముల్ వెలయ మహోగ్రరౌద్రములు వింతలు గాఁదగు వీర రాక్షసుల్ గొలువఁ బరేతరాజపుర గోపుర ముద్ధతిఁ జూచి వేడుకన్ | 322 |
| ఉ. | ఆయన దివ్య పుష్పక మహాప్రభ లా నిరయాంధకారము న్ద్రోయ దశాస్యుఁడయ్యెడఁ గనుంగొనియెన్ భటకోట గత్తులన్ గోయఁగ వ్రేయఁగాఁ గశలఁ గొట్టఁగఁదిట్టఁగ బెట్టు వేదనల్ సేయఁగ జిక్కి స్రుక్కి వెతఁ జేష్టలు దక్కి తపించుప్రేతలన్ | 323 |
| సీ. | ఉక్కుకోఱల కుక్కలొక్కింతమర్మముల్ - వట్టి తీయఁగ మొఱల్ వెట్టువారి గొప్పనిప్పుల యేటఁ గూల్చిపోనీయక - పొదివి యమ్ములనేయఁ బొరలువారి నెత్తురు చీము నిండినకూపముల వ్రాలి - పురుగు లంగముఁ దొల్వఁ బొరలువారిఁ గత్తులఁగోసిన కాయముల్ క్షార వా - హినుల ముంపఁగఁబెట్టఁ బనవువారి | |
| గీ. | బిట్టు గాలిన పెనములఁ బెట్టి వేఁప మిట్టిపడి యట్టె మూర్ఛిల్లునట్టివారిఁ దప్తతైల కటాహపాతమున శోక తప్తులగువారిఁ జూచె నద్దశముఖుండు | 324 |
| సీ. | పక్షపాతులుఁ గూటసాక్షులు ననృతోక్తి - పరులు రౌరవబాధపడెడు విధము కులహంతలును భ్రూణగోఘ్ను లుచ్ఛ్వాసని - రోధకంబునఁబడి రోఁజువిధము బ్రహ్మహంతయు సురాపాని స్వర్ణస్తేయి - సూకరంబునఁబడి స్రుక్కువిధము స్వగురుతల్పగుఁడును స్వసృగామి నృపహంత - తప్తకుంభికఁబడి తలఁకు విధము | |
| గీ. | కూఁతునుం గోడలిని బట్టుకొన్న చెడుగు లురుమహాజ్వాల వ్రాలి బిట్టొఱలు విధము దగని మగువలఁ గవయు పాతకులు లవన యాతనలఁ గూలువిధ మతఁ డచటఁ జూచె | 325 |
| సీ. | భృతికి వేదంబు సెప్పెడిదూబ వేదనిం - దకుఁడు విమోహపాతంబుఁ గనుట నతిథుల వృద్ధుల నరయ కన్నముఁ దిన్న - పాపకర్ముఁడు కృమిభక్షి యగుటఁ గ్రతువు సేయఁగ నాస కతన నసద్గ్రాహి - యగువాఁ డధోముఖియై యొఱలుట బ్రాహ్మణుం డయ్యు బేరము లాడు దుర్జాతి - యంధకూపంబున నవశుఁడగుటఁ | |
| గీ. | బర్వగామియు గృహదాహి బంధురోధి వైతరణిఁగూలి కాలుట వనము నఱకి వైచిన దురాత్ముఁ డసిపత్త్రవనిఁ దొరఁగుటఁ జూచి దశకంధరుఁడు దలలూఁచి మఱియు | 326 |
| సీ. | నవరత్నమయ భూషణములఁబూనినవారి - దివ్యయానము లెక్కి తిరుగువారి వికచమందారమాలికలు జుట్టినవారిఁ - దెలిగొడుగుల నీడ వెలయువారి మృగమదశ్రీగంధమిళితాంగు లగువారి - వీణాదినాదముల్ వినెడివారి నచ్చరల్ గొలువఁ గొల్వై చెల్వుఁగనువారి - మేలిమచ్చులమీఁద మెలఁగువారి | |
| గీ. | జంద్రుసౌమ్యంబు తపను తేజంబు మరుని చెలువ మింద్రునిభోగంబు శివుని విభవ మూని భద్రాసనస్థులైయున్నవారి ధార్మికులఁజూచె నొకవంక దశముఖుండు | 327 |
| ఆ.వె. | చూచి నేను మొదటఁ జూచినవారి క య్యడ లొనర్చి వీరి కధికసౌఖ్య యుక్తి మెలఁగఁజేసె నోహో! జముఁడు పక్ష పాతి యనుచుఁ బలికి పంక్తిముఖుఁడు | 328 |
| చం. | పురుషుఁడు కర్తయే దురితమున్ సుకృతంబు నొనర్పఁ? గర్త యొ క్కరుఁడది నీవు సేయు మనఁగాఁగద కర్మఠుఁడౌ స్వతంత్రతా విరహితులన్ వృధా పరిభవించెద రీ ఖలులంచు యామ్యకిం కరుల నదల్చి రావణుఁడు గాఢకృపన్ విడిపించెఁ బ్రేతలన్ | 329 |
| కం. | భయపడు నిరయస్థులఁగని దయ యనుపే రెఱుఁగనట్టి దశకంఠునకే దయపుట్టెనన్న వారల దయిన విపద్దశ దలంప నలవియె యధిపా! | 330 |