ఇతిహాసములు ఉత్తరరామాయణము యముఁడు రావణునిపైకి యుద్ధమునకుఁ బోవుట
యముఁడు రావణునిపైకి యుద్ధమునకుఁ బోవుట
కం.తోరపు లత్తుక చాయల
వారువములు గట్టి మహిషవరకేతువు చె
ల్వార సమకట్టి తే రా
సారధి గొనితేర నెక్కి సంరంభమునన్‌
345
సీ.క్రోధపావకుఁ డుండు కుండంబు లన నేత్ర - గోళముల్‌ మంటలఁ గ్రుమ్మరింపఁ
గులిశంబు చతురాకృతులఁ గాంచె నా మించు - దంష్ట్రలఁ గలసి వక్త్రంబు వెలుఁగ
ద్వాదశద్వాదశాత్మల తేజ మొకటైన - గతి దుర్నిరీక్ష్య ప్రకాశ మెసఁగఁ
బ్రళయకాలాభీల పాథోధరము లీలఁ - దాళమహోత్తాళ తనువు గ్రాలఁ
 
గీ.గాలదండంబు పాశంబు గాలమృత్యు
వగ్నిమయముద్గరము దక్కు నాయుధములు
మూర్తులు ధరించి నిజరథంబున వెలుంగ
దశముఖుని మీఁది కరుదెంచె దండధరుఁడు
346
వ.అప్పుడు347
సీ.ప్రళయార్క బింబంబు పగిది భూరిప్రభా - రాజితం బగు దివ్య రథముఁ జూచి
సంవర్తసమయ ప్రచండానల జ్వాల - లం బూనుకాలదండంబుఁ జూచి
కాలపాశంబు ముద్గరముఁ గైకొని మ్రోలఁ - దులకించు కాలమృత్యువును జూచి
కల్పాంతభైరవ క్రౌర్యం బకాలంబు - నందె చూపఁగఁ బూను యమునిఁ జూచి
 
గీ.యతని యాకారమును జూచి యదరి బెదరి
చెదరి పదములు దడఁబడ నుదరిపాటు
గదురఁ బదురుచు నెదఁ దాల్మి గుదురు పఱుపఁ
జాల కసురులు వఱచి రిక్ష్వాకుతిలక!
348
చం.సహచర హుంక్రియోగ్ర మహిష ప్రవరోత్కర కంఠ ఘంటికా
బహుళఘణంఘణధ్వనులు పార్శ్వ సమాగతకింకరాగ్రణీ
కహకహ ఘోషముల్‌ తురగ కల్పితహేషలు చండమారుతో
పహత పతాకికార్భటు లభంగుర చక్రరవంబు లొప్పఁగన్‌
349
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju