ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుఁడు యమునిభటులఁ బరిభవించుట
రావణుఁడు యమునిభటులఁ బరిభవించుట
ఆ.వె.ఇటుల నిరయగతుల నెల్ల విముక్తులఁ
జేసి వారు హాయి సెంది పొగడ
విక్రమింపఁ గడఁగు వింశతిభుజుఁజూచి
శమనభటులు నీరసమునఁగెరలి
331
మ.పరిఘాసిక్షురికాపరశ్వధగదా ప్రాసాది నానాయుధో
త్కరముల్‌ పూని దశాస్యు పుష్పకము మీఁదం బెల్లు గావించి హుం
కరణంబుల్‌ గఠినాట్టహాసములు టంకారధ్వనుల్‌ మీఱ, భీ
కరులై యొక్కటఁ జుట్టుముట్టుకొని మార్గంబున్‌ నిరోధించినన్‌
332
మ.దనుజాధీశుని మంత్రు లజ్జముని భృత్యశ్రేష్ఠులన్‌ బిట్టు మా
ర్కొని తత్సాధనముల్‌ దళించుటయు, సక్రోధాత్ములై శూలముల్‌
గొని వారున్‌ బ్రతిపక్ష సైనికుల వక్షోదేశముల్‌ గ్రుమ్మి యా
ర్చిన నీలాచల నిర్ఘరంబులనఁ బాఱెన్‌ గ్రొత్తపెన్నెత్తురుల్‌
333
కం.నెత్తుట జొత్తిల్లియుఁ బలు
మొత్తములై రాక్షసులు జముని భృత్యులకున్‌
జిత్తమ్ముల నుత్తలముం
దత్తఱమును హత్తుకొన రణంబులు సేయన్‌
334
చం.సమముగఁ బోరు నద్దనుజసైనికులం దెరలించి కింకరో
త్తములు పయోదముల్‌ సలిలధారలఁ గాటుకకొండఁగప్పు చం
దమున దశాస్యుమేను శరధారలఁ గప్పిన ఫుల్లకింశుక
క్రమమున రక్తసిక్తుఁడయి క్రౌర్యము శౌర్యము ధైర్యమున్‌ దగన్‌
335
చం.ఇరువది చేతులన్‌ వివిధహేతితతుల్‌ గొని యొక్కవెట్ట, కిం
కరులపయిన్‌ నిగిడ్చినఁ గకాపిక లై రొకకొందఱందు నొ
చ్చిరి యొకకొంద ఱంత హతశేషులు క్రమ్మఱ డాసి పంక్తికం
ధరుమెయి ముంచి రస్త్రములఁ దమ్మతఁ డద్భుత మంది చూడఁగన్‌
336
కం.ఇక్కైవడి రక్కసునకు
వెక్కసముగఁ దొడరు జముని వీరభటులతో
నుక్కున మార్కొని పోరఁగ
నొక్కరుఁడున్‌ గలుగఁ డసుర యోధులలోనన్‌
337
ఉ.అప్పుడు రావణాసురుఁడు యామ్యభటాస్త్ర పరంపరల్‌ దనుం
గప్పినఁ గంకటం బవిసి గాత్రము భేదిల నొచ్చి కన్నులన్‌
నిప్పులు గుప్పలై యురల నేలకు డిగ్గి తదీయశౌర్యముల్‌
డెప్పరమైన సైపఁక వడిన్‌ విలుపూని గుణంబు దీటుచున్‌
338
మ.తపనాది గ్రహముల్‌ కదధ్వగతిఁ జెందన్‌ వేలుపుం బెద్ద మి
ట్టిపడన్‌, భోగివరుండు డీలుపడ దంష్ట్రిస్వామియుం ద్రెళ్ళ స
ప్తపయోధుల్‌ గలఁగన్‌ గులాద్రులు చలింపన్‌ దారకల్‌ డుల్లఁబా
శుపతాస్త్రం బరిపోసి యంతకభటుల్‌ స్రుక్కన్‌ బ్రయోగించినన్‌
339
మ.బహుశక్తుల్‌ బహుతోమరంబులు బహుప్రాసాదిశస్త్రంబు ల
మ్మహనీయాస్త్రమునన్‌ జనించి పొగలున్‌ మంటల్‌ సెలంగన్‌ మహా
గహనంబున్‌ దహియించుదావశిఖిరేఖన్‌ మిత్త్రభూభృత్యులన్‌
దహియించెన్‌ నిమిషంబులో భువన మత్యాశ్చర్యమున్‌ బొందగఁన్‌
340
గీ.ఇటులు యమభటకోటుల నేపడంచి
చటుల మగు తచ్ఛరం బుపసంహరించి
పురము లేర్చిన ఫాలాక్షుఁ బోలి యట్ట
హాస మొనరించె నతఁడు సంయమని బెదర
341
ఉ.ఇంతయుఁ జూచుచున్న భటు లేఁగి కృతాంతునితోఁ బరాకు! దు
ర్దాంత పరాక్రమక్రమ ధురంధరుఁ డద్దశకంధరుండు నేఁ
డెంతయు మించి, పాతకుల నెల్ల విముక్తులఁజేసి యుద్ధ వి
భ్రాంతులు గాని కింకరులఁ బాశుపతంబునఁ ద్రుంచినాఁడనన్‌
342
కం.కటతటు లదరఁ బటుభ్రూ
కుటి నిటలస్థలి నటింప గొప్ప మిడుఁగుఱుల్‌
చిటచిటఁ గన్నులఁ జెదరఁగఁ
గిటకిట రదనములు బెట్టు గీటుకొను క్రుధన్‌
343
కం.క్రూరుండై శమనుఁ డుఱక
తేరకు మద్వీరభటులఁ దెగటార్చిన య
వ్వైరి నిఁకం దెగఁ జూచెద
సారథి! మనరథము దెమ్ము చయ్యన ననఁగన్‌
344
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju