| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | బ్రహ్మ యాజ్ఞచే యముడు యుద్ధంబు మానుకొనుట |
| చం. | బ్రతుకుదుగాని లేర! యిఁకఁ బంక్తిముఖా! యని కాలమేఘని ష్పతదమితాశనిస్ఫురణ శాంభవఫాలదృగగ్నికీలికా ప్రతినిధికీలలన్ భువనపంక్తిఁ గలంచెడు కాలదండ ము ద్ధతిఁగొని వైవఁబూనినఁ బితామహుఁ డడ్డము సొచ్చి యిట్లనున్ | 360 |
| చం. | నిలునిలు కాలదండ మతినిష్ఠుర మీతనిమీఁద వైవఁగా వల దుపసంహరింపు మనవద్య వివేక! తపం బొనర్చి న న్నలరఁగ జేసి యందున సురాసురకోటి కజయ్యుఁడై ప్రవ ర్తిల వర మొందినాఁడిపుడు ద్రెళ్ళిన నా వచనంబు దప్పదే? | 361 |
| తే.గీ. | కాలదండం బమోఘంబుగాఁగ నేన యాచరించితి దీన దశాననుండు నొచ్చినను నొవ్వకున్న నా నొడువు బొంకుఁ జెందు నటువలెఁగాకుండఁ జేయు మనిన | 362 |
| శా. | ఆ వైవస్వతుఁ డబ్జగర్భువచనం బాలించి సద్భక్తితో దేవా! దేవర యాజ్ఞగాదె జగముల్ దీపించు? మీ పల్కు స ద్భావం బొందెడునట్టులేను నసురం బ్రాణంబుతోఁగాచితిన్ లావుం జేవయుఁగల్గియున్ విముఖులీలన్ బోయెదన్ వీటికిన్ | 363 |
| కం. | మాటికి మీ యానతి జవ దాఁటక నడుచుటయె గెలుపు దనుజునిచే నా కోటమి గలిగెఁ గదా యన నేటి కని రథంబుతో నదృశ్యుం డయ్యెన్ | 364 |
| శా. | కీనాశుండిటు లేఁగఁ బద్మభవుఁడున్ గీర్వాణ సంఘంబుతోఁ దానంతర్థి వహించె నారదుఁడు యుద్ధం బెంచుచుం బోయె లం కానాథుండును శత్రుఁడోడె ననుచున్ గౌతూహలంబొంది దై త్యానీకాన్వితుఁడై రసాతలజయేచ్ఛాయత్త చిత్తంబునన్ | 365 |