| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | యమునితోడ రావణుని యుద్ధము |
| చం. | నిమిషములోన నిట్లు రజనీచరముఖ్యునిఁ జేరవచ్చి సం యమనివిభుండు శూలముసలాసి గదా ప్రముఖాయుధంబు లొ క్కమొగి నిగుడ్చి పేరలుక గన్పడ నార్చిన రావణుండు ధై ర్యమహిమనోర్చి వజ్రనిశితాశుగ కోటుల ముంచె నాతనిన్ | 350 |
| శా. | ఆ యస్త్రాంధతమిస్ర మర్కజుఁడు మధ్యాహ్నార్కు చందంబునన్ బాయంద్రోచి సహస్ర బాణముల నప్పౌలస్త్యు నొప్పించినన్ గాయంబంతయు నెత్తుటం దడియ నాకంపించియున్ గిన్క దై తేయస్వామి పిఱిందికిం జనక యుద్వృత్తిం జముం జూచుచున్ | 351 |
| శా. | బాహాస్ఫాలన మాచరించి దశచాపజ్యాళి మ్రోయించి శౌ ర్యాహంకారత మించి హుంకృతుల బ్రహ్మాండంబు భేదించి యు త్సాహశ్రీ వహియించి తూపు లరిమీఁదన్ నించి నొప్పించి స ప్తాహోరాత్రము లొక్క చందమునఁ బోరాడెన్ సమానోద్ధతిన్ | 352 |
| వ. | ఇవ్విధంబున | 353 |
| మ. | తనతో జోడయి పోరు రాక్షసుని దోర్దర్పంబు సైరింప క య్యినజుం డేకశరాసుఁడయ్యుఁ బదివేలేసెన్ శితాస్త్రంబు లం దున మేనంతయుఁ గ్రంత లైన దశవక్త్రుం డంత మూర్ఛిల్లి యం తనె తెప్పిల్లి యుగాంతకంతుహర దుర్దాంతక్రుధావంతుఁడై | 354 |
| చం. | శమనుఁడ వౌదు వీ నిశితసాయకముల్ శమియింపు మంచు న య్యమరవిరోధి యాతని హయంబుల సూతుని నాలుగేను బా ణములఁ గలంచి వేయి బలునారసముల్ మెయి నాఁటనేసి వి క్రమమున నార్వఁగా జముఁడు గన్నుల మంటలు గ్రమ్మఁ జూచినన్ | 355 |
| చం. | దనుజ బలంబుపై నడరి తచ్ఛిభి వేఁడిన గాన నేర్చుచె న్నున నలిరేఁగి కాల్పఁగఁ గనుంగొని యంతకు మున్నె వచ్చియ య్యని తెఱఁగెల్లఁ జూచు చతురాస్య గిరీశసురేశముఖ్యు ల య్యినసుతు రోషశక్తి నుతియించిరి యెంచిరి రాక్షసేంద్రునిన్ | 356 |
| ఉ. | అయ్యెడ మృత్యు విట్లనియె నర్కజుతో ననిఁబూని యేడు నా ళ్ళయ్యె సురాభియాతి యెదురై నిను నొంచుచు నున్నఁ జూడసి గ్గయ్యెడు నింతయేల? ననునంపు మొకించుకలోన వీని ను గ్గయ్యెడునట్లు సేసెద సురాసురు లింపును ఖేద మొందఁగన్ | 357 |
| మ. | ననుదాఁటన్ వశమే విధాతకయినన్? నా చేతఁగా శంబ సా దనదైతేయుఁడు జంభపాకమధువృత్రవ్యాఘ్రనాగాసురుల్ కనకాక్షుండు హిరణ్యుఁడాదియగు రక్షశ్శేఖరుల్ మ్రగ్గుటల్ సన దాలస్యము పంపుమన్న జముఁడున్ సైరింపు మంచాత్మలోన్ | 358 |
| ఉ. | మృత్యువుఁబంపినం దన యహీనబలంబు దొలంగు, ముద్గరౌ ద్ధత్యము పాశమున్ రిపువధం బొనరింపఁగలేవు, సర్వలో కాత్యయహేతుపావక మహార్చిరఖండము కాలదండమున్ దైత్యుని మీఁద వైవ నుచితం బిపుడంచుఁదలంచి శూరతన్ | 359 |